శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ ఖాతాలో రెండో ‘డ్రా’ | Srinidhi Deccan Football Club second draw added to their teams account | Sakshi
Sakshi News home page

శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ ఖాతాలో రెండో ‘డ్రా’

Apr 3 2026 3:59 AM | Updated on Apr 3 2026 10:31 AM

Srinidhi Deccan Football Club second draw added to their teams account

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఐఎఫ్‌ఎల్‌)లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు ఖాతాలో రెండో ‘డ్రా’ చేరింది. షిల్లాంగ్‌ లాజోంగ్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్‌ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. శ్రీనిధి జట్టు గోల్‌కీపర్‌ కమల్జీత్‌ సింగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

ఈ మ్యాచ్‌లో  హెడ్‌ కోచ్‌ కార్లోస్‌ వాజ్‌ పింటో శ్రీనిధి తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. నానాటో లూయిస్, వాన్‌లాన్‌రెమ్డికా జట్టులోకి వచ్చారు. ఆట 11వ నిమిషంలో శ్రీనిధి కెపె్టన్‌ డేవిడ్‌ కాస్టనెడా కొట్టిన షాట్‌ను షిల్లాంగ్‌ గోల్‌కీపర్‌ రింబాయ్‌ అడ్డుకున్నాడు. చివర్లో 86వ నిమిషంలో పౌలో సెజార్‌ హెడర్‌ను మరోసారి రింబాయ్‌ నిలువరించాడు. మ్యాచ్‌ ‘డ్రా’ కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ లభించింది. 

పది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో శ్రీనిధి డెక్కన్‌ జట్టు ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. డైమండ్‌ హార్బర్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. శ్రీనిధి జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను హైదరాబాద్‌లో ఈనెల ఐదో తేదీన ఐజ్వాల్‌ ఎఫ్‌సీ జట్టుతో ఆడుతుంది.    

Advertisement
 
Advertisement
Advertisement