ముంబై ఇండియన్స్‌లోకి ఆసీస్‌ మాజీ కెప్టెన్? | Aaron Finch To Join Mumbai Indians As Assistant Coach: Report | Sakshi
Sakshi News home page

IPL 2027: ముంబై ఇండియన్స్‌లోకి ఆసీస్‌ మాజీ కెప్టెన్?

Oct 26 2026 1:45 PM | Updated on Oct 26 2026 2:27 PM

Aaron Finch To Join Mumbai Indians As Assistant Coach: Report

ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ఐదుసార్లు విజేత అయిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే హెడ్ కోచ్‌గా ఉన్న మహేలా జయవర్ధనే స్థానంలో కీరన్ పొలార్డ్‌ను నియమించిన ముంబై ఫ్రాంచైజీ.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ నూతన అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం పేర్కొంది.

ఆరోన్ ఫించ్‌కు ఇప్పటివరకు పూర్తిస్థాయి కోచింగ్ అనుభవం లేకపోయినప్పటికీ, అంతర్జాతీయ టీ20ల్లో ఆటగాడిగా, కెప్టెన్‌గా అపారమైన అనుభ‌వం ఉంది. అతడి సారథ్యంలోనే ఆస్ట్రేలియా జట్టు 2021 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా, గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున కూడా ఫించ్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ అనుభవాన్నే పరిగణనలోకి తీసుకుని అతడికి అసిస్టెంట్ కోచ్ బాధ్యతలు అప్పగించేందుకు ముంబై యాజమాన్యం మొగ్గు చూపుతోంది.

మరోవైపు జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాదీ టి. దిలీప్ ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి వరకు టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా విజయవంతమైన సేవలు అందించిన దిలీప్, ఇప్పుడు ముంబై కోచింగ్ స్టాఫ్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అయితే బౌలింగ్ కోచ్‌లుగా లసిత్ మలింగ, పారస్ మాంబ్రేలను ముంబై ఇండియన్స్ కొనసాగించనున్నట్లు సమాచారం.

కెప్టెన్సీలోనూ మార్పు?
రాబోయే సీజన్ నాటికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్థానంలో యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మను నూతన సారథిగా నియమించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement