‘ఇంతకంటే ఇంకేం చేయాలి?.. అతడిని బలిపశువును చేశారు’ | He Made Scapegoat Mumbai Indians Lacked Leadership: IND Ex Star | Sakshi
Sakshi News home page

‘వేలు పట్టుకుని అన్నీ నేర్పించాలా?.. అతడిని బలిపశువును చేశారు’

Oct 23 2026 2:00 PM | Updated on Oct 23 2026 2:38 PM

He Made Scapegoat Mumbai Indians Lacked Leadership: IND Ex Star

హార్దిక్‌ పాండ్యాతో జయవర్దనె (PC: MI/IPL)

ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన మొట్టమొదటి జట్టుగా పేరొందిన ముంబై ఇండియన్స్‌.. గత కొన్నేళ్లుగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది. గత ఆరు సీజన్లలో ముంబై జట్టు కేవలం రెండుసార్లు మాత్రమే ప్లే ఆఫ్స్‌ చేరింది. ఇక 2024లో కెప్టెన్‌గా దిగ్గజం రోహిత్‌ శర్మను తొలగించి.. హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించగా.. ముంబైకి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

వరుస వైఫల్యాలు
సారథిగా తొలి ప్రయత్నంలోనే హార్దిక్‌ చెత్త ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను అట్టడుగున పదోస్థానంలో నిలిపాడు. ఇక 2025లో జట్టు ప్లే ఆఫ్స్‌ చేరినప్పటికీ.. ఐపీఎల్‌-2026లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఈసారి జట్టు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.

అతడిపై వేటు!
ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌ మహేళ జయవర్దనె ఇటీవలే పదవి నుంచి తప్పుకొన్నాడు. కాగా ఈ శ్రీలంక దిగ్గజం 2025, 2026 సీజన్‌లలో  జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అంతకు ముందు 2017 నుంచి 2022 వరకు కూడా జయవర్ధనే ఆరు సీజన్ల పాటు కోచ్‌గా పని చేశాడు.

ఇదిలా ఉంటే.. 2020లో విజేతగా నిలిచిన తర్వాత వరుసగా ఆరు సీజన్లలో ముంబై విఫలమైంది. ఈ నేపథ్యంలో టీమ్‌లో ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందిని కూడా మార్చాలనే అంశంపై ముంబై యాజమాన్యం తీవ్రంగా చర్చిస్తోంది. ఈ క్రమంలోనే జయవర్ధనే తాను టీమ్‌ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మూడు సార్లు టైటిల్‌
జయవర్ధనే హెడ్‌ కోచ్‌గా ఉన్న సమయంలోనే ముంబై మూడు సార్లు టైటిల్‌ సాధించింది. 2024 వరకు మూడేళ్ల పాటు అతను ముంబై ఇండియన్స్‌ ‘గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ పెర్ఫార్మెన్స్‌’ హోదాలో యాజమాన్యానికి చెందిన ఇతర ఫ్రాంచైజీలు ఎమిరేట్స్‌ (ఐఎల్‌టి20), న్యూయార్క్‌ (ఎంఎల్‌సీ), కేప్‌టౌన్‌ (ఎస్‌ఏ20) జట్ల బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. అయినా సరే జయవర్దనె జట్టును వీడటం వెనుక యాజమాన్యం ఒత్తిడి ఉందనే విమర్శలు వచ్చాయి.

అతడిని బలిపశువును చేశారు
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సుబ్రమణ్యం బద్రీనాథ్‌ ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ తీరును తప్పుబట్టాడు. ‘‘జయవర్దనె ముంబై హెడ్‌కోచ్‌గా అద్భుత విజయాలు సాధించాడు. అతడి మార్గదర్శనంలో జట్టు మూడు టైటిళ్లు గెలిచింది. అయినా సరే ఇటీవలి కాలంలో జట్టు వైఫల్యాలకు అతడిని బాధ్యుడిని చేస్తూ బలిపశువును చేశారు.

వేలు పట్టుకుని అన్నీ నేర్పించాలా?
హెడ్‌కోచ్‌గా అతడు ఇంతకంటే ఇంకేం చేయగలడు? ముంబై జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అయినా సరే ఏదీ కలిసిరావడం లేదు. జయవర్దనె హార్దిక్‌ పాండ్యాకు ఎలా బౌలింగ్‌ చేయాలో నేర్పాలా? లేదంటే రోహిత్‌ శర్మకు పుల్‌ షాట్‌ ఎలా ఆడాలో చెప్పాలా? అదీ కాదంటే జస్‌ప్రీత్‌ బుమ్రాకు యార్కర్లు ఎలా వేయాలో చూపించాలా?..

ఇప్పటికే వాళ్లంతా తమను తాము నిరూపించుకున్న ఆటగాళ్లు. కాబట్టి జయవర్దనె ఇంకేం చేయగలడు? ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు ఎప్పుడు జట్టులో మార్పులు చేయాలన్నా ముందుగా హెడ్‌కోచ్‌లనే బలిపశువులను చేస్తాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌కు వీడ్కోలు పలికింది.

సరైన నాయకత్వం లేదు
ఇటు మహేళ.. అటు ఫ్లెమింగ్‌ ఇద్దరూ బలిపశువులు అయ్యారు. నిజానికి ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై, చెన్నై జట్లకు గత కొన్నేళ్లుగా సరైన నాయకత్వం లేదు. అందుకే వరుస వైఫల్యాలు. కానీ వాళ్లు మాత్రం హెడ్‌కోచ్‌లపై వేటు వేశారు.

ఒకవేళ ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మను తిరిగి కెప్టెన్‌గా నియమించి.. రాహుల్‌ ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా తీసుకువస్తే కచ్చితంగా జట్టు రాణించగలుగుతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లోనే టీమిండియా 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన విషయం గుర్తుపెట్టుకోవాలి’’ అని బద్రీనాథ్‌ పేర్కొన్నాడు.

చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement