టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీలో తన మార్క్ చూపించలేకపోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ భువీ విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఒక్క వికెట్ పడగొట్టకుండా 49 పరుగులు సమర్పించుకున్నాడు. రెండో టీ20లో ఓ వికెట్ తీసినప్పటికి తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 50 పరుగులిచ్చాడు. దీంతో అతడిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భువనేశ్వర్‌కు మద్దతుగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ పట్ల ఓపికగా ఉండాలని అభిమానులకు, విశ్లేషకులకు కైఫ్ విజ్ఞప్తి చేశాడు.
"అతడు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి తిరిగొచ్చాడు. కాబట్టి అతడికి కొంత సమయం ఇవ్వండి. కేవలం రెండు మ్యాచ్‌లే పూర్తయ్యాయి. ఈ నాలుగేళ్లలో క్రికెట్ విధానం ఎంతో మారింది. అతడు రాగానే మొదటి బంతికే వికెట్ తీస్తాడని అనుకోవడం సరికాదు. న్యూజిలాండ్‌లో బంతి బాగా స్వింగ్ అవుతుందని భావించారు.
కానీ ఇక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తున్నాయి. అంతేకాకుండా న్యూజిలాండ్ ఎంత బలమైన జట్టు మనందరికి తెలుసు. ఇప్పుడే అతడి ప్రదర్శన పట్ల ఓ అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. అతడు నో బాల్స్ దృష్టి పెట్టాలి.
నాలుగు ఓవర్లలో 50 పరుగులు అని చూపిస్తున్నా, ఓవర్ల వారీగా పరిశీలిస్తే బౌలింగ్ బాగానే ఉంది. మొత్తం సిరీస్ పూర్తయ్యే వరకు వేచి చూసి, ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని వెల్లడించండి" అని యూట్యూబ్ ఛానల్‌లో కైఫ్ పేర్కొన్నాడు.
చదవండి: PAK vs ENG: చరిత్ర సృష్టించిన షాహీన్ షా అఫ్రిది


