‘ఆ క్రెడిట్‌ అగార్కర్‌కే ఇవ్వాలి.. నిజంగా అదొక కఠిన నిర్ణయం’ | Credit should go to Ajit: Ex India selector on why SKY was picked T20I captain | Sakshi
Sakshi News home page

‘ఆ క్రెడిట్‌ అగార్కర్‌కే ఇవ్వాలి.. నిజంగా అదొక కఠిన నిర్ణయం’

Oct 26 2026 3:30 PM | Updated on Oct 26 2026 3:43 PM

Credit should go to Ajit: Ex India selector on why SKY was picked T20I captain

సూర్య, హార్దిక్‌ (PC: BCCI)

టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌కు గొప్ప రికార్డు ఉంది. అతడి సారథ్యంలో భారత్‌ ఒక్క టీ20 సిరీస్‌ కూడా కోల్పోలేదు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 52 మ్యాచ్‌లలో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్య.. 40 టీ20లు గెలిచాడు.

వరల్డ్‌కప్‌ అందించిన సారథి.. జట్టులో చోటే లేదు
అంతేకాదు.. స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కెప్టెన్‌గా టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన ఘనత సూర్యకుమార్‌కు ఉంది. అయితే, అనూహ్య రీతిలో ఈ మెగా ఈవెంట్‌ తర్వాత భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా.. జట్టు నుంచి కూడా తీసేసింది. బ్యాటర్‌గా వరుస వైఫల్యాలే ఇందుకు కారణం.

అయితే, సూర్య కెప్టెన్‌గా రావడం కూడా ఆశ్చకరంగానే జరిగింది.  టీ20 ప్రపంచకప్‌-2024 టైటిల్‌ను టీమిండియా గెలుచుకున్న తర్వాత అప్పటి సారథి రోహిత్‌ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకే టీ20 పగ్గాలు ఇస్తారని అంతా భావించారు.

హార్దిక్‌ను కాదని
కానీ అనూహ్య రీతిలో యాజమాన్యం హార్దిక్‌ను కాదని సూర్యను కెప్టెన్‌గా నియమించింది. మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్న సూర్య విజయవంతమైన సారథిగా పేరు సంపాదించాడు. ఈ విషయం గురించి టీమిండియా మాజీ సెలక్టర్‌ శ్రీధరన్‌ శరత్‌ తాజాగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడాడు.

క్రెడిట్‌ మొత్తం అగార్కర్‌కే ఇవ్వాలి
‘‘భారత క్రికెట్‌ జట్టులో నాయకులకు కొదవలేదు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలతో పాటు జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు ఉన్నారు. అయితే, సూర్యకుమార్‌ పట్టుదల కలిగినవాడు. అతడు టీమ్‌ మ్యాన్‌.

కాబట్టి రోహిత్‌ తర్వాత అతడే సరైన కెప్టెన్‌ అని మేము భావించాము. మా నమ్మకాన్ని అతడు నిజం చేశాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఒక్క టీ20 సిరీస్‌ కూడా ఓడిపోలేదు. ఏదేమైనా సూర్యను సారథిగా ఎంపిక చేయడంలో క్రెడిట్‌ మొత్తం అజిత్‌ అగార్కర్‌కే ఇవ్వాలి.

అతడే ఇంతటి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హార్దిక్‌ పాండ్యాను కాదని సూర్యను కెప్టెన్‌గా ఎంపిక చేయడం అంతతేలికగా ఏమీ జరగలేదు’’ అని శరత్‌ పేర్కొన్నాడు. 

కాగా అరుదైన పేస్‌ బౌలింగ్‌ నైపుణ్యాలున్న హార్దిక్‌ పాండ్యాను కాపాడుకోవాల్సి ఉందని.. ఫిట్‌నెస్‌ సమస్యల వల్లే అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయలేదని అప్పటి చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవలే అతడు పదవి నుంచి తప్పుకోగా.. ప్రజ్ఞాన్‌ ఓజా తాత్కాలిక చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. 

చదవండి: AUS vs SA: క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement