breaking news
jsca
-
1500 టికెట్లే అమ్ముడుపోయాయి!
ప్రపంచవ్యాప్తంగా ఏవో కొన్ని ప్రతిష్టాత్మక వేదికల్లో మినహా టెస్టు క్రికెట్‌కు అంతగా ఆదరణ దక్కడం లేదు. క్రికెట్‌ను చిన్న నగరాలకు కూడా చేర్చే ప్రయత్నంలో బీసీసీఐ ఇలాంటి వేదికల్లో టెస్టులు నిర్వహిస్తోంది. అయితే ఏం చేసినా వాటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ అంతంత మాత్రమే. తాజాగా రాంచీ టెస్టులో ఇది మళ్లీ నిరూపితమైంది. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా... ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్‌కు 1500 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్సీఏ) ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాగే ఉంటే ఇకపై టెస్టుకు ఆతిథ్యం ఇవ్వడంపై పునరాలోచించుకోవాల్సి ఉంటుందని జేఎస్సీఏ అధ్యక్షుడు నఫీస్ ఖాన్ అన్నారు. గ్యాలరీలు ఖాళీగా కనిపించకుండా పెద్ద మొత్తంలో కాంప్లిమెంటరీ పాస్‌లు పంపించినా అమ్ముడుపోయిన టికెట్ల విషయంలో మాత్రం తాము తీవ్రంగా నిరాశ చెందామని ఆయన చెప్పారు. సీఆర్పీఎఫ్కు 5వేలు, పాఠశాల విద్యార్థుల కోసం మరో 10 వేలు టికెట్లు ఉచితంగా అందిస్తున్నారు. -
'కోహ్లి ఏమీ చెప్పలేదే'
రాంచీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు సంబంధించి ఫలాన పిచ్ కావాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అడిగాడంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్సీఏ) స్టేడియం క్యూరేటర్ ఎస్ బీ సింగ్ స్పష్టం చేశారు. మూడో టెస్టు మ్యాచ్ పిచ్ కు సంబంధించి విరాట్ కోహ్లి తమతో కలిసినట్లు ఆస్ట్రేలియన్ దినపత్రిక ప్రచురించిన వార్తల్లో నిజం లేదన్నారు. మరొకవైపు పిచ్ రూపకల్పనపై విరాట్ పాత్ర లేదనే విషయాన్ని జేఎస్సీఏ జాయింట్ సెక్రటరీ దేబాశిస్ చక్రబొర్తి సైతం ఖండించారు. 'ఎస్ బీ సింగ్ చెప్పింది ముమ్మాటికీ నిజం. రాంచీలో జరిగే టెస్టు మ్యాచ్ నిర్వహణకు మూడు పిచ్ లను తయారు చేసిన మాట వాస్తవం. ఆ విషయాన్నేచెప్పాం. అంతేకానీ పిచ్ రూపకల్పనలో విరాట్ పాత్ర ఉన్న విషయాన్ని క్యూరేటర్ ఎక్కడా చెప్పలేదు. ఆ పిచ్ తయారీపై కోహ్లి కూడా క్యూరేటర్లకు ఏమీ చెప్పలేదే. మరి అటువంటప్పుడు ఆ కథనాల్ని ఎలా ప్రచురిస్తారు. ఇక్కడ 4,5,7 నంబర్లు గల పిచ్ లను తయారు చేసి ఉంచాం. మ్యాచ్ నిర్వహణ అధికారులు వచ్చి ఫలాన పిచ్ ను సిద్ధం చేయమని చెప్పిన తరువాత మాత్రమే ఆ రకంగా ముందుకు వెళతాం. అప్పటివరకూ కొన్ని పిచ్ లను తయారు చేసి పక్కకు పెడతాం. భారత జట్టుకు అనుకూలంగా పిచ్ ను తయారు చేయమన్నారని కోహ్లి చెప్పినట్లు వచ్చిన వార్తలు నిజం కాదు'అని దేబాశిస్ చక్రబొర్తి తెలిపారు. మార్చి 16వ తేదీన ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రాంచీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.