భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్ మెట్రోకు ప్రయాణికుల కొరత ఆర్థిక సవాలుగా మారింది. రోజువారీ నిర్వహణకు సుమారు రూ.5 లక్షలు ఖర్చవుతుండగా.. నెల మొత్తం టికెట్ల విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయం కేవలం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మాత్రమే ఉంటోంది. అంటే ఒక్క రోజు నిర్వహణకు అయ్యే ఖర్చును సంపాదించడానికి నెల రోజుల టికెట్ల ఆదాయం సరిపోతోంది. అయితే ప్రజా రవాణా వ్యవస్థను కేవలం లాభనష్టాల కోణంలోనే చూడకూడదని మెట్రో అధికారులు చెబుతున్నారు.
భోపాల్‌లోని ఎయిమ్స్ నుంచి సుభాష్ నగర్ వరకు సుమారు ఏడు కిలోమీటర్ల ప్రాధాన్య కారిడార్‌లో 2025 డిసెంబరులో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మార్గంలో ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ప్రజలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తొలుత ఆశించారు. అయితే ప్రస్తుతం ఈ పరిమిత మార్గంలో ప్రయాణికుల సంఖ్య ఆశించిన స్థాయికి చేరలేదు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం నెలకు సుమారు 13 వేల నుంచి 15 వేల మంది మాత్రమే మెట్రోలో ప్రయాణిస్తున్నారు.
భోపాల్ మెట్రో నిర్వహణకు ప్రతిరోజూ సుమారు రూ.5 లక్షలు ఖర్చవుతోంది. ఈ లెక్కన నెలవారీ నిర్వహణ వ్యయం దాదాపు రూ.1.5 కోట్లకు చేరుతుంది. మరోవైపు టికెట్ల ద్వారా నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం మాత్రమే వస్తోంది. నిర్వహణ వ్యయానికి, టికెట్ల ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే ఈ లెక్కలు నిర్వహణ ఖర్చులు, టికెట్ల ద్వారా వచ్చే ఆదాయానికి మాత్రమే సంబంధించినవి. ప్రకటనలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడే మెట్రో మొత్తం ఆదాయంపై స్పష్టత వస్తుంది.
టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం పరిమితంగా ఉండటంతో ఇతర మార్గాల్లోనూ ఆదాయాన్ని పెంచుకునేందుకు మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు. మెట్రోలో పుట్టినరోజు వేడుకలు, కిట్టీ పార్టీలు, ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్లు నిర్వహించుకునే సదుపాయాలను అందిస్తున్నారు. వీటితోపాటు ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈ కార్యకలాపాల ద్వారా ఇప్పటివరకు ఎంత అదనపు ఆదాయం వచ్చిందనే పూర్తి వివరాలు వెల్లడికాలేదు. టికెట్ల ఆదాయంపై ఆధారపడకుండా ఇతర వాణిజ్య అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా నిర్వహణ భారాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: బొగ్గు గని ప్రమాదం: 200 అడుగుల లోతులో 14 మంది కార్మికులు విలవిల!


