ఆస్పత్రి బిల్లుల మోత.. బడి ఫీజుల వాత! | An average expenditure of Rs 52743 is incurred per hospital admission | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి బిల్లుల మోత.. బడి ఫీజుల వాత!

Oct 22 2026 5:03 AM | Updated on Oct 22 2026 5:03 AM

An average expenditure of Rs 52743 is incurred per hospital admission

ఇంటి బడ్జెట్‌లో సింహభాగం ‘ప్రైవేటు’దే 

రాష్ట్రంలో ఒకప్పుడు బియ్యం, పప్పులు, నూనెలకే ఎక్కువ ఖర్చు 

ప్రస్తుతం మారిన లెక్కలు 

ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే సగటున రూ.52,743 వ్యయం 

ఒక్కో విద్యార్థి పాఠశాల చదువుకు ఏటా సగటున రూ.20,590 ఖర్చు

ఈ రెండూ జాతీయ సగటు కంటే 40%, 63% చొప్పున ఎక్కువ 

కేంద్ర సర్వేలు,అధ్యయనాల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ :  ఒకప్పుడు ఇంటి బడ్జెట్‌లో సింహభాగం బియ్యం, పప్పులు, నూనెలకే పోయేది. ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు, ప్రైవేటు బడుల ఫీజులు, నగరాల్లో ఇంటి అద్దెలు, బయటి తిండి ఆక్రమించాయి. తాజా గృహ వినియోగ వ్యయ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రకారం.. రాష్ట్రంలో పట్టణ జీవి సగటు నెలవారీ ఖర్చు రూ.8,978. గ్రామీణ వ్యక్తి ఖర్చు రూ.5,435. ఈ రెండూ దేశ సగటు కంటే 28 నుంచి 32 శాతం ఎక్కువ. నగరాల్లో సగం మంది నెలకు రూ.7,745 కంటే తక్కువ ఖర్చు చేస్తుండగా, ఆర్థికంగా మెరుగ్గా ఉన్న 10 శాతం మంది రూ.13,923కు పైగా వెచ్చిస్తున్నారు. 

దారిద్య్రరేఖకు అడుగున ఉన్న 10 శాతం మంది ఖర్చు రూ.4,844 లోపే. కేంద్ర గణాంకాల శాఖ (ఎంవోఎస్‌పీఐ) గృహ వినియోగ వ్యయ సర్వే, జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) 80వ రౌండ్‌ ఆరోగ్య, విద్యా సర్వేలు, యూడైస్‌ ప్లస్‌ గణాంకాలు, జాతీయ ప్రజా ఆర్థిక విధాన సంస్థ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) అధ్యయనాలు.. ఇలా అన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి. ప్రభుత్వం అందించాల్సిన చదువు, వైద్యం వంటి సేవల కోసం ప్రజలు తమ జేబు నుంచే భారీగా ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజల నెలవారీ ఖర్చులు పెరగడానికి ఇవే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 

ఆసుపత్రి బిల్లు.. దేశంలోనే అత్యధికం  
ఇంటి బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్న మొదటి అంశం వైద్య ఖర్చు. ఎన్‌ఎస్‌ఎస్‌ 80వ రౌండ్‌ ’కుటుంబాల సామాజిక వినియోగం: ఆరోగ్యం’ సర్వే (2025) ప్రకారం తెలంగాణలో ఒక వ్యక్తి ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే సగటున రూ.52,743 ఖర్చవుతోంది. దేశంలోని రాష్ట్రాలన్నింటిలో ఇదే అత్యధికం. జాతీయ సగటు రూ.37,858తో పోలిస్తే ఇది దాదాపు 40 శాతం ఎక్కువ. ఇందులో బీమాలు, ప్రభుత్వ పథకాలు పోగా రోగి కుటుంబం జేబు నుంచి నేరుగా చెల్లిస్తున్నదే రూ.46,316. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరినప్పుడుతో పోల్చుకుంటే ప్రైవేటు వైద్యం 12 రెట్లు ఎక్కువ ఖరీదు అవుతోంది. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్యానికి కేటాయింపులు 4.6 శాతం, జీఎస్‌డీపీలో ఒక్క శాతమే ఉండటం, జాతీయ ఆరోగ్య విధానం సూచించిన 8 శాతానికి చాలా దూరంలో ఉండటంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వైపు వెళ్లక తప్పడం లేదని నిపుణులు చెబుతున్నారు.  

సర్కారు బడి ఖాళీ.. ప్రైవేటు ఫీజు భారీ 
రెండో పెద్ద భారం పిల్లల చదువు. యూడైస్‌ ప్లస్‌ గణా ంకాల ప్రకారం 2016–17లో రాష్ట్రంలో 53.4% మంది విద్యార్థులు ప్రైవేటు బడుల్లో చదువుతుండగా, 2025–26 నాటికి ఇది 64.5 శాతానికి చేరింది. అదే సమయంలో ప్రభుత్వ బడుల వాటా 43.9% నుంచి 34.5 శాతా నికి పడిపోయింది. ఒక్క ఏడాదిలోనే 1,969 ప్రభుత్వ బడులు తగ్గగా, 771 ప్రైవే టు బడులు కొత్తగా వచ్చా యి. ఎన్‌ఎస్‌ఎస్‌ సమగ్ర విద్యా సర్వే (2025) ప్రకా రం రాష్ట్రంలో ఒక్కో విద్యార్థి పాఠశాల చదువుకు కుటుంబాలు ఏడాదికి సగటున రూ.20,590 ఖర్చు చేస్తున్నా యి. దేశ సగటు రూ.12,616తో పోలిస్తే ఇది 63 శాతం ఎక్కువ. 

ఈ విషయంలో రాష్ట్రం దేశంలో ఐదో స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ బడిలో ఒక్కో విద్యార్థికిఏడాదికి రూ.2,863 ఖర్చయితే, ప్రైవేటు బడిలో రూ.25,002..అంటే దాదాపు 9 రెట్లు ఎక్కువ ఖర్చవుతోంది. నగర కుటుంబాల ఆహారేతర ఖర్చులో చదువు వాటా దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో (12.79%) ఉండటం గమనార్హం. విద్యపై రాష్ట్ర ప్రభుత్వ తలసరి వ్యయం దేశ సగటు కంటే 38% తక్కువగా, దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యల్పంగా ఉందని హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆర్థికశాస్త్ర ఆచార్యుడు డి. నరసింహారెడ్డి తన అధ్యయనంలో పేర్కొన్నారు.

తగ్గిన ఇంటి వంట .. పెరిగిన హోటల్‌ తిండ్లు 
తిండి ఖర్చు స్వరూపమూ పూర్తిగా మారిపోయిందని జాతీయ సర్వేలు చెపుతున్నాయి. ఎంవోఎస్‌పీఐ పోషకాహార నివేదిక ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల ఖర్చులో ఆహారం వాటా 49.4 శాతం నుంచి 48.9 శాతానికి, పట్టణాల్లో 40.4 శాతం నుంచి 38.8 శాతానికి తగ్గింది. అంటే నగర కుటుంబం ప్రతి వంద రూపాయల్లో 61 రూపాయలు ఆహారేతర అవసరాలకే ఖర్చు చేస్తోంది. 

అదే సమయంలో ఇంట్లో వండుకునే భోజనాలూ తగ్గుతున్నాయి. పట్టణాల్లో ఒక కుటుంబం ఇంట్లో తినే భోజనాల సంఖ్య ఒక్క ఏడాదిలోనే 262 నుంచి 232కు పడిపోయింది. ఇక పట్టణ కుటుంబాల ఆహార బడ్జెట్‌లో మూడో వంతు (33.63 శాతం) పానీయాలు, ప్యాకెట్‌ ఆహారం, హోటల్‌ తిండికే పోతోంది. ఉరుకుల పరుగుల ఉద్యోగ జీవితం, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లు ఈ మార్పునకు కారణమని నిపుణులు చెబుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement