నదిలో వేలాది ఓటర్‌ ఐడీ కార్డులు.. ఓట్ల చోరీ జరిగిందా? | Voter ID cards found in Narmada river, Madhya Pradesh: Video Viral | Sakshi
Sakshi News home page

నదిలో వేలాది ఓటర్‌ ఐడీ కార్డులు.. ఓట్ల చోరీ జరిగిందా?

Oct 26 2026 10:23 AM | Updated on Oct 26 2026 10:35 AM

Voter ID cards found in Narmada river, Madhya Pradesh: Video Viral

ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన ఓటర్ల గుర్తింపు కార్డులే నది ఒడ్డున గుట్టలుగా కనిపిస్తే? ఓటు హక్కు భద్రతపై అనుమానాలు రేకెత్తితే? మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. నర్మదా నది ఒడ్డున వేలాది ఓటర్‌ ఐడీ కార్డులు బయటపడటంతో తీవ్ర కలకలం చెలరేగింది. అసలు ఆ కార్డులు అక్కడికి ఎలా చేరాయి? ఎవరు పడేశారు? ఓటర్ల హక్కులతో ఎవరైనా ఆటలాడారా? కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్‌ చేస్తుండగా.. అధికారులు విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లాలో మండ్లేశ్వర్‌ వద్ద నర్మదా ఘాట్‌ సమీపంలో ఓటర్‌ ఐడీ కార్డులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని ఆదివారం ఉదయం పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న నిస్వార్థ సేవా సమితి సభ్యులు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటి వివరాలను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇండోర్‌ ఓటర్ల కార్డులేనా?
ఈ ఘటనలో బయటపడిన కార్డుల్లో ఎక్కువ భాగం ఇండోర్‌లోని రావు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లకు చెందినవిగా భావిస్తున్నారు. అయితే, ఈ కార్డులు అక్కడికి ఎలా వచ్చాయి? ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాయి? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పడేశారా? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు. అసలు ఎన్ని కార్డులు లభించాయన్నది కూడా అధికారులు నిర్ధారించాల్సి ఉంది.

కాంగ్రెస్‌ ఆగ్రహం..
ఈ ఘటనపై కాంగ్రెస్‌ కార్యకర్తలు మండ్లేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. స్వాధీనం చేసుకున్న కార్డుల్లో కొన్నింటిని పోలీసు అధికారులకు అందజేసి, కేసు నమోదు చేయాలని కోరారు. ఖర్గోన్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రవి నాయక్‌ మాట్లాడుతూ, ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్‌ ఐడీ కార్డులు నది ఒడ్డున కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఎన్నికల అక్రమాలు జరిగాయా అనే కోణంలోనూ నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. మహేశ్వర్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ పూర్వ మండ్లోయ్‌ ఈ ఘటనను ధ్రువీకరించారు. విచారణ కోసం తహసీల్దార్‌ను పంపినట్లు తెలిపారు. పోలీసులకు కూడా లిఖితపూర్వక ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఎవరు అక్కడ పడేశారు, వాటి వెనుక నిర్లక్ష్యం ఉందా? లేక ఉద్దేశపూర్వక చర్య ఉందా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఓటు హక్కుకు భద్రత ఉందా?
ఓటర్‌ ఐడీ కార్డులు పెద్ద సంఖ్యలో ఒకేచోట బయటపడటం ఆందోళన కలిగించే విషయమే. కార్డుల యజమానులు, వాటి స్థితి, ఎన్నికల రికార్డులతో వాటి సంబంధం వంటి అంశాలపై విచారణ పూర్తయితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు అందరి దృష్టి దర్యాప్తుపైనే ఉంది. నర్మదా నది ఒడ్డున ఓటర్‌ ఐడీ కార్డులు ఎందుకు కనిపించాయి? ఇది సాధారణ నిర్లక్ష్యమా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనేది తేలాల్సి ఉంది. 

ఇదీ చదవండి: అంకితా భండారీ కేసులో మరో ట్విస్ట్‌.. నటి ఉర్మిళ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement