ఏపీలో ఏం జరుగుతోంది.. ప్రజాస్వామ్యం ఉందా అసలు? | National level concern over local elections in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఏం జరుగుతోంది.. ప్రజాస్వామ్యం ఉందా అసలు?

Oct 25 2026 5:29 AM | Updated on Oct 25 2026 5:29 AM

National level concern over local elections in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలపై జాతీయ స్థాయిలో ఆందోళన

ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి అంతులేని అరాచకాలు

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపైనే దౌర్జన్యాలు

నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న పచ్చమూకలు

మహిళలని కూడా చూడకుండా అనాగరికం

అధికార పక్షం ఆగడాలకు అండగా మారిన చట్టం

ఇదేనా ప్రజాస్వామ్యం అని నిలదీస్తున్న జనం

సామాజిక మాధ్యమాల్లో టీడీపీపై తీవ్ర విమర్శలు

టీడీపీ కూటమిపై జాతీయ స్థాయిలో పెరిగిన వ్యతిరేకత

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు, మహిళా నాయకులపట్ల చంద్రబాబు ప్రభుత్వ తీరు, పోలీసుల వ్యవహారశైలిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు నెట్టివేసి కిందపడేసిన వీడియో వైరల్‌ కావడంతో పలువురు జాతీయ ప్రముఖులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలు స్పందించారు. పోలీసుల ప్రవర్తన, ఎన్నికల వేళ ప్రతిపక్ష అభ్యర్థులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయా?, అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ ఏం చేస్తోంది? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

‘ఎన్నికల సంఘం ఏం చేస్తోంది’
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు, పోలీసుల వ్యవహారశైలిపై వస్తున్న విమర్శలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పరిణామాలపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరుగుతోంది. అభ్యర్థులందరికీ నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం, ఓటర్లకు స్వేచ్ఛగా ఓటువేసే పరిస్థితులు కల్పించడం ఎన్నికల ప్రక్రియలో కీలకం. కానీ.. ఏపీలో ఇంత జరుగుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోంది. అని రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

‘పోటీచేసే అవకాశం లేకపోతే ఓటెలా వేస్తారు’
రాజకీయ వ్యాఖ్యాత అల్కా మౌర్య కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలని చెబుతాం. కానీ పోటీ చేయాలనుకునే వ్యక్తి కనీసం నామినేషన్‌ కూడా దాఖలు చేయలేని పరిస్థితి ఉంటే ప్రజలు ఎవరికి ఓటు వేయాలి’ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయని, పోలీసులు వాటిని అడ్డుకోకుండా వేడుక చూస్తున్నారని విమర్శించారు.

‘మీ కళ్లముందే జరుగుతోంది’
సీనియర్‌ జర్నలిస్టు రవీశ్‌కుమార్‌ కూడా ఎన్ని­కల ప్రక్రియపై విమర్శలు చేశారు. ‘అంతా మీ కళ్ల ముందే ఉంది. యూపీలో ఓటర్ల జాబితా సమస్య, ఆంధ్రలో నామినేషన్లు అడ్డుకుంటున్నారనే ప్రచారం. ఈ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిని కూడా సమర్ధించుకోవడానికి ప్రజలు డెబ్బైల నాటి కథలను వెతికి మరీ తీసుకువస్తారు’ అని ఏపీలో ఎన్ని­కల నిర్వహణలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘దేశం తీవ్ర ప్రమాదంలో ఉంది’
సౌరవ్‌దాస్‌ అనే సామాజిక కార్యకర్త స్పందిస్తూ.. ‘ప్రస్తుత వ్యవస్థను మనం ఇందుకే ప్రక్షాళన చేయా­లి. మన దేశం తీవ్ర ప్రమాదంలో ఉంది’ అని వ్యా­ఖ్యానించారు. ఏపీలో ఎన్ని­కల్లో పోటీచేసే అభ్యర్థులకు ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజాస్వామ్య వ్య­వస్థ పనితీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

‘మాజీ మంత్రినే పడదోస్తారా’
మహారాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి అతు­ల్‌ లోంధే పాటిల్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ.. విడదల రజినికి సంబంధించిన వీడియోను పోస్టుచేసి పోలీసుల తీరును ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఆరోగ్య శాఖ మంత్రిని నేలపై పడదోశారు’ అని విమర్శించారు. ఈ ఘటనలో పోలీసుల ప్రవర్తనను ఆయన తప్పుబట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది?
ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న రాజ­కీయ ఉద్రి­క్తతలు, హింసకు సంబంధించిన పరిణామాలపై స్పందిస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది’ అని ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. రజినికి సంబంధించిన వీడియోను ఆయన షేర్‌ చేశారు. 

‘ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి’
నమ్రా పటేల్‌ అనే నెటిజన్‌ ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ప్రతిపక్ష అభ్యర్థుల కుటుంబాలను, అసమ్మతిని స్వేచ్ఛగా వ్యక్తం చేయాలనుకునే పౌరులను రక్షించడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పాలనా తీరును విమర్శిస్తూ.. ‘అధికార దాహంలో విధులను విస్మరించారు’ అని ఆరోపించారు.

‘నామినేషన్లు కూడా వేయనివ్వరా’
డిజిటల్‌ మీడియా సంస్థ ‘నేషనల్‌ దస్తక్‌’ కూడా ఎక్స్‌ వేదికగా స్పందించింది. ఎన్ని­కల ప్రక్రియపై తీ­వ్ర విమర్శలు చేస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మిత్రపక్షమైన చంద్రబాబు పార్టీకి చెందిన వారు స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనివ్వడం లేదు. ఎన్నిక­ల సంఘం మౌనంగా ఉంది. భారీ మెజా­ర్టీ­తో గెలిచిన పార్టీ ఇప్పుడు ఓటమికి భ­యపడుతోంది’ అని వ్యాఖ్యానించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement