నేడు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం
26 నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు
28 నాటికి తుపానుగా మారే అవకాశం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడే దిశగా కదులుతోంది. ఈ నెల 28వ తేదీ ఉదయానికి ఏపీ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ప్రభావంతో వచ్చే నాలుగైదు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం అదే ప్రాంతంలో కొనసాగుతోందని తెలిపింది.
దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా, ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారవచ్చని అంచనా వేసింది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 28న ఉదయం విశాఖ తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది.
రేపటి నుంచి వర్షాలు
తుపాను ప్రభావంతో సోమవారం నుంచి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళ, బుధవారాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోనూ కొన్నిచోట్ల వర్షాలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ఆదివారం కూడా అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
తుపాను ముప్పు నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని కోరింది. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ జారీ చేసే అధికారిక హెచ్చరికలను పాటించాలని కోరింది. అత్యవసర సహాయం కోసం 112, 1070, 180042–50101 నంబర్లను సంప్రదించాలని సూచించింది.


