జగన్ ప్రశ్నలకు జవాబులేక తోచిన సొల్లు పొల్లుపోకుండా చెప్పిన చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో హింసపై ప్రశ్నిస్తే.. గంటన్నర పాటు డైవర్షన్ ప్రసంగం
ఎన్నికల అక్రమాలపై నిలదీస్తే.. జగన్ కుటుంబమే టార్గెట్!
నామినేషన్లు అడ్డుకుని.. ప్రజాస్వామ్య పరిరక్షణ మాటలు
దాడులు చేసింది టీడీపీ శ్రేణులే.. నిందలు మాత్రం వైఎస్సార్‌సీపీపై!
సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి విలువల గురించి నీతులు
తోడల్లుడికి మోసం.. బావమరిదికి ద్రోహం.. తమ్ముడికి గొలుసులు
జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని వదిలేసిన స్వార్థం
చంద్రబాబు చరిత్ర అంతా మోసం.. ద్రోహం.. నయవంచన
అయినా కళ్లార్పకుండా కమిట్‌మెంట్‌తో బాబు అబద్ధాల బురద
ఎల్లో మీడియాలో రాయించిన రాతలనే వల్లెవేసిన బాబు
సాక్షి, అమరావతి: పరీక్ష హాలు..! క్వశ్చన్ పేపర్ చేతికి వచ్చింది..! ఒక్క ప్రశ్నకూ జవాబు తెలియదు..! అయినా ఆ విద్యార్థి ఏ ప్రశ్న అడిగారో పట్టించుకోకుండా తన తోచిన, తెలిసిన విషయాలను జవాబులుగా రాసేస్తాడు. పేజీలకు పేజీలు నింపేస్తాడు. శనివారం సీఎం చంద్రబాబు పెట్టిన మీడియా సమావేశం అచ్చం ఇలాంటిదే. స్థానిక ఎన్నికల్లో ఈ స్థాయిలో హింస ఏమిటి? నామినేషన్లు ఎందుకు అడ్డుకున్నారు? మహిళా అభ్యర్థుల జుట్టు ఎందుకు పట్టి లాగారు? పులివెందులలో తుపాకులు ఎందుకు పేలాయి? సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? ఇవీ ప్రశ్నలు.
చంద్రబాబు మాత్రం.. 1994 ఎన్నికల చరిత్ర.. సీఐఐ సమ్మిట్లు.. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు.. రాయలసీమ ఫ్యాక్షన్ కథలు.. క్లెమోర్ మైన్లు.. చివరకు జగన్ తల్లి, చెల్లి, మేనకోడలి పెళ్లి.. గంటన్నర పాటు ఈ కాకమ్మ కథలన్నీ నర్మగర్భంగా వివరించారు. జగన్ అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు బురదే ఆయుధం. జగన్ కుటుంబం గురించి ఎల్లో మీడియాలో ఏం రాయించారో, అదే స్క్రిప్ట్‌ను అక్షరం పొల్లుపోకుండా చంద్రబాబు వల్లెవేశారు.
ఒక్క ఆధారం లేదు, ఒక్క పత్రం లేదు. ఉన్నదల్లా ఇష్టం వచ్చినట్లు బురదజల్లడమే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తానే ప్రజాస్వామ్య పరిరక్షకుడినని చెప్పుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. పోలింగ్ కేంద్రాల వద్ద వేల మంది గూండాలను మోహరించడం.. ఫస్ట్‌టైమ్ స్థానిక ఎన్నికల కోసం గంజాయి బ్యాచ్‌లను దించడం చూస్తే చంద్రబాబు క్రిమినల్ మెంటాలిటీ ఏమిటో అర్ధమౌతుంది. ఓ వైపు నామినేషన్లను అడ్డుకుంటూ, పోలీసులను, ఎస్‌ఈసీని వాడుకుంటూ అరాచకాలతో అల్లకల్లోలం చేస్తూనే ప్రతిపక్షమే అన్నిటికీ కారణమన్నట్లు ఎదురుదాడి చేస్తున్న చంద్రబాబును చూసి దేశంలోకెల్లా సీనియర్ రాజకీయ నాయకుడైన శరద్‌పవార్ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి.
కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి సీనియర్ నటులు కూడా నివ్వెరపోయే పరిస్థితి. వీళ్లేకాదు రోజూ తన కింద పనిచేసే ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా చంద్రబాబు పెర్‌ఫార్మెన్స్ చూసి వామ్మో అని మూర్ఛపోయే పరిస్థితి. అంతెందుకు.. అడ్డంగా దొరికిపోయినా.. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇంతబాగా నటిస్తున్న నారావారిని చూసి ఈసీ పునేఠా కూడా కంగుతినే పరిస్థితి. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు.. అసలు నిజాలు..

అబద్ధం: స్థానిక ఎన్నికల్లో హింస అంతా వైఎస్సార్‌సీపీదే
నిజం: నామినేషన్ల సమయంలో 11 జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో తెలుగుదేశం గూండాలు, కిరాయికి తెచ్చిన గూండాలు ముందే చేరిపోయి నామినేషన్లు వేయనీయకుండా దాడులు జరిపారు. పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. పులివెందులలో పోలీసులు ఏకే–47 తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి, బాష్పవాయువు ప్రయోగించారు.
మాచర్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు. కడపలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనే పత్రాలు చించేశారు. తిరుపతిలో అభ్యర్థులను గేటు దాటనివ్వలేదు. నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళా అభ్యర్థులను జుట్టు పట్టి ఈడ్చారు. అసభ్యంగా తాకి మరీ నామినేషన్ పత్రాలు లాక్కుని చించేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపైనా, వారికి మద్దతుగా వెళ్లిన నాయకులపైన జరిగిన దాడులకు సంబంధించి వీడియో ఫుటేజీలెన్నో ఉన్నాయి.
అబద్ధం: వైఎస్సార్‌సీపీ వాళ్లు అరాచకాలు చేశారు
నిజం: వైఎస్సార్‌సీపీ వాళ్లే దాడులు చేస్తుంటే, వాళ్ల నామినేషన్లు దర్జాగా పడాలి కదా. మరి వాళ్ల నామినేషన్లే ఎందుకు పడలేదు? దాడులు చేసేవాళ్లు నామినేషన్ వేయలేకపోవడం, దెబ్బలు తినేవాళ్లు దర్జాగా నామినేషన్లు వేయడం.. ఈ లాజిక్ బాబుకే అర్థం కావాలి. కళ్లెదుటే కనిపిస్తున్న నిజం సీఎంకు కనిపించడం లేదా? దాడి చేసింది తమ వాళ్లు, కానీ కథ మాత్రం రివర్స్. వైఎస్సార్‌సీపీ వాళ్లే గొడవలు చేశారని అబద్ధాలు. పుంగనూరులో నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ వారిపైనే పోలీసులు కేసులు పెట్టారు. దెబ్బలు తిన్నవాళ్ల మీద కేసులు, కొట్టినవాళ్లకు రక్షణ.
అబద్ధం: భారీగా నామినేషన్లు పడ్డాయి.. అడ్డుకుంటే ఇవెలా వస్తాయి?’
నిజం: 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 నామినేషన్లు, 659 జెడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు పడ్డాయని సీఎం లెక్కలు చదివారు. కానీ ఎన్ని చోట్ల ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్ కేంద్రం గడప కూడా తొక్కలేకపోయారో ఆ లెక్క మాత్రం దాచేశారు. వందకుపైగా మండలాల్లో ఐదు కంటే తక్కువ నామినేషన్లు పడ్డాయి. 8 మున్సిపాలిటీల్లో ప్రతిపక్ష నామినేషన్లే పడని పరిస్థితి కల్పించారు. మరో 19 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయనివ్వలేదు. వైఎస్సార్‌సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు వేయించడం ద్వారా చంద్రబాబు సరి కొత్త సంస్కృతికి తెరతీశారు.
అబద్ధం: సుప్రీంకోర్టు ఏం చెప్పినా పాటిస్తాం
నిజం: సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలిచ్చింది. అక్టోబరు 25వరకు తుది జాబితాలు ప్రకటించ వద్దని, నామినేషన్లు వేయలేకపోయిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని, అవసరమైతే జిల్లా కలెక్టరేట్ల వద్ద అందుకు ఏర్పాట్లు చేయాలని నిర్దేశించింది. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని, వారికి పోలీస్ భద్రత కల్పించాలని, ఆ దిశలో ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కవరేజీ ఏర్పాటు చేయాలని కూడా డీజీపీని ఆదేశించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాలని నిర్దేశించింది.
ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినా, చంద్రబాబులో కానీ, ఎస్‌ఈసీలో కానీ, చంద్రబాబు చేతిలో తోలుబొమ్మ మాదిరిగా మారిన డీజీపీలో కానీ, డీఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లలో కానీ ఎలాంటి మార్పు రాలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. 19 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయనివ్వలేదని వైఎస్సార్‌సీపీ ఆధారాలతో సహా సుప్రీంకోర్టుకు వెళ్తే, కోర్టు మొట్టికాయలు వేసినా, వీరిలో మార్పు లేదు. కేవలం 4 మున్సిపాలిటీల్లో మాత్రమే రీనామినేషన్లకు అనుమతి ఇచ్చారు. కోర్టు మొట్టికాయ వేశాక దాన్ని వక్రీకరించి మాట్లాడడం బాబు మార్కు రాజకీయం.
అబద్ధం: నా చేతుల్లో ఏమీ లేదు. అంతా ఎస్‌ఈసీ చూసుకుంటుంది
నిజం: అంతా ఎస్‌ఈసీ చేతుల్లో ఉంటే ఇంత అప్రజాస్వామికంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతాయా? పోలీసు వ్యవస్థను పూర్తిగా తమ పార్టీ కోసం వాడుకుంటూ, కోర్టు ఆదేశాలను సైతం చంద్రబాబు తుంగలో తొక్కారు. ఎస్‌ఈసీ సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా పాటించడంలేదు. చంద్రబాబు ఆదేశాలు మాత్రమే పాటిస్తోంది. టీడీపీ దాడులు, పోలీసులు అడ్డుకోవడం వల్ల 19 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయలేకపోయామని వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. వాటితో పాటు, మరో 4 మున్సిపాలిటీల్లో స్క్రూటినీ పేరుతో వైఎస్సార్‌సీపీ నామినేషన్లు తిరస్కరించారు. అంటే మొత్తం 23 అర్బన్ లోకల్ బాడీస్‌లో పోటీ లేకుండా చేశారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లో ఎస్‌ఈసీ నడిపిస్తోంది.
అబద్ధం: కోర్టుల్లో పిటిషన్లు వేసి ఎన్నికలు అడ్డుకుంటున్నారు
నిజం: అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రతి పౌరుడి, ప్రతి పార్టీ రాజ్యాంగ హక్కు. జగన్ హయాంలో పాలనను అడ్డుకునేందుకు అడుగడుగునా కోర్టులకు వెళ్లి అబద్ధాలు, అతిశయోక్తులతో నాటకాలాడింది చంద్రబాబే. చంద్రబాబు కోర్టుకు వెళితే ప్రజాస్వామ్య పరిరక్షణ... ప్రతిపక్షం కోర్టుకు వెళితే కుట్రా? న్యాయస్థానాన్ని ఆశ్రయించడాన్ని కూడా నేరంగా చిత్రీకరించడం చంద్రబాబు నియంతృత్వ మనస్తత్వానికి నిదర్శనం. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు చేస్తున్న అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు అన్ని ఆధారాలు చూపడంతో పాటు, ఎస్‌ఈసీని కలిసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి, అన్ని ఆధారాలు చూపడంతో, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి తీవ్ర స్థాయిలో మొట్టికాయలు వేసింది. నామినేషన్ వేయలేకపోయిన వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది.
అబద్ధం: 2021లో 24% ఏకగ్రీవాలు దౌర్జన్యమే
నిజం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు, ఏకగ్రీవాలు జరిగింది 2020లో టీడీపీ హయాంలో నియమితులైన, చంద్రబాబుకు బంట్రోతు లాంటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆధ్వర్యంలోనే. బాబు మనిషి పర్యవేక్షణలో జరిగిన ప్రక్రియను ఇవాళ దౌర్జన్యం అనడం ఆయన పెట్టిన అధికారినే తప్పుబట్టడం కాదా? పైగా 2021లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది టీడీపీయే. పోటీ నుంచి పారిపోయి, ఇప్పుడు ఏకగ్రీవాల లెక్కలు చెప్పడం బాబుకే చెల్లింది.
అబద్ధం: జగన్ పెళ్లి బెంగుళూరు ప్యాలెస్‌లో జరిగింది
నిజం: జగన్ పెళ్లి పులివెందులలో జరిగింది. అప్పటికి బెంగుళూరులో ఉన్న ఇల్లు కట్టనేలేదు. కట్టని ఇంట్లో జగన్ పెళ్లి జరిగిందని చంద్రబాబు ఆయన గురించి పచ్చి అబద్ధం చెప్పారు.
జైలు పక్షికి కేసుల గురించి మాటలా?
జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులున్నాయని చంద్రబాబు గుండెలు బాదుకున్నారు. మరి స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కపెట్టింది ఎవరు? తనపై ఉన్న కేసుల విచారణ ముందుకు సాగకుండా అధికారంలోకి రాగానే అడ్డుకున్నది ఎవరు? కోర్టు విచారణలో ఉన్న వివేకా కేసుపై సీఎం కుర్చీలో కూర్చుని తీర్పులు ప్రకటించడం న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే కుట్ర కాదా? కేసు కోర్టులో ఉండగా ముఖ్యమంత్రే ఒకరిని దోషిగా ప్రకటించడం ఏ రాజ్యాంగ విలువ?
మామకు వెన్నుపోటు, తోడల్లుడికి మోసం, బావమరిదికి ద్రోహం.. కొడుకు కోసం ఎన్టీఆర్ కుటుంబానికి, ఇప్పుడు టీడీపీని వంచిస్తున్నారు. చంద్రబాబు నాలుగున్నర దశాబ్దాల విలువల చరిత్ర ఇదే. ఇంత నీచ చరిత్ర ఉన్న వ్యక్తి ఇవాళ జగన్‌కు కుటుంబ విలువలు, నైతికత గురించి పాఠాలు చెబుతుంటే తెలుగు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల హింసకు జవాబు చెప్పలేక వ్యక్తిగత బురద జల్లడం ఓటమి భయానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
నమ్మకద్రోహి బాబు మాటలు వింటే కంసుడే సిగ్గుపడతాడు
జగన్‌ను కంస మామ అన్న చంద్రబాబు ముందు అద్దంలో తన ముఖం చూసుకోవాలి. పిల్లనిచ్చిన మామ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును 1995లో వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన స్థాపించిన పార్టీని లాక్కున్న చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు తనను నమ్మించి గొంతు కోసిన ఆధునిక ఔరంగజేబు అని, జామాత దశమగ్రహం(అల్లుడు) అని ఎన్టీఆర్ కన్నీళ్లతో చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. పార్టీనే కాదు, కుటుంబాన్నీ ఎన్టీఆర్‌కు దూరం చేసి ఒంటరిని చేశారు. ఆ వేదనతో ఎన్టీఆర్ కొద్ది నెలలకే కన్నుమూశారు. మామను అంత క్షోభ పెట్టి చనిపోయేలా చేసింది చంద్రబాబే. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ కుటుంబ వ్యవహారాల్లో దూరి నీతులు మాట్లాడుతుంటే కంసుడే సిగ్గుపడతాడు.
తోడల్లుడికి మోసం.. బావమరిదికి ద్రోహం
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలో భుజం కాసిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును చంద్రబాబు పని అయిపోగానే కరివేపాకులా తీసి పక్కన పడేశారు. అదే సమయంలో అండగా నిలిచిన బావమరిది హరికృష్ణకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారు. చివరకు సొంత తండ్రి స్థాపించిన పార్టీ నుంచే హరికృష్ణ బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకోవాల్సిన దుస్థితి తెచ్చారు.
చంద్రబాబు తన సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడిని గొలుసులతో బంధించి హింసించారు. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరగానే వెన్నుపోటు పొడవడం.. ఇదే చంద్రబాబు కుటుంబ నీతి. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారానికి వాడుకుని ఊరూరా తిప్పారు. కొడుకు లోకేశ్‌కు ఎక్కడ అడ్డు వస్తాడోనన్న భయంతోనే జూనియర్‌ను దూరం పెట్టారన్నది జగమెరిగిన సత్యం. మామ పార్టీని కొడుకుకు రాసిచ్చేందుకు సిద్ధమైన వ్యక్తి ఇప్పుడు ఆస్తుల పంపకాల గురించి నీతులు చెబుతున్నారు.


