ముందస్తు సమాచారం లేకుండా హస్తినకు
అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై వివరణ ఇవ్వడానికేనా!
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మికంగా ఢిల్లీ వచ్చారు. సాధారణంగా ఆయన ఢిల్లీ వస్తున్నారంటే ఎల్లో మీడియా హడావుడి ఉండేది. అయితే, ఎటువంటి సమాచారం లేకుండా చాలా గోప్యంగా శనివారం సాయంత్రం ఢిల్లీ రావడం చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ సీఎం హస్తిన పర్యటన పలు ప్రశ్నలను లేవనేత్తుతోంది. ఆయన శనివారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోనూ భేటీ అయ్యారు. ఈ భేటీ వివరాలు చెప్పొద్దని ముఖ్యమంత్రి సిబ్బందికి ముందుగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆ తరువాత మీడియాకు వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రాష్ట్రంలో ‘అధికార’ గూండాయిజంపై వివరణకే..!
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, ప్రతిపాదిత సెమీకండక్టర్ ప్రాజెక్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహకారం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు ఆయన సిబ్బంది ఎల్లో మీడియాకు తెలిపారు. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గూండాయిజం, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం దమన కాండకు పాల్పడటంపై వివరణ ఇచ్చేందుకే చంద్రబాబు ఆకస్మిక ఢిల్లీ పర్యటనకు కారణమని చెబుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజునే పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా దాడులు, దౌర్జన్యాలతో అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను చించేశారు. మహిళలపైనా టీడీపి మూకలు దాడులు చేశాయి. అధికార పార్టీ దుర్మార్గాలకు పోలీసులే బహిరంగంగా మద్దతిచ్చారు. మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు తోసివేశారు. ఈ వీడియోలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీటిపై వివరణ ఇచ్చుకోవడానికి చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినట్లు చర్చ జరుగుతోంది.


