పిల్లలకు పంటల పాఠాలు | Avani e learning app designed to foster childrens interest in nature and crops | Sakshi
Sakshi News home page

పిల్లలకు పంటల పాఠాలు

Oct 25 2026 4:11 AM | Updated on Oct 25 2026 4:11 AM

Avani e learning app designed to foster childrens interest in nature and crops

ప్రకృతి, పంటలపై చిన్నారుల్లో ఆసక్తి పెంచేలా అవని ఈ–లెర్నింగ్‌ యాప్‌  

ఐఐటీ రోపార్, అన్నమ్‌.ఏఐ ద్వారా అందుబాటులోకి డిజిటల్‌ వేదిక 

సాక్షి స్పెషల్‌ డెస్క్‌  :  మనకు ఆహారాన్ని అందించే వ్యవసాయం గురించి, మనం తినే పంటల గురించి పిల్లలకు చిన్నతనం నుంచే అవగాహన కల్పించే ఉద్దేశంతో పంజాబ్‌లోని ఐఐటీ రోపార్‌ ఒక వినూత్నమైన డిజిటల్‌ వేదికను అందుబాటులోకి తెచ్చింది. అవని–గ్రో విత్‌ నేచర్‌ పేరుతో తెచ్చిన ఈ–లెర్నింగ్‌ యాప్‌ను డిజిటల్‌ వ్యవసాయ ఏఐ కేంద్రం అన్నమ్‌.ఏఐ రూపొందించింది. భారతీయ వ్యవసాయ రంగానికి ఏఐ ఆధారిత డిజిటల్‌ వ్యవస్థను నిర్మించడంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రస్తుతం ఈ యాప్‌ వెబ్‌సైట్‌ రూపంలోనూ, మొబైల్‌ యాప్‌గానూ అందరికీ ఉచితంగా లభిస్తోంది.  

పుస్తకాలకు అతీతంగా ప్రత్యక్ష అభ్యాసం 
పాఠశాలల్లో వ్యవసాయం ఒక పాఠ్యాంశంగా మొదలవక ముందే పిల్లల్లో ప్రకృతిపై, పంటలపై సహజమైన ఆసక్తిని పెంపొందించడమే ఈ యాప్‌ ప్రధాన ఉద్దేశం. సాధారణంగా పిల్లలు పుస్తకాల్లో చదవడం లేదా విషయాలను బట్టీ పడుతుంటారు. కానీ ఈ యాప్‌ ద్వారా పిల్లలు తమ ఇల్లు, బడి, తోట లేదా ఇరుగుపొరుగున పెరిగే మొక్కలను ప్రత్యక్షంగా పరిశీలించి నేర్చుకుంటారు. దీనివల్ల మనం రోజూ తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎలా పండుతుందనే ప్రాథమిక విషయాలు పిల్లలకు సులభంగా అర్థమవుతాయి. మనకు అన్నం పెట్టే వ్యవసాయంపై చిన్నతనం నుంచే పిల్లల్లో గౌరవం పెంచడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. 

ఏఐ సాంకేతికత తోడుగా.. 
ఈ యాప్‌లో అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించారు. పిల్లలు ఏదైనా మొక్క, పండు లేదా పంటను తమ ఫోన్‌ కెమెరా ద్వారా చూపిస్తే చాలు, ఏఐ దానిని తక్షణమే గుర్తించి ఆ పంటకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది. అందులో ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు సహా 107కుపైగా పంటలు, మొక్కల రకాల సమాచారాన్ని పొందుపరిచారు. పిల్లలు ప్రతిరోజూ ఆసక్తిగా నేర్చుకోవడానికి వీలుగా దైనందిన అనుభవాలు, వారు చూసిన వివరాలను దాచుకోవడానికి డిజిటల్‌ నేచర్‌ బుక్, నేచర్‌ గ్యాలరీ, వేర్వేరు పంటల మధ్య తేడాలను తెలుసుకోవడానికి క్రాప్‌ కంపేర్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

పిల్లల భద్రత, డిజిటల్‌ సౌకర్యాలు 
చిన్నారులు సులభంగా ఉపయోగించేలా ఈ యాప్‌లో అనేక సౌలభ్యాలు కల్పించారు. ప్రస్తుతం ఇది హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకా చదవడం రాని చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఆడియో సౌకర్యాన్ని కూడా అందించారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో పిల్లల భద్రతకు, వారి వ్యక్తిగత గోప్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎటువంటి వ్యాపార ప్రకటనలు లేకుండా పూర్తి ఉచితంగా లభించే ఈ యాప్, పిల్లలకు ప్రకృతిని దగ్గర చేస్తూ వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement