ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నామినేషన్ల పరిశీలనలోనూ ఇష్టారాజ్యం
ఇదివరకెన్నడూ లేని విధంగా అకారణంగా వందలాది నామినేషన్లు తిరస్కరణ
‘నిల్’ అనే పదం సరిగా కనిపించడం లేదని.. డ్యాష్ సరిగా కనిపించడం లేదని సాకులు
ఆస్తుల వివరాలు పొందుపరిచినా సరిగా లేవంటూ దబాయింపు
అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ కొన్ని వివరాలు లేవంటూ పక్కన పడేసిన వైనం
ఏ వివరాలు సరిగా లేవో చెప్పాలని కోరితే సమాధానం కరువు
టీడీపీ గూండాల దాడిని దాటుకుని నామినేషన్లు వేస్తే తీరా ఇదీ దాష్టీకం
నిబంధనలకు విరుద్ధంగా చిన్న కారణాలతో పోటీ నుంచి తప్పించిన దుస్థితి
సాక్షి, అమరావతి: అధికార పార్టీ గూండాలు పోలీసులతో కలిసి అడుగడుగునా కల్పించిన అష్టకుట్రలు, ఆటంకాలన్నీ దాటుకొని నామినేషన్లు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోటీలో లేకుండా చేసేందుకు వెన్నుపోటు పార్టీ మరో కుట్రకు పాల్పడింది. శనివారం కొనసాగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఏక్షపక్షంగా కొనసాగింది. వీలైనంత మేర అధికార పార్టీకి పోటీగా ఉండే చోట ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ఏదో ఒక సాకుతో తిరస్కరించారు. టీడీపీకి వ్యతిరేకంగా పోటీలో ఉన్న వందల మంది అభ్యర్థుల నామినేషన్లను సహేతుక కారణం లేకుండానే చెల్లని ఖాతాలోకి నెట్టేశారు.
ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను రెండున్నరేళ్ల పాలనలో అమలు చేయక పోవడంతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కూటమి ప్రభుత్వం.. తిమ్మినిబమ్మి చేసైనా స్థానిక ఎన్నికల్లో గెలవాలని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దుర్మార్గాలకు ఒడిగట్టింది. ఈ దుర్మార్గం ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ మేరకే సాగింది. పల్నాడు జిల్లా చేజర్ల మండలంలో కూటమి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన నిమిషాల వ్యవధిలో పూర్తి కాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనకు ఒక్కో అభ్యర్థికి రెండు గంటలు సమయం తీసుకున్నారు.
ఎన్నికల నిబంధనలు పాటించకుండా ఆర్వో బొడ్డు ప్రసాద్‌బాబు ప్రభుత్వ పెద్దల సూచన మేరకు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు అభ్యర్థులు సంతకాలు చేసి వెళ్లిపోవాలని ఆర్వో ప్రసాద్ బాబు, సహాయ ఆర్వో అమర్నాథ్ ఒత్తిడి తెచ్చారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకల్లా పరిశీలన కార్యక్రమం పూర్తి కావాల్సి ఉండగా, రాత్రి 7 గంటల సమయానికి వైఎస్సార్‌సీపీకి చెందిన నాలుగు సెగ్మెంట్ల అభ్యర్థుల నామినేషన్లను ఏకపక్షంగా తిరస్కరించారు. బాధిత అభ్యర్థులు ఆర్డీవోను, జిల్లా కలెక్టర్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు.


అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలోని పెనకచెర్ల ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున భీమన్న నామినేషన్ దాఖలు చేసిన సమయంలో అధికారులు ఇచ్చిన రసీదు.. పరిశీలన సమయంలో ఇచ్చిన రసీదు
నెల్లూరు, తిరుపతి, మార్కాపురం జిల్లాల్లోనూ అదే తీరు
మార్కాపురం జిల్లా పొదిలి మండలం ఆముదాలపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెమ్మని శ్రీను ‘వృత్తి’ పేర్కొనలేదనే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బూధవాడ ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోక వెంకయ్య తన నామినేషన్‌లో కొన్ని చోట్ల డాష్ (–) పెట్టారనే కారణం చూపి తిరస్కరించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కడివేడు ఎంపీటీసీగా షేక్ హుస్సేన్ భాష దాఖలు చేసిన దరఖాస్తులో ఒక చోట సంతకం లేదని తిరస్కరించారు. తిరుపతి జిల్లాలో దాఖలైన వైఎస్సార్‌సీపీ మొత్తం నామినేషన్లలో మూడో వంతు చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉద్దేశ పూర్వకంగా తొలగించారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు–1 వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుని పదవికి రాజీనామా చేసి పోటీ చేసిన రామేన వెంకట సాయి లక్ష్మి నామినేషన్‌ను అధికార పార్టీ నేతల ఒత్తిడితో అకారణంగా తిరస్కరించారు. అదే మండలం గోపీనాథ్ పట్నం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పుచ్చకాయల శాంభవి నామినేషన్‌నూ తిరస్కరించారు. రేషన్ డీలర్‌గా రాజీనామా చేశాకే నామినేషన్ దాఖలు చేసినా, అదే కారణంతో తిరస్కరించడం గమనార్హం. వైఎస్సార్ కడప జిల్లాలో పలు చోట్ల అభ్యర్థులకు కారణం కూడా తెలపకుండా నామినేషన్లు తిరస్కరించారు. ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి మొత్తం ఏడుగురు నామినేషన్లు వేస్తే, పరిశీలన సమయంలో అందరి నామినేషన్లను తిరస్కరించారు. బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 12 నామినేషన్లను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు.
పొదుపు సంఘాల్లో రుణం ఉందని నామినేషన్ తిరస్కరణ
సాధారణంగా ఎన్నికల నిబంధనల్లో రుణం ఉందనే కారణంతో నామినేషన్ తిరస్కరణకు అవకాశం లేకపోయినా.. అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన పద్మజ నామినేషన్‌ను ఇదే కారణంతో తిరస్కరించారు. అదే మండలం ముసలికుంట ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హరినాయక్ తన నామినేషన్‌లో భార్య, పిల్లల పేరు నమోదు చేయలేదని తిరస్కరించారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో ఉన్న సీరియల్ నెంబర్.. ఎంపీటీసీ ఓటర్ల జాబితాలో స్వల్పంగా వేరేగా ఉందనే కారణాలతో పదుల సంఖ్యలో నామినేషన్లను తిరస్కరించారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఒక్క అన్నమయ్య జిల్లాలోనే వందలాది నామినేషన్లు తిరస్కరించారు. ఈ నామినేషన్లు అన్నీ వైఎస్సార్‌సీపీ వాళ్లవే కావడం గమనార్హం.
ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అదే తీరు
విజయనగరం జిల్లా పూసపాటిరేగ జెడ్పీటీసీ వెఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స చైతన్య నామినేషన్‌ను తిరస్కరించారు. విజయనగరం టౌన్‌లో తనకున్న ఓటు హక్కును స్వగ్రామానికి బదిలీ చేసుకుంటూ గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ అయినట్టు చూపిస్తున్నప్పటికీ, తమ వద్ద ఉన్న ఓటరు లిస్ట్‌లో ఆయన పేరు లేదని తిరస్కరించారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కండివరం ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అధికారిక అభ్యర్థి గంజికృష్ణతో పాటు డమ్మీ అభ్యర్థిగా బొగ్గు దేవుళ్లు నామినేషన్ వేశారు. వీరు తమ నామినేషన్లకు ప్రతిపాదకులుగా ఒకరినొకరు సంతకాలు చేసుకున్నారు. దీంతో వీరి నామినేషన్‌లు రిజెక్ట్ చేశారు.
ఇదే మండలం తురువోలు ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ముర్రు రమాదేవి పేరు ఐడీ ఫ్రూప్‌లో మరోరకంగా ఉందని ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. పార్వతీపురం మన్యం జిల్లా చింతలబెలగాం ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నఖిరెడ్డి సుశీల నామినేషన్‌లో ప్రతిపాదించిన అభ్యర్థి సంతకం పెట్టాల్సిన చోట పోటీ చేసిన అభ్యర్థి సంతకం చేశారన్న సాకుతో ఆర్వో తిరస్కరించారు. శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం పెనకచర్ల ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భీమన్న నామినేషన్‌ను అకారణంగా తిరస్కరించడంపై మాజీ మంత్రి శైలజానాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ అరాచక పర్వం కొనసాగింది.
అన్యాయంగా తొలగించారు
ఎంతో అనుభవం ఉన్న ఓ విశ్రాంత ఉద్యోగి సహాయంతో నా నామినేషన్ పత్రాన్ని పూరించాను. ఎక్కడా ఎలాంటి తప్పిదం లేకుండా పలుమార్లు సరిచూసుకున్నాను. ఆపై టీడీపీ మూకను దాటుకుని వెళ్లి నామినేషన్ దాఖలు చేశాను. అయితే డిక్లరేషన్ ఫారంలో కాలమ్ నెంబర్ 2(4)లో సక్రమంగా పూరించలేదని నా నామినేషన్ తిరస్కరించినట్లు కారణం చెబుతున్నారు. ఇది చాలా దారుణం. ఓటమి భయంతో టీడీపీ నేతలు చేసిన కుట్ర అని తెలుస్తోంది. – మీసాల నాగలక్ష్మి, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, బద్వేలు మండలం, అన్నమయ్య జిల్లా
ఈమె పేరు శ్రేయ. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిన్నరామాపురం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రంలోఖర్చు వివరాలు సరిగా రాయలేదని తిరస్కరించారు. ఏ వివరాలు సరిగా రాయలేదో చెప్పాలని కోరగా, కొన్ని వివరాలు అంటూ దాట వేశారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామంనారావారిపల్లి ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అయిన నా నామినేషన్‌నుఇలా తిరుస్కరించడం దారుణం. ఓడిపోతామన్న భయంతోనే ఇలా చేస్తున్నారని అర్థమవుతోంది.
ఇలాంటి దుస్థితి ఎప్పుడు చూడలేదు
నేను మద్దూరు ఎంపీటిసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. పరిశీలనలో అకారణంగా నా నామినేషన్‌ను తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారని ఆర్‌ఓ సునీల్ కన్నాను అడిగితే.. ‘మీ నామినేషన్ పత్రంలో ఒక కాలం వద్ద ‘నిల్’ అని రాసిన పదం సరిగా కనిపించడం లేదు. అందుకే తిరస్కరించాం’ అని చెప్పారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. పాలక పార్టీ నేతల ఒత్తిడితో ఇలా చేయడం దుర్మార్గం. – ఓ.రఘునాథరెడ్డి, నేలంపాడు గ్రామం, మద్దూరు, చాగలమర్రి మండలం, నంద్యాల జిల్లా
ఉన్నది ఒకే బైక్.. రెండు ఉన్నట్టు చూపలేదని..
మా ఊళ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. అందుకే టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి కుట్రతో నా నామినేషన్ తిరస్కరించారు. నా భర్తకు ఒక బైక్ ఉంటే రెండు బైకులు ఉన్నట్లు చెప్పి.. దానిని నామినేషన్‌లో నమోదు చేయలేదనే కారణంతో రద్దు చేశారు. వాస్తవంగా నా భర్తకు ఒక బైక్ మాత్రమే ఉంది. అధికార పార్టీ నాయకుల కుట్ర వల్లే నా నామినేషన్ రద్దు చేశారు. – షేక్ ఖాసీంబీ, వేజండ్ల–1 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా
అంతా ఓకే అని చెప్పి తిరస్కరించారు
నామినేషన్ల పరిశీలనకు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లాం. తహసీల్దార్ రవిశంకర్ మీ నామినేషన్ ఓకే అయింది అని చెప్పారు. సాయంత్రం జాబితా చూస్తే అందులో తిరస్కరణకు గురై ఉంది. కారణమేంటని వెళ్లి కనుక్కుంటే ఆస్తుల వివరాలు మ్యాచ్ కాలేదని చెప్పారు. ఏం మ్యాచ్ కాలేదని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. టీడీపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడానికే కావాలని నా నామినేషన్‌ను తిరస్కరించారు. – జమ్ము లక్ష్మీరాజ్యం, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని, రామాయపట్నం, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా


