అర్హులకు దరఖాస్తు చేసినప్పటి నుంచీ పెన్షన్‌ చెల్లించాల్సిందే | Eligible individuals must be paid a pension from the date they submitted their application says high court | Sakshi
Sakshi News home page

అర్హులకు దరఖాస్తు చేసినప్పటి నుంచీ పెన్షన్‌ చెల్లించాల్సిందే

Oct 25 2026 4:40 AM | Updated on Oct 25 2026 4:40 AM

Eligible individuals must be paid a pension from the date they submitted their application says high court

ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ

బకాయిలను 8 వారాల్లో చెల్లించాలని ఆదేశాలు

పేదలకు భరోసా, గౌరవప్రద జీవితమే పింఛన్ల లక్ష్యమని హితవు

పింఛన్‌ మంజూరులో రాజకీయ వివక్షపై న్యాయపోరాటంలో మహిళ గెలుపు

సాక్షి, అమరావతి: పరిపాలనాపరమైన జాప్యాలు,  విధానపరమైన నిర్ణయాల కారణంగా దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న కాలానికి అర్హులకు పెన్షన్‌ బకాయిలను నిరాకరించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి రావాల్సిన పెన్షన్‌ బకాయిలను లెక్కించి, ఆ మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  తీర్పు కాపీ అందిన నాటి నుంచి 8 వారాల్లో చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. 

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాస రెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు.  సామాజిక భద్రత పింఛను పథకాలు కష్టాల నుంచి బలహీన వర్గాలకు ఉపశమనం కలిగించడానికి, గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఉద్దేశించినవంటూ గతంలో పలు సందర్భాల్లో న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులను న్యాయమూర్తి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

కేసు వివరాలు ఇవీ..
» గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం, ఉప్పరపాలెం గ్రామానికి చెందిన తాడిశెట్టి తిరుపతమ్మ దివ్యాంగుడైన భర్త హరికృష్ణ మరణించడంతో, వితంతు పెన్షన్‌ కోసం 16.3.2024న దరఖాస్తు చేసుకున్నారు. 
»   పిటిషనర్‌ కుటుంబ ఆదాయం నెలకు రూ.10 వేల కంటే తక్కువగా ఉంది, ఆమెకు తెల్ల రేషన్‌ కార్డు ఉంది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆమె దరఖాస్తును 10 నెలలకు పైగా ఎలాంటి కారణం లేకుండా పెండింగ్‌లో ఉంచింది. దీనిపై తిరుపతమ్మ న్యాయ పోరాటానికి దిగారు. 
»   రాజకీయ కారణాలతో తన పట్ల వివక్ష చూపారని, పొరుగు గ్రామానికి చెందిన సుశీల అనే మహిళకు పెన్షన్‌ మంజూరు చేశారని ఆమె హైకోర్టుకు నివేదించారు.
»  తిరుపతమ్మ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి  పెన్షన్‌ కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి నాలుగు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. 
» ఆ తరువాత తాజాగా మరోసారి ఈ వ్యాజ్యం విచారణకు రాగా, కోర్టు ఆదేశాల మేరకు తనకు 01.03.2026 నుంచి పెన్షన్‌ చెల్లిస్తున్నారని, అయితే దరఖాస్తు చేసుకున్న తరువాత ఏప్రిల్‌ 2024 నుంచి బకాయిలు రావాల్సి ఉందని హైకోర్టుకు నివేదించారు.
»   దీనిపై అధికారులు స్పందిస్తూ, బకాయిల చెల్లింపునకు పాలసీలో ఎలాంటి నిబంధనలు లేవని తెలిపారు. 
» అయితే ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇది పూర్తిగా పాలనాపరమైన జాప్యమని, పెన్షన్‌ బకాయిల చెల్లింపునకు నిబంధనలు లేవన్న ప్రభుత్వ వాదన సరికాదని తేల్చిచెప్పారు. ఆమె పూర్తి బకాయిలు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement