'ఎన్ని కల్లో' లాలో..! | A series of threats and kidnappings targeting YSRCP candidates in local body elections | Sakshi
Sakshi News home page

'ఎన్ని కల్లో' లాలో..!

Oct 25 2026 5:01 AM | Updated on Oct 25 2026 5:01 AM

A series of threats and kidnappings targeting YSRCP candidates in local body elections

కలవకూరులో కిడ్నాప్‌నకు గురైన జేమ్స్‌ , చిరమనలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన కండే మధవరావు

దాష్టీకాలకు తెగబడుతున్న టీడీపీ మూకలు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై బెదిరింపుల పర్వం, కిడ్నాప్‌లు

ప్రకాశం జిల్లా కలవకూరు ఎంపీటీసీ అభ్యర్థి జేమ్స్‌ కిడ్నాప్‌ 

వీడియో తీస్తున్న సాక్షి టీవీ విలేకరి ప్రసన్నపై పచ్చగూండాల దాడి 

దలవాయిపల్లిలో ఎంపీటీసీ అభ్యర్థి వలి కిడ్నాప్‌ 

చిరమనలో ఎంపీటీసీ అభ్యర్థి భర్తను  కిడ్నాప్‌ చేసే యత్నం 

కెలవాతిలో ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాసులుపై దాడి 

చింతలవారిపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పుష్పవతి ఇంటిపై దాడి 

తిరువూరులో దళితులపై పచ్చమూక మూకుమ్మడి దాడి 

రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ దాడులు 

విత్‌ డ్రా చేస్తావా.. చస్తావా..అంటూ తీవ్ర బెదిరింపులు, వేధింపులు 

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఓటమి ఖాయమని వెన్నుపోటు పార్టీ వెన్నులో వణుకు తీవ్రమైంది. అందుకే పచ్చమూకలు అరాచకాలకు తెగబడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే లక్ష్యంగా దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే పోలీసులను ప్రయోగించి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై బైండోవర్‌ కేసులు పెట్టి భయపెట్టేందుకు యత్నించిన పచ్చగూండాలు.. ఇప్పుడు ఏకంగా కిడ్నాప్‌లకూ వెనుకాడడం లేదు.  

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన సందర్భంగా వేసిన నామినేషన్లు ఉపసంహరించుకోవాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. వారు తలొగ్గకపోతే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అనర్హులుగా తేల్చాలని ఎన్నికల అధికారులపై ఒత్తిడి పెంచారు. పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కిడ్నాప్‌ చేయడం, చంపుతామని బెదిరించడం వంటి దాష్టీకాలకు ఒడిగట్టారు. రేపల్లె నియోజకవర్గంలో నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ఎల్లోగ్యాంగ్‌ బెదిరింపులకు పాల్పడింది.  

దాష్టీకాలకు ఇవిగో నిదర్శనాలు  
» అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం చింతలవారిపల్లిలో నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారనే సాకుతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పుష్పవతి ఇంటిపై పచ్చ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఇంటితోపాటు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘటనపై పుష్పవతి ఫిర్యా­దు చేసినా సోమల పోలీసులు పట్టించుకోలేదు.  

» తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం దలవాయిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మహమ్మద్‌ వలిని పచ్చమూక కిడ్నాప్‌ చేసింది. శనివారం నామినేషన్ల పరిశీలనకు రాకపోవడంతో ఆందోళన చెందిన వలి సతీమణి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

»  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం చిరమన గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని కండే సుశీల పోటీ నుంచి తప్పుకోవాలని ఆమె భర్తను కిడ్నాప్‌ చేసేందుకు టీడీపీ మూకలు ఓ ప్రైవేట్‌ వ్యక్తి ద్వారా యత్నించాయి. అది సాధ్యం కాకపోవడంతో ఏఎస్‌పేట పోలీసుల ద్వారా ఆయనను అరెస్ట్‌ చేయించాయి. చోరీ కేసు సాకుతో పోలీసులు మాధవరావును శనివారం అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని టీడీపీ నేతలు  మాధవరావును, సుశీలను ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.

» పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి స్వగ్రామం కెలవాతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాసులుపై టీడీపీ నేత సుబ్రమణ్యం దాడి చేసి గాయపరిచాడు. ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన శ్రీనివాసులుపై జరిగిన ఈ దాడితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.   

»  శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని తోట ఆదిలక్ష్మిని టీడీపీ గూండాలు భయపెట్టి బలవంతంగా నామినేషన్‌ విత్‌డ్రా చేయించారు. తనతోపాటు తన కుమారుడిని భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  ఇదిలా ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలక్ష్మి భర్తపై దాడిచేసి, ఆపై ఆయన మృతికి టీడీపీ నేతలు కారణమయ్యారు. ఇప్పుడు ఎంపీటీసీ అభ్యర్థిగా ఉన్న ఆదిలక్ష్మిని బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ బాధితులతో ఫోన్‌లో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో మరో వ్యక్తి నామినేషన్‌ వేస్తే తట్టుకోలేకపోయారని దుయ్యబట్టారు.   

»  ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కలవకూరు గ్రామ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సురభి జేమ్స్‌ను పచ్చ రౌడీలు శనివారం కిడ్నాప్‌  చేశారు. అతడిని కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ఎంత యత్నించినా.. పోలీసుల ప్రోద్బలంతో టీడీపీ మూకలు జేమ్స్‌ను కిడ్నాప్‌చేసి తీసుకెళ్లాయి. తొలుత జేమ్స్‌ను కిడ్నాప్‌చేసేందుకు యత్నించడంతో  వైఎస్సార్‌సీపీ అద్దంకి ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌  అడ్డుకున్నారు. 

                కలవకూరులో టీడీపీ మూకల దాడిలో గాయపడిన ‘సాక్షి’ టీవీ విలేకరి ప్రసన్న 

ఈ క్రమంలో జేమ్స్‌ కిడ్నాప్‌ నుంచి తప్పించుకుని ఓ లాయర్‌ ఇంట్లో తలదాచుకున్నారు. శనివారం రాత్రి అక్కడకు చేరుకున్న పచ్చమూకలు జేమ్స్‌ను ఓ ఏఎస్సై ద్వారా బయటకు రప్పించి కిడ్నాప్‌ చేశాయి.  ఘటన కవరేజ్‌కు వెళ్లిన సాక్షి టీవీ విలేకరి ప్రసన్నపై దాడికి పాల్పడి చావబాదాయి. ఈ ఘటనపై చింతలపూడి అశోక్‌ మాట్లాడుతూ మంత్రి కనుసన్నల్లో పోలీసుల ప్రోద్బలంతో జేమ్స్‌ కిడ్నాప్‌ జరిగిందని విమర్శించారు.   

ప్రకాశం జిల్లా కలవకూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి జేమ్స్‌ను కిడ్నాప్‌ చేసేందుకు యత్నిస్తున్న టీడీపీ మూకలను అడ్డుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు 

»   ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం సోబ్బాల గ్రామంలో వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్తలపై పచ్చమూక మూకుమ్మడి దాడికి పాల్పడింది. శుక్రవారం ఎంపీటీసీ నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న దారెల్లి సందీప్, గద్దల రవీంద్రలను ఎల్లో గూండాలు మాట్లాడాలని ఇంట్లోకి పిలిచి కట్టేసి చిత్రహింసలు పెట్టి కొట్టారు. పచ్చ రౌడీల దాడిలో గాయపడి తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందీప్, నవీంద్రలను నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామి దాస్‌ శనివారం పరామర్శించారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. దళితులు దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు బాధితులనే స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని స్వామిదాస్‌ ఆరోపించారు. పోలీసులు ఇలా ప్రవర్తించడం దారుణమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement