ఫ్రాన్స్‌ నిరసనల్లో ‘సూపర్‌ హీరోలు’ | Super Heroes Black Panther Captain America Join France Protests | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌ నిరసనల్లో ‘సూపర్‌ హీరోలు’

Oct 25 2026 10:58 AM | Updated on Oct 25 2026 11:34 AM

Super Heroes Black Panther Captain America Join France Protests

ఫ్రాన్స్‌లో నిరసనల సెగ రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు పోలీసుల బాష్ప వాయు ప్రయోగాలు, వాటర్‌ క్యానన్లతో ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నాలు జరుగుతుండగా.. మరో వైపు నిరసనల్లోకి సూపర్‌ హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్‌ పాంథర్‌, కెప్టెన్‌ అమెరికా, స్పైడర్‌మ్యాన్‌, సూపర్‌మ్యాన్‌, డెడ్‌పూల్‌ వంటి సూపర్‌హీరోల వేషధారణలో ఆందోళనల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

తాజాగా పారిస్‌లో జరిగిన నిరసనల్లో బ్లాక్‌ పాంథర్‌, కెప్టెన్‌ అమెరికా వేషధారణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సందడి చేశారు. వారు తమదైన శైలిలో విన్యాసాలు చేస్తుండగా.. చుట్టూ ఉన్న ఆందోళనకారులు వారితో ఫొటోలు దిగారు. అనంతరం వారిద్దరూ నిరసనకారులతో కలిసి నినాదాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. మరో వైపు భద్రతా సిబ్బంది బారికేడ్లతో ఆ ప్రాంతాన్ని కాపలా కాస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.

నిరసనల్లో పాల్గొంటున్నవారు పోలీసుల చర్యలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలామంది ముఖాలకు మాస్కులు ధరించడంతో పాటు కళ్లకు రక్షణ కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు. దాదాపు అందరూ హెల్మెట్లు ధరించి కనిపిస్తున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసినా, బాష్పవాయు గోళాలు ప్రయోగించినా వాటి ప్రభావం తగ్గించుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఫ్రాన్స్‌లో జీవన వ్యయం పెరగడం, విద్యా రంగానికి నిధులు తగ్గడం వంటి అంశాలపై ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. దాదాపు నాలుగు లక్షల మంది వీధుల్లోకి రావడంతో ప్రభుత్వం భద్రతా బలగాలను భారీగా మోహరించింది. ఈ క్రమంలో దాదాపు వెయ్యి మందిని అరెస్ట్‌ చేసినట్లు  అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.

ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్‌ నూనెజ్‌ కీలక వ్యాఖ్యలు చేస్తూ.. దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన దోపిడీలు, హింసను నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా ఆయన ముందుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ అందుకు అంగీకరించలేదని సమాచారం.

ఇదీ చదవండి:  బతకడం కోసం కాలునే కోసుకున్నాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement