నిధులిస్తేనే ఆధునీకరణ  | Donald Trump calls for air traffic control upgrades after nationwide ground stop | Sakshi
Sakshi News home page

నిధులిస్తేనే ఆధునీకరణ 

Nov 16 2026 6:07 AM | Updated on Nov 16 2026 6:07 AM

Donald Trump calls for air traffic control upgrades after nationwide ground stop

వాషింగ్టన్‌: దేశవ్యాప్తంగా విమాన సేవలు నిలిచిపోవడం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. అమెరికా విమాన ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునీకరించడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని చట్టసభ ‘కాంగ్రెస్‌’ను డిమాండ్‌ చేశారు. శుక్రవారం, శనివారం అమెరికాలో వేలాది విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. విమాన సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు రోజులపాటు మౌనంగా ఉన్న ట్రంప్‌ ఆదివారం నోరు విప్పారు.

 సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దేవంలో విమానయాన వ్యవస్థను ఆధునీకరించే పనిని తమ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. అయితే, ఈ పనిని కొంచెం కొంచెంగా (ముక్కలు ముక్కలుగా) చేయకూడదని పేర్కొన్నారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఆధునీకరణ కోసం అత్యవసరంగా అవసరమైన నిధుల విడుదలకు కాంగ్రెస్‌ అంగీకారం తెలియజేయాలని స్పష్టంచేశారు. తగినన్ని నిధులు ఇస్తేనే అనుకున్న పనిని సమర్థవంతంగా, వేగంగా పూర్తిచేయగలమని ఉద్ఘాటించారు. ప్రస్తుతం మనకున్న ఎయిర్‌ కంట్రోల్‌ వ్యవస్థలో చాలా భాగం 50 ఏళ్ల నాటిదని గుర్తుచేశారు. 

సాధారణ స్థితి విమాన సేవలు  
అమెరికాలో విమాన సేవలు ఆదివారం చాలావరకు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) వర్గాలు వెల్లడించాయి. విమానాలు యథావిధిగా రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపాయి. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ వంటి సంస్థలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిసింది. ఆయా సంస్థల విమానాల్లో కొన్ని ఆలస్యంగా నడిచాయి. విమానాల షెడ్యూళ్లలో మార్పులు చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement