అమెరికాలో విమానాలకు బ్రేకులు! | US flight disruptions due to outdated ATC systems | Sakshi
Sakshi News home page

అమెరికాలో విమానాలకు బ్రేకులు!

Nov 15 2026 4:45 AM | Updated on Nov 15 2026 4:46 AM

US flight disruptions due to outdated ATC systems

దేశవ్యాప్తంగా ఒక్కరోజే 4,534 విమానాలు రద్దు

ఆలస్యంగా నడిచిన మరో 4,607 విమానాలు  

కొత్త టెక్నాలజీ కారణం అంటున్న ప్రభుత్వం 

సమాచారంలో అంతరాయాలు.. రాడార్లు పనిచేయని వైనం  

వాషింగ్టన్‌:  అమెరికాలో విమానయాన రంగం ఒక్కసారిగా స్తంభించిపోయింది. దేశ విమానయాన నియంత్రణ వ్యవస్థకు కొత్త సాంకేతికతను జోడించడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. పాత పరికరాలపై భారం పెరిగి, సమాచార, రాడార్లలో అంతరాయాలు ఏర్పడ్డాయని, ఫలితంగా నాలుగు గంటలకు పైగా విమాన సరీ్వసులు నిలిచిపోయాయని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 

శనివారం దేశవ్యాప్తంగా 4,534 విమానాలను రద్దు చేశారు. మరో 4,607 విమానాలు ఆలస్యంగా నడిచాయి. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఎయిర్‌పోర్టుల్లోనే చిక్కుకు పోయారు. గంటలపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. మరికొందరు ఆటపాటలతో విమానాశ్రయాల్లోనే ఉండిపోయారు. వారాంతపు రోజుల్లో జరిగే క్రీడా టోర్నిల్లో పాల్గొనాల్సిన జట్లు కూడా ఇక్కడే చిక్కుకుపోవడంతో ఆటల షెడ్యూల్‌లో మార్పులు అనివార్యమయ్యాయి. 

పలువురు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది. గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సులు, రైళ్ల కోసం పరుగులు తీశారు. విమానాల రద్దు కావడం ప్రభావం ప్రపంచమంతటా కనిపించింది. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో శనివారం అమెరికాకు రాకపోకలు సాగించనున్న అనేక విమానాలు ఆలస్యం అయినట్లు లేదా రద్దయినట్లు ప్రకటించారు. 

అమెరికాలో నిత్యం 45,000 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాటిలో శనివారం నాలుగో వంతు విమానాలపై ప్రభావం పడింది. వాస్తవానికి ఈ సమస్య శుక్రవారమే మొదలైంది. విమానాలను నిలిపివేసే ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో గాలిలో ఉన్న 3,000కు పైగా విమానాలు సురక్షితంగా ల్యాండ్‌ అయ్యాయని హోంల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్‌ ముల్లిన్‌ తెలియజేశారు.  

త్వరలో మరిన్ని అంతరాయాలు?  
అగ్రరాజ్యంలో ఒక్కరోజులోనే వేలాది విమాన సేవలు నిలిచిపోవడం 2001 సెపె్టంబర్‌ 11 ఉగ్రవాద దాడుల తర్వాత ఇది రెండోసారి. 2023 జనవరి తర్వాత మొదటిసారి. మూడున్నరేళ్ల క్రితం పైలట్లకు నోటీసులు పంపే ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన కీలక కంప్యూటర్‌ వ్యవస్థ పని చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని రవాణా శాఖ మంత్రి షాన్‌ డఫ్పీ చెప్పారు. విమానాలు క్రమంగా టేకాఫ్, ల్యాండింగ్‌ అవుతున్నాయని తెలిపారు. కానీ, దీని ప్రభావం కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చు. వచ్చే గురువారం నాటి థ్యాంక్స్‌ గివింగ్‌ వేడుక నాటికి పరిస్థితులు మెరుగు కావచ్చునని అధికారులు చెబుతున్నారు. కొత్త సాంకేతికత కోసం మరిన్ని నిధులు ఇవ్వడంతో కాంగ్రెస్‌ విఫలమైందని షాన్‌ డప్ఫీ తప్పుపట్టారు. త్వరలో మరిన్ని అంతరాయాలు సంభవించవచ్చని అభిప్రాయపడ్డారు. 

ఈ వైఫల్యం పాత పరికరాల వల్ల జరిగిందని, ఆకాశంలో తలెత్తే సమస్యలను అంచనా వేయడానికి ప్రవేశపెడుతున్న ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) కొత్త ఏఐ–ఆధారిత వ్యవస్థతో దీనికి సంబంధం లేదని చెప్పారు. ఎప్పటికీ ఆగిపోని వ్యవస్థను అప్‌డేట్‌ చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ఎఫ్‌ఏఏ ఇప్పటికే వేలాది పాత రాగి తీగలను ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్లతో భర్తీ చేసింది. వందలాది రేడియో వ్యవస్థలను అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ పనిని పూర్తి చేయడానికి మరో 30 బిలియన్‌ డాలర్లు కావాలని షాన్‌ డప్ఫీ ఒత్తిడి చేస్తున్నారు.  

మా సర్వీసులు షెడ్యూల్‌ ప్రకారమే: ఎయిరిండియా 
ముంబై: ట్రాఫిక్‌ కంట్రోల్‌ సెంటర్లలో సమస్యల కారణంగా అమెరికాలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఎయిరిండియా స్పందించింది. అమెరికాకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సరీ్వసులు దాదాపుగా షెడ్యూల్‌ ప్రకారమే నడిచాయని పేర్కొంది. ఎక్కడా పెద్దగా ఆలస్యం కాలేదని తెలిపింది. న్యూయార్క్, నెవార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన విమానాలు శనివారం ఉదయం నిరీ్ణత సమయానికే ల్యాండైనట్లు వివరించింది. టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని ఎయిరిండియా అమెరికాకు నేరుగా విమాన సరీ్వసులు నడిపే ఏకైక భారతీయ విమానయాన సంస్థ.  

నేటి రాత్రి కల్లా సాధారణ పరిస్థితి 
అమెరికాలో విమాన ప్రయాణాలు ఆదివారం రాత్రి కల్లా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రతినిధి బ్రియాన్‌ బెడ్‌ఫోర్డ్‌ శనివారం చెప్పారు. విమానాల రాకపోకలు పునఃప్రారంభం కావడంతో అత్యంత క్లిష్ట పరిస్థితి గడిచిపోయినట్లేనని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement