న్యూఢిల్లీ: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)పై దేశ రాజధానిలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ భద్రతను మరింత పెంచారు. ఆయనకు ఇప్పటికే జెడ్ ప్లస్ భద్రత అందించగా, ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఆయన నివాసం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జ్ఞానేశ్ కుమార్‌కు ముప్పు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో ఇప్పటికే నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు విపక్షాల డిమాండ్
‘సర్’లో అవకతవకలు, ఓటింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
జెడ్ ప్లస్ భద్రతలో దాదాపు 50 మంది సిబ్బంది
దేశంలో ప్రధానమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు కల్పించే ఎస్పీజీ భద్రత తర్వాత అత్యున్నత భద్రతా కేటగిరీల్లో జెడ్ ప్లస్ ఒకటి. ఈ భద్రతలో భాగంగా రక్షణ పొందుతున్న వ్యక్తి నివాసం, ప్రయాణించే వాహన శ్రేణి వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరిస్తారు. ఒక షిఫ్ట్‌లో సుమారు 50 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు.
ఢిల్లీలో 23 వేల మంది కేంద్ర బలగాలు
ఇదిలా ఉండగా ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మోహరిస్తోంది. అక్టోబర్ 8 నుంచి 12 వరకు ఢిల్లీ పోలీసులకు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన 221 కంపెనీలను కేటాయించారు. వీటిలో దాదాపు 23 వేల మంది సిబ్బంది ఉంటారు. నిరసనలను నియంత్రించడం, కీలక ప్రభుత్వ భవనాలకు భద్రత కల్పించడం, మధ్య ఢిల్లీలో శాంతిభద్రతలను పర్యవేక్షించడం వంటి బాధ్యతలను ఈ బలగాలు నిర్వహించనున్నాయి. అదనపు భద్రతా బలగాల కోసం సీఆర్‌పీఎఫ్ కంపెనీలను జమ్ముకశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. నిరసనల నేపథ్యంలో రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.


