తువాల్: ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. తువాల్ నగరానికి పశ్చిమ-నైరుతి దిశగా సుమారు 151 కిలోమీటర్ల దూరంలో బాండా సముద్రంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. నవంబర్ 16న భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.41 గంటలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (యూఎస్‌జీఎస్)ఈ వివరాలను వెల్లడించింది.
Notable quake, preliminary info: M 6.6 - 151 km WSW of Tual, Indonesia https://t.co/IbAmC8ZdMD
— USGS Earthquakes (@USGS_Quakes) November 16, 2026
ప్రాథమిక సమాచారం ప్రకారం భూకంప కేంద్రం భూమికి 35 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సవరించిన గణాంకాల్లో దాని లోతు సుమారు 68 కిలోమీటర్లుగా నమోదైంది. సముద్రంలో, తగినంత లోతులో భూకంపం సంభవించడంతో భూమిపై ప్రభావం పరిమితంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. యూఎస్‌జీఎస్) పేజర్ వ్యవస్థ ఈ భూకంపానికి గ్రీన్ అలర్ట్ ఇచ్చింది. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. షేక్‌మ్యాప్ ప్రకారం గరిష్ఠ ప్రకంపనల తీవ్రత మోడరేట్ స్థాయిలో నమోదైంది. సమీప ప్రాంతాల్లో స్వల్పం నుంచి మధ్యస్థ స్థాయిలో ప్రకంపనలు కనిపించాయి.
ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ బీఎంకేజీ కూడా ఈ భూకంపాన్ని నమోదు చేసింది. అయితే సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు భారీ ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టానికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్రజలు ప్రకంపనలు గుర్తించినప్పటికీ, భవనాలకు గణనీయమైన నష్టం జరిగినట్లు ఆధారాలు లేవు.
ఇదీ చదవండి: Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!


