మనీలా గురుద్వారాలో ప్రధాని మోదీ పూజలు | PM Modi visits historic Gurudwara Khalsa Diwan in Manila | Sakshi
Sakshi News home page

మనీలా గురుద్వారాలో ప్రధాని మోదీ పూజలు

Nov 17 2026 10:30 AM | Updated on Nov 17 2026 10:32 AM

PM Modi visits historic Gurudwara Khalsa Diwan in Manila

మనీలా: ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో పర్యటించారు. అక్కడ వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఫిలిప్పీన్స్‌లోని పురాతన గురుద్వారా ఖాల్సా దివాన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గురుద్వారా పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్వయంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిప్పీన్స్‌ సెనేటర్‌ ఫ్రాన్సిస్‌ జోసెఫ్‌ ఎస్కుడెరో, మనీలా మేయర్‌ ఫ్రాన్సిస్కో ఇస్కో మోరెనో కూడా పాల్గొన్నారు. అనంతరం భారతీయ ప్రవాసులు, సిక్కు  సభ్యులతో మోదీ ముచ్చటించారు. చారిత్రక గురుద్వారాను సందర్శించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు.

శతాబ్దానికి పైగా చరిత్ర
విదేశాంగ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఖాల్సా దివాన్ గురుద్వారా 1901లో ప్రారంభమైంది. 1903లో అధికారికంగా వ్యవస్థీకృతమైంది. 1924లో ఖాల్సా దివాన్ పేరుతో రిజిస్టర్‌ అయింది. ఫిలిప్పీన్స్‌లోని సిక్కు సమాజానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలకు ఇది ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. ఈ గురుద్వారా భారతీయ సిక్కు సమాజానికి, ఫిలిప్పీన్స్‌ ప్రజలకు మధ్య సంబంధాలను బలోపేతం చేస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. శతాబ్దానికి పైగా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, ప్రజా సంబంధాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొంది.

మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మోదీ మనీలా చేరుకున్నారు. ఫిలిప్పీన్స్‌ ఆతిథ్యమిస్తున్న 23వ ఆసియాన్‌-భారత్‌ సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఆగ్నేయ, తూర్పు ఆసియా దేశాలతో భారత్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఆసియాన్‌-భారత్‌ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అమలు పురోగతిని నేతలు సమీక్షించనున్నారు. 2026-2030 కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లు, పరస్పర సహకారంపై అభిప్రాయాలు పంచుకోనున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement