సరదాగా మొదలైంది | Rakul Preet Singh opens Up on Playing Surpanakha in Ramayana | Sakshi
Sakshi News home page

సరదాగా మొదలైంది

Nov 22 2026 12:17 AM | Updated on Nov 22 2026 12:17 AM

Rakul Preet Singh opens Up on Playing Surpanakha in Ramayana

ప్రతి చెడులోనూ ఓ మంచి ఉంటుందన్నట్లు...  ‘రామాయణం’లో శూర్పణఖ పాత్రలో సరికొత్త అవతారం ఎత్తిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జీవితంలోనూ అలాంటి సంగతులెన్నో! అవేంటో ఆమె మాటల్లోనే మీకోసం..

క్రమశిక్షణే పునాది!
నాన్న పేరు రాజేందర్‌లోని ‘రా’.. అమ్మ పేరు కుల్వీందర్‌లోని ‘కుల్‌’ కలిపి రకుల్‌ అని పెట్టారట! నాన్న ఆర్మీ ఆఫీసర్‌. అందుకే, ఒక ప్రాంతంలోనే కాకుండా వివిధ ఆర్మీ కంటోన్మెంట్లలో పెరిగాను. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు... ఇలా పరిస్థితులకు తగ్గట్టు మారడం చిన్నప్పుడే అలవాటైంది. అలాగే, సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యతగా ఉండటం ఇవన్నీ కూడా నా జీవితంలో భాగమే!  

ఆ రెండూ ఇష్టం
ఢిల్లీలోని జీసస్‌ అండ్‌ మేరీ కాలేజీలో గణితంలో డిగ్రీ చేశాను. చిన్నప్పుడు గణితం, గోల్ఫ్‌ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్‌ రోజుల్లో జాతీయ స్థాయి గోల్ఫ్‌ పోటీల్లో పాల్గొన్నాను. వాటి వల్ల ఏకాగ్రత, సహనం పెరుగుతాయి. అందుకే, సమయం దొరికినప్పుడు మళ్లీ గోల్ఫ్‌ ఆడతాను. ప్రయాణాలు చేస్తుంటాను. అప్పుడే, తిరిగి పనిలోకి వచ్చినప్పుడు మరింత ఉత్సాహంగా ఉంటా.

మోడలింగ్‌ నుంచి.. హీరోయిన్ గా!
కాలేజీలో చదువుకుంటున్నప్పుడే మోడలింగ్‌ ప్రారంభించాను. అప్పట్లో అది సరదాగా మొదలైన ప్రయాణమే. 2009లో కన్నడ చిత్రం ‘గిల్లీ’తో సినిమాల్లోకి అడుగుపెట్టాను. అక్కడి నుంచి తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ఆ తర్వాత హిందీ సినిమాల్లోనూ నటించే అవకాశం వచ్చింది.

ఫిట్‌నెస్‌.. నా రోజువారీ పని!
ఫిట్‌నెస్‌ అనేది నా జీవితంలో విడదీయలేని భాగం. జిమ్‌ వర్కవుట్స్‌తోపాటు ఫంక్షనల్‌ ట్రైనింగ్, స్విమ్మింగ్, యోగా చేస్తుంటాను. కొన్నిసార్లు ఏరియల్‌ యోగా కూడా ప్రయత్నిస్తాను. వ్యాయామం అంటే కేవలం శరీరాకృతిని కాపాడుకోవడం మాత్రమే కాదు... రోజంతా ఉత్సాహంగా, శక్తిమంతంగా ఉండటానికి అవసరమైన సాధనం.

ట్రెండ్‌ కాదు.. కంఫర్టే ముఖ్యం!
ఫ్యాషన్  విషయంలో నాకు ఒకటే సూత్రం. ఎంత ఖరీదైన దుస్తులైనా మనకు నచ్చకపోతే, సౌకర్యంగా లేకపోతే వాటిని ధరించడం వల్ల ఉపయోగం లేదు. ట్రెండ్‌ ఉందని గుడ్డిగా అనుసరించకుండా, మన వ్యక్తిత్వానికి, సందర్భానికి తగ్గట్టుగా దుస్తులు ఎంచుకోవాలి. అలాగే, ఆరోగ్యంగా ఉండటమే అసలైన అందం అని నమ్ముతాను.

బిజినెస్‌.. మరో బాధ్యత!
ఒక నటిగా కెమెరా ముందు ఉండటమే కాకుండా, కొత్త రంగాల్లోనూ నేర్చుకుంటూ ముందుకు వెళ్లడం నాకు ఇష్టం. అందుకే, హైదరాబాద్, విశాఖపట్నంలో ఫిట్‌నెస్‌ జిమ్‌ ఫ్రాంచైజీల నిర్వహణలో భాగమయ్యాను. వ్యాపారం నిర్వహించాలంటే ప్రణాళిక, క్రమశిక్షణ, ఓపిక చాలా అవసరం.

రుచిలోనూ.. హెల్తీ టచ్‌!
ఆలూ పరాఠా, సుషీ అంటే చాలా ఇష్టం. అయితే, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారపు అలవాట్లను నియంత్రించుకుంటాను. ప్రాసెస్‌ చేసిన చక్కెర, అధిక కేలరీల పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటాను.

పెళ్లిలోనూ.. పర్యావరణ హితం!
జాకీ భగ్నానీతో నా వివాహం 2024 ఫిబ్రవరి 21న గోవాలో జరిగింది. ఆ వేడుకలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా   తగ్గించడంపై చాలా దృష్టి పెట్టాం. జీవితంలో ప్రత్యేకమైన సందర్భాలను జరుపుకుంటూనే పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండొచ్చని మా పెళ్లి ద్వారా చెప్పాలనుకున్నాం.

శూర్పణఖగా.. సరికొత్త అవతారం!
రావణుడి సోదరి శూర్పణఖను సాధారణంగా ప్రతినాయకురాలిగానే చూస్తుంటారు. కానీ ఆ పాత్రలో ఎన్నో భావోద్వేగాలు, భిన్నమైన కోణాలున్నాయి. అందుకే, ఇప్పటివరకు కనిపించిన పాత్రలన్నీ ఒక ఎత్తయితే.. ‘రామాయణం: పార్ట్‌ వన్ ’లో శూర్పణఖగా నటించడం మరో ఎత్తు. ఈ అవకాశం రావడం నా అదృష్టం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement