ఫండే
మిస్టిక్ వరల్డ్
‘నేను మళ్లీ పుడతాను. నీ కూతురిగా ఈ లోకంలోకి వస్తాను. మాట్లాడే వయసు వచ్చినప్పుడు నా గత జీవితానికి సంబంధించిన విషయాలు చెబుతాను. అప్పుడు నేనే సిన్హా అని నువ్వు గుర్తుపడతావు’ – తన ప్రాణ స్నేహితురాలు ఇడా లోరెంజ్‌తో మరియా జానువారియా చెప్పిన చివరి మాటలివి. దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ ప్రాంతానికి చెందిన మరియా ఓ సంపన్న యువతి.
ఇంట్లో అందరూ ముద్దుగా ఆమెను సిన్హా అని పిలుచుకునేవారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి తండ్రి ఒప్పుకోకపోవడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ క్రమంలో సిన్హాకు క్షయ సోకింది. గొంతు, ఊపిరితిత్తులకు వ్యాధి సోకడంతో మాట్లాడటమే కష్టంగా మారింది. 1917 అక్టోబర్‌లో మరణం సమీపిస్తున్న సమయంలో ఇడాను పిలిచి తాను మళ్లీ పుడతాననే సంగతి చెప్పి కన్నుమూసింది.
1918 ఆగస్టు 14...
ఇడా లోరెంజ్‌కు ఓ ఆడపిల్ల పుట్టింది. ఆ చిన్నారికి మార్టా అని పేరు పెట్టారు. మార్టా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకరోజు తన అక్క లోలాతో కలిసి బయటకు వెళ్లింది. తిరిగి వస్తున్న సమయంలో మార్టా తనను ఎత్తుకోవాలని అక్కను అడిగింది. ‘నేను పెద్దగా ఉన్నప్పుడు... నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకునేదాన్ని’ అని చెప్పేసరికి లోలా ఆశ్చర్యపోయింది.
తాను తమ ఇంటికి దూరంగా మరో ప్రాంతంలో నివసించేదాన్నని, అక్కడ ఆవులు, ఎద్దులు, నారింజ చెట్లు ఉండేవని చెప్పింది. ఆ వివరాలు సిన్హా తండ్రికి చెందిన వ్యవసాయ క్షేత్రానికి సరిపోతున్నాయని తర్వాత గుర్తించారు. మార్టా తన గత జన్మ పేరు సిన్హా అని, మరియా అని కూడా పిలిచేవారని చెప్పింది. మరో పేరు గుర్తులేదని పేర్కొంది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సిన్హా తండ్రి ఇంట్లో ఉన్న ఓ గడియారం వెనుక బంగారు అక్షరాలతో తన పేరు రాసి ఉంటుందని చెప్పింది. పన్నెండేళ్ల వయసులో తండ్రి ఆమెను సిన్హా పూర్వ నివాసానికి తీసుకెళ్లినప్పుడు, ఆ గడియారాన్ని చూపించి తన మాట నిజమని చెప్పడం అందరినీ నివ్వెరపోయేలా చేసింది.
ఈ నేపథ్యంలో మార్టా చెప్పిన విషయాలను ఆమె తండ్రి ఎఫ్.వి.లోరెంజ్ నమోదు చేయడం ప్రారంభించారు. చిన్నారి చెప్పిన విషయాలు, గుర్తుపట్టిన వ్యక్తులు, గత జీవితానికి సంబంధించిన వివరాలు ఇలా దాదాపు 120 అంశాలను జర్మన్ షార్ట్‌హ్యాండ్‌లో రాశారు. అయితే ఈ ఆ నోట్స్ కుటుంబంలోని ఓ వ్యక్తికి అర్థం కాకపోవడంతో పొరపాటున పారవేశారు. దీంతో మార్టా తండ్రి తన జ్ఞాపకాల ఆధారంగా ఈ సంఘటనలను తిరిగి రాసుకున్నారు.
మార్టా తండ్రి చనిపోయిన తర్వాత ఈ వ్యవహారం అమెరికాకు చెందిన పునర్జన్మల పరిశోధకుడు డాక్టర్ ఇయాన్ స్టీవెన్ సన్ దృష్టికి వెళ్లింది. ఆయన 1962లో బ్రెజిల్‌కు వెళ్లి ఐదు రోజులపాటు ఈ కేసును పరిశీలించారు. అప్పటికి మార్టా వయసు 44 ఏళ్లు. చిన్నతనంలో మార్టా చెప్పిన విషయాలను కుటుంబ సభ్యుల జ్ఞాపకాలతో పోల్చారు. మొత్తం 28 అంశాలను ఎంపిక చేసి పరిశీలించారు. వాటిలో కొన్ని సరైనవని గుర్తించారు.
సిన్హా, మార్టా వ్యక్తిత్వాల్లోనూ కొన్ని పోలికలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సిన్హాకు పిల్లులంటే ఎంతో ఇష్టం. మార్టాకు కూడా పిల్లులంటే ఇష్టముండేది. సిన్హా నృత్యాన్ని ఇష్టపడితే మార్టా కూడా నృత్యం పట్ల ఆసక్తి చూపేది. వర్షం అంటే సిన్హాకు భయం ఉండగా, మార్టా కూడా వర్షానికి భయపడేది. ఇక ఆరోగ్య సమస్యల విషయంలోనూ ఓ పోలిక ఉందని స్టీవెన్‌సన్ గుర్తించారు. సిన్హా జీవితాంతంలో గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయవ్యాధితో బాధపడింది.
మార్టాకు చిన్నతనంలో తరచూ గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చేవి. పెద్దయ్యాక కూడా బ్రాంకైటిస్ వచ్చినప్పుడు గొంతు పూర్తిగా సహకరించేది కాదని స్టీవెన్ సన్ తెలుసుకున్నారు.
1972లో స్టీవెన్ సన్ మరోసారి కలిసినప్పుడు మార్టా గత జన్మను పూర్తిగా మర్చిపోలేదని గుర్తించారు. సిన్హా చివరి రోజులు, ఆమె ప్రేమించిన వ్యక్తి ఫ్లోరిజో గురించి కొన్ని విషయాలను అప్పటికీ గుర్తుచేసుకుంది. మార్టా తనను కేవలం మార్టాగానే కాకుండా, సిన్హాగా కూడా భావించేదని స్టీవెన్ సన్ తన పరిశోధనలో పేర్కొన్నారు.
అయితే, మార్టా లోరెంజ్ ఉదంతంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. మొదటిది... మార్టా తల్లి ఇడా... సిన్హాకు స్నేహితురాలు. కాబట్టి చిన్నారి కొన్ని విషయాలను కుటుంబ సభ్యుల సంభాషణల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
అలాగే మార్టాకు ఉన్నట్లు భావిస్తున్న అసాధారణ గ్రహణశక్తి ద్వారా ఇతరుల మనసుల్లోని సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉందా? అనే ప్రత్యామ్నాయ వివరణను కూడా స్టీవెన్ సన్ పరిశీలించారు. అయితే అది మార్టాలో కనిపించిన దీర్ఘకాలిక గుర్తింపు భావనను పూర్తిగా వివరించలేదని తన విశ్లేషణలో పేర్కొన్నారు. స్టీవెన్ సన్ ఈ కేసును పరిశోధించే సమయానికి ఇడా జీవించి లేకపోవడంతో కీలకమైన విషయాలను ఆయన ధ్రువీకరించుకోలేకపోయారు.
మార్టా కథ పునర్జన్మ ఉందని నిరూపించదు. అలాగని ఆమె చెప్పిన విషయాలన్నింటినీ కొట్టిపారేయలేం. మరణంతో మనిషి జీవితం ముగుస్తుందా? జ్ఞాపకాలకు కూడా మరో జీవితం ఉంటుందా? అనే ప్రశ్నలను మాత్రం ఈ ఉదంతం మన ముందుంచుతుంది.
- సత్యకిశోర్ కొండ్రెడ్డి
ఇదీ చదవండి: స్వర్గానికి దారి కాదు.. ప్రాణాలు తీసే మెట్ల మార్గం!


