ఫండే
లిట్‌వరల్డ్
‘వలపు విషయాన నాచేత వలయు నెద్ది?
కడకు నీవైతివొక కరకు గచ్చులాడి!
మరణమునకైన మందొకటి దొరకునేమొ–
బ్రదుకునకు మాత్రమౌషధము బడయలేము!’ అన్న ఈ ప్రౌఢకవి ‘ఫిరాక్ గోరఖ్‌పురీ’. ఉర్దూ సాహిత్య సంప్రదాయంలో, కవులు కలంపేరు– తఖల్లుస్– ధరించడం ఓ ఆచారం! దాంతో పాటే తాము ఏ ప్రాంతానికి చెందిన వారమో కూడా ధ్వనింప చేయడమూ ఆ సంప్రదాయంలో భాగమే!!
అలనాటి అమీర్ ఖుస్రో ‘దెహ్లవీ’ మొదలుకొని, ఇల నేటి ఇమ్రాన్ ‘ప్రతాప్ గఢీ’ వరకూ ఈ సంప్రదాయాన్ని ఏదో రూపంలో కొనసాగిస్తున్న వారే. మీర్ తకీ ‘మీర్’, మీర్జా ‘గాలిబ్’, ‘అల్లామా ఎఖ్బాల్’, ‘దాగ్ దెహ్లవీ’, ‘జోష్ మలిహాబాదీ’, ‘జిగర్ మొరాదాబాదీ’, ‘హస్రత్ మొహానీ’, ‘సాహిర్ లూధియాన్వీ’ తదితరులు ఈ సంప్రదాయాన్నే కొనసాగించారు. తెలుగు జర్నలిస్ట్ కుటుంబానికి చెందిన ఉర్దూ అనువాదకుడు ‘మెహక్ హైదరాబాదీ’ కూడా అదే సంప్రదాయం పాటిస్తున్నారు!
ఆంగ్ల సాహిత్యంలో ఎమ్మే చేసిన ఫిరాక్ అంతకు ముందే సాంప్రదాయిక ఉర్దూ రచనారూపాలైన గజల్, నజ్మ్, రుబాయీ, కతా (సంతాపసూచక కవితారూపం) లాంటి వాటిలో తగిన శిక్షణ పొందివున్నారు. తక్కుతూ తారుతూ ఇరవయ్యో శతాబ్ది చిట్టచివరి అడుగులు వేస్తూండగా, నాటి యునైటెడ్ ప్రావిన్సెస్ (నేటి ఉత్తరప్రదేశ్)లోని గోరఖ్‌పూర్‌లో, 1896లో జన్మించిన ఈ ఉర్దూ కవి అసలు పేరు రఘుపతి సహాయ్. ఆయన కలంపేరు ‘ఫిరాక్’ అనే మాటకు ‘విరహం, శోధన’ లాంటి అర్థాలు – సందర్భానుసారంగా– అన్వయిస్తాయని నిఘంటువులు చెప్తున్నాయి.
జ్ఞానపీఠ పురస్కారం ఫిరాక్ కవిని 1969లో వలచి వరించింది! అంతకు ముందు సంవత్సరమే ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1960లోనే ఫిరాక్ రచన ‘గులే నగ్మా’ (కుసుమ కోమల గీతం) కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందివుంది. ఈ శీర్షిక వినగానే ఉర్దూ కవితా ప్రియులకు ‘న గులే నగ్మా హూం– న పర్దా యే సాజ్ మే హూం’ (‘నేను కుసుమ కోమల గీతాన్నీ కాను– తీగెలలో దాగిన పాటపై కప్పిన మేలిముసుగునూ కాను’) అన్న గాలిబ్ కవి వాక్యం స్ఫురించక పోదు! కవిగా అవతారమెత్తక ముందే, ఫిరాక్ కవి చరిత్ర సృష్టించారు.
1920లో గాంధీజీ ఇచ్చిన సహాయనిరాకరణ పిలుపునకు స్పందనగా, తన 24వ యేటనే, ఆయన ఐసీఎస్ పదవికి రాజీనామా సమర్పించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహానికి గురై, ఏడాదిన్నర కాలం జైల్లో మగ్గారు. అటుతర్వాత ఆయన రాజకీయ కార్యకలాపాల్లోంచి తప్పుకున్నారు. 1930లో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్య అధ్యాపకుడిగా చేరి, 1958లో విరమించారు. కొంతకాలం ఆయన యూజీసీలో పరిశోధక ఆచార్యుడిగానూ, ఆకాశవాణిలో ‘ప్రొడ్యూసర్ ఎమిరైటస్’గానూ పనిచేశారు. డజను కవితా సంకలనాలనూ, అరడజను వ్యాససంకలనాలనూ ఉర్దూలో వెలువరించారు ఫిరాక్.
ఆయన సాహిత్య– సాంస్కృతిక విషయాలపై హిందీలోనూ, ఆంగ్లంలోనూ కూడా అనేక రచనలు చేసివున్నారు. అయితే ఫిరాక్ పేరుచెప్పగానే అందరికీ స్ఫురించేది ఉర్దూ కవిత్వమే! ఫిరాక్ జీవితచరిత్రను ‘సంతోష సంతాపాల కవి’ పేరిట అజయ్ మాన్‌సింగ్ రచించారు. ఈ పుస్తకంలో కవి జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలతో పాటు కొన్ని రచనల అనువాదాలను కూడా చేర్చారు మాన్‌సింగ్. లౌకిక భావాలకు ప్రతీకప్రాయుడిగా జీవించిన ఫిరాక్ 1982లో కన్నుమూశారు.
ఫిరాక్ గోరఖ్‌పురీ పుట్టుకకు ముందే– పందొమ్మిదో శతాబ్ది మధ్యలోనే– ఉర్దూ కవిత్వం వస్తురూపాల స్వరూప స్వభావాల్లో ఆధునికత రూపుదిద్దుకునే క్రమం మొదలైపోయింది. ఆ క్రమం ఒక్క రోజున వచ్చిపడింది కాదు! ఆ మాటకొస్తే, ఏ భాషలోనూ అది అలా జరగదని చదువుకున్న వాళ్ళకు తెలిసిందే! మహమ్మద్ హుస్సేన్ ఆజాద్, అల్తాఫ్ హుస్సేన్ హాలీ ఈ ధోరణికి వైతాళికులంటారు. ఛందోబద్ధ ఖండకావ్యాల స్థానంలో గీతాలు– గేయాలు ప్రవేశించి స్థిరపడడంతో ఇది స్ఫుటమైన రూపం తీసుకుంది.
అనేక భారతీయ భాషల్లో ఈ క్రమం కొంచెం అటూ యిటూగా అలాగే మొదలైంది. ఉర్దూ ఆధునిక కవితా పరిణామం దాదాపు అరవయ్యేళ్ళ కాలం సుదీర్ఘంగా సాగడం విశేషం. ఫిరాక్ గోరఖ్‌పురీలాంటి కవులు ఈ క్రమాన్ని వేగవంతం చేసిన వారిలో ఒకరు. 1930 దశకంలో, అభ్యుదయ భావాల ప్రేరణతో భారతీయ భాషల్లో ఈ క్రమం మరో మెట్టెక్కింది. ప్రేమ్‌చంద్– సజ్జాద్ జహీర్– ముల్క్ రాజ్ ఆనంద్– రాహుల్జీ– నాగార్జున తదితరులు దానికి స్ఫుటమైన ‘మొక్కట్లు’ చెక్కారని చెప్పవచ్చు.
ఆ క్రమంలో– రెండో వరుసలో– ఫిరాక్ కూడా ఉన్నారన్నది వాస్తవం. అయితే, ఆ క్రమంపై ఫిరాక్ లాంటి కవుల ప్రభావం పరిమితమేనన్నది మరో వాస్తవం. అన్నిటికీ మించి, భారతీయ భాషా సాహిత్యాలపై అభ్యుదయ సాహిత్యం ప్రభావం దీర్ఘకాలం సాగలేదన్నది అసలైన వాస్తవం! సాహిత్యం, సంస్కృతి లాంటి రంగాలకు ఉండే ‘సాపేక్షిక స్వాతంత్య్రమే’ ఇందుకు కారణం!
- మందలపర్తి కిషోర్


