గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. మార్కెట్ ప్రారంభమైన గంటలోపే దాదాపు రూ.7 లక్షల కోట్ల సంపద పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో దూసుకెళ్లాయి.
సెన్సెక్స్ ఏకంగా 1,300 పాయింట్లకు పైగా లాభంతో 78,630 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ కూడా 24,350 మార్కును దాటింది. ఉదయం 10:15 గంటల సమయానికి సెన్సెక్స్ 1,400 పాయింట్లు పెరిగి 78,735.79 వద్ద, నిఫ్టీ 431 పాయింట్లు లాభపడి 24,389.55 వద్ద ట్రేడయ్యాయి. దీంతో మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా లాభాల్లో కొనసాగాయి.
భారీ లాభాలకు కారణాలు
ముడి చమురు ధరలు తగ్గడం: ఈ భారీ ర్యాలీకి ప్రధాన కారణాల్లో ఒకటి ముడి చమురు ధరలు తగ్గడం. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గవచ్చనే అంచనాలు మొదలయ్యాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 8.7 శాతం పడిపోయి బ్యారెల్‌కు 94 డాలర్ల సమీపానికి చేరింది. అమెరికా క్రూడ్ ధర కూడా 88 డాలర్ల స్థాయికి దిగివచ్చింది.
భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే.. దేశానికి దిగుమతి ఖర్చు తగ్గుతుంది. రూపాయిపై ఒత్తిడి, ద్రవ్యోల్బణ భయాలు కూడా కొంత తగ్గుతాయి. కంపెనీల ఉత్పత్తి ఖర్చులు తగ్గి వాటి లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కారణాలతో ఇన్వెస్టర్లు భారత మార్కెట్లపై ఆసక్తి చూపిస్తున్నారు.
కొనుగోళ్లు పెంచిన విదేశీ ఇన్వెస్టర్లు: మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత స్టాక్ మార్కెట్లలో మళ్లీ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.7,284 కోట్ల విలువైన భారత షేర్లను కొనుగోలు చేశారు. అక్టోబర్ 28, 2025 తర్వాత ఇదే అత్యధిక రోజువారీ కొనుగోలుగా నిలిచింది.
అంతేకాకుండా.. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. నవంబర్‌లో ఇప్పటివరకు రూ.17,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గతంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దాదాపు రూ.90,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన వీరు ఇప్పుడు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడం మార్కెట్‌కు బలాన్నిస్తోంది.
అమెరికా మార్కెట్ల ర్యాలీతో పెరిగిన జోష్
అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.6 శాతం, డౌ జోన్స్ దాదాపు 3 శాతం, నాస్‌డాక్ 1.4 శాతం పెరిగాయి. అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ అనిశ్చితి తగ్గవచ్చనే అంచనాలు, చమురు ధరల పతనం అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి.
అమెరికాలో రాజకీయ పరిణామాలు ప్రభుత్వ ఖర్చులు, బాండ్ ఈల్డ్స్, డాలర్ విలువపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గి, డాలర్ బలహీనపడితే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు విదేశీ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.


