అమెరికాలో నీలి సునామీ | Donald Trump and Republicans lost the US midterms 2026 | Sakshi
Sakshi News home page

అమెరికాలో నీలి సునామీ

Nov 5 2026 5:05 AM | Updated on Nov 5 2026 5:05 AM

Donald Trump and Republicans lost the US midterms 2026

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు ఘోర పరాభవం 

డెమొక్రాట్లకు పట్టం కట్టిన అమెరికన్‌ ఓటర్లు

హౌస్, సెనేట్‌ రెండింటిలోనూ డెమొక్రాట్లకే ఆధిక్యం. 

38 ఏళ్ల తరువాత టెక్సస్‌లో.. 94 ఏళ్ల తరువాత కాన్సస్‌లో విజయం 

రిపబ్లికన్ల కంచుకోటలకూ బీటలు

వాషింగ్టన్‌: నిలకడలేని మాటలు, పొంతనలేని విధానాలు, కొన్ని దేశాలపై ద్వేషం వంటి అనేకానేక వేషాలేసిన  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఓటర్లు గట్టిగానే బుద్ధి చెప్పారు. అధ్యక్ష ఎన్నికలు కానప్పటికీ నవంబరు మూడున జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డెమొక్రాట్‌ పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించారు. యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌తోపాటు సెనేట్‌లో మెజారిటీని సొంతం చేసుకున్న డెమొక్రాట్లు, రిపబ్లికన్ల కంచుకోటలైన కీలక రాష్ట్రాల గవర్నర్‌ పీఠాలను కైవసం చేసుకుని ‘నీలి సునామీ’సృష్టించారు.

 హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లోని మొత్తం 435 స్థానాలతోపాటు సెనేట్‌లోని 35 ఖాళీలకు నవంబరు మూడున ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మొదలైన పోలింగ్‌ కొంచెం అటు ఇటుగా బుధవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ముగిసింది. కౌంటింగ్‌ కూడా ప్రారంభమైంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. డెమొక్రాట్లు టెక్సస్, నార్త్, సౌత్‌ కరోలీనాలు, ఒహాయో, కాన్సస్, అయోవా, మెయిన్‌ స్థానాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులను ఓడించడం ద్వారా సెనేట్‌లో ఆధిక్యం సంపాదించారు. మరికొన్ని స్థానాల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

 అయితే నికరంగా ఏడు స్థానాల్లో గెలుపు ద్వారా డెమోక్రాట్లు సెనేట్‌లో ఆధిక్యాన్ని ఖరారు చేసుకోవడం గమనార్హం.  కడపటి వార్తలందేసరికి సెనేట్‌లో డెమొక్రాట్లు 54, రిపబ్లికన్లు 44 స్థానాలు గెలుచుకున్నారు. మరోవైపు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లోనూ డెమొక్రాట్లు ఆధిక్యానికి అవసరమైన 218 స్థానాల మార్కును దాటేశారు 435 స్థానాలకు గాను 234స్థానాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు 139 స్థానాలు గెలుచుకున్నట్లుగా తెలుస్తోది. ఇంకో 62 స్థానాల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది. ట్రెండ్‌ ఇదే మాదిరిగా కొనసాగితే డెమొక్రాట్లు ఏకంగా 245 – 260 స్థానాలు గెలవవచ్చునని రాజకీయ విశ్లేషకుల అంచనా.

 కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు 2027 జనవరి 3న ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరిస్తారు. హౌస్, సెనేట్‌లతోపాటు జరిగిన 36 రాష్ట్రాల గవర్నర్‌ ఎన్నికల్లోనూ రిపబ్లికన్లకు ఎదురుదెబ్బే తగిలింది. టెక్సస్‌ నుంచి గినా హినోజోసా ఒహాయో నుంచి ట్రంప్‌ మద్దతుదారు, భారతీయ సంతతికి చెందిన వివేక్‌ రామస్వామిపై ఆమీ యాక్టన్‌ గెలుపొందారు. అలాగే అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి నల్లజాతి గవర్నర్‌గా జార్జియాకు చెందిన కీషా లాన్స్‌ బాటమ్‌ విజయం సాధించారు. అయోవాలో డెమొక్రాట్లకు చెందిన రాబ్‌ శాండ్‌ గెలుపొందారు.  

కంచుకోటలు బద్ధలు... 
రిపబ్లికన్‌ పార్టీ కంచుకోట టెక్సాస్‌ నుంచి 38 ఏళ్ల తరువాత మొదటిసారిగా డెమొక్రాట్‌ అభ్యర్ధి జేమ్స్‌ టలారికో సెనేటర్‌గా గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేసిన కెన్‌ ప్యాక్స్‌టన్‌ ఓటమి పాలయ్యారు. జార్జియా నుంచి మరోసారి జాన్‌ ఓసాఫ్‌ విజయం సాధించారు. 2028 అధ్యక్ష ఎన్నికల్లో జాన్‌ ఒసాఫ్‌ డెమొక్రటిక్‌ పార్టీ తరఫున బరిలోకి దిగుతారని అంచనా. నార్త్‌ కారొలీనాలో రాయ్‌ కూపర్‌ రిపబ్లికన్‌ అభ్యర్థి మైకేల్‌ వాట్లేపై విజయం సాధించారు. 

కాన్సస్‌లో ఆడమ్‌ హామిల్టన్‌ 94 తరువాత ఈ స్థానం నుంచి గెలుపొందిన డెమోక్రాట్‌గా చరిత్ర సృష్టించారు. ఓహాయోలోనూ డెమోక్రాట్ల అభ్యర్థి షెర్రాడ్‌ బ్రౌన్‌ రిపబ్లికన్ల అభ్యర్థి జాన్‌ హస్టెడ్‌పై విజయం సాధించగా... మిషిగన్‌ నుంచి అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ముస్లిం సెనేటర్‌గా డాక్టర్‌ అబ్దుల్‌ ఎల్‌ సయ్యద్‌ ఘన విజయం సాధించారు. డాక్టర్‌ సయ్యద్‌ భార్య కర్ణాటకకు చెందిన భారతీయ సంతతి మహిళ, సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ సారా జుకాకూ కావడం గమనార్హం. 

అయోవాలో రిపబ్లికన్‌ ప్రతినిధి యాష్లే హిన్సన్‌పై డెమొక్రాట్‌ అభ్యర్థి జోష్‌ తురెక్‌ విజయం సాధించారు. న్యూ హాంప్షైర్‌లో రిపబ్లికన్‌ మాజీ సెనేటర్‌ జాన్‌ సునును ఓడించి, డెమొక్రాట్‌ అభ్యర్థి క్రిస్‌ పప్పాస్‌ సెనేట్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. సౌత్‌ కరోలినా డెమొక్రాట్‌ అభ్యర్థి అన్నీ ఆండ్రూస్‌ రిపబ్లికన్‌ అభ్యర్థి డార్లిన్‌ గ్రాహంపై సంచలన విజయం సాధించారు. పెన్సిల్వేనియా, న్యూజెర్సీలలో టామ్‌ కీన్, రియాన్‌ మెకెంజీ, స్కాట్‌ పెర్రీ, రాబ్‌ బ్రెస్నాహాన్‌ వంటి కీలక రిపబ్లికన్‌ ప్రతినిధులు ఓటమిపాలయ్యారు.  

కారణాలు బోలెడు.. 
మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌ వ్యతిరేక పవనాలు వీయడం వెనుక కారణాలు బోలెడు. ఇరాన్‌తో యుద్ధం అనవసరమన్నది మెజార్టీ అమెరికన్ల అభిప్రాయం. నింగినంటిన డీజిల్‌ ధరలు, నిత్యావసర వ్యయం భారం కావడంతో పాటు ట్రంప్‌ అబద్ధాలు, ప్రచారాలపై అమెరికన్లు తీవ్ర అసహనంతో ఉన్నారు. అసోసియేటెడ్‌ ప్రెస్‌ సర్వే ప్రకారం ట్రంప్‌ పనితీరుపై దాదాపు 60 శాతం మంది ఓటర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అధ్యక్షుడి ఆకతాయి నిర్ణయాలకు చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్‌ బలంగా ఉండాలని 70 శాతం ఓటర్లు కోరుకున్నారు. మధ్యంతర ఎన్నికల తీర్పుతో అమెరికాలో ట్రంప్‌ శకం ముగిసినట్లేనని రిపబ్లికన్‌ పార్టీ నేత క్రిస్‌ క్రిస్టీ సైతం వ్యాఖ్యానించరంటే ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకత స్థాయి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు.  

నేను కానీ బరిలోఉండి ఉంటేనా
మధ్యంతర ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలపై అధ్యక్షుడు ట్రంప్‌ తనదైన శైలిలో స్పందించారు. బ్యాలెట్‌పై నా పేరు లేదు కాబట్టి ఈ ఓటమి తనది కాదని బాధ్యతను ఇతరులపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో నేను బరిలో ఉంటే ల్యాండ్‌స్లైడ్‌ విక్టరీ సాధించి ఉండేవాళ్లమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌ టైమ్స్, సీబీఎస్‌ ఛానళ్లతో మాట్లాడుతూ డెమొక్రాట్లను అభినందించారు. దేశ ప్రయోజనాల కోసం వారితో కలిసి పని చేసేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. 

అనంతరం.. ’ట్రూత్‌ సోషల్‌’ లో స్పందిస్తూ...  ‘ఈ ఎన్నికల బ్యాలె ట్‌ పేపర్‌పై నేను లేను! ఒకవేళ నేను బరిలో ఉండి ఉంటే భారీ విజయం సాధించి ఉండేవాళ్లం!‘ అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తన ‘వీటో’అస్త్రంతో చట్టసభల నిర్ణయాలను తోసిపుచ్చుతానని హెచ్చరిస్తూ, ‘వీటో’అని రాసి ఉన్న ఎర్రటి టోపీతో ఉన్న తన ఫోటోను పోస్ట్‌ చేశారు. డెమొక్రాట్లు కూడా తనతో కలిసి పనిచేయాలనే అనుకుంటున్నారని చెప్పిన ట్రంప్‌.. ‘‘లేదంటే అన్నింటినీ వీటో చేసేస్తా. వాళ్లు (డెమొక్రాట్లు) కూడా ఇది కోరుకోవడం లేదు అనుకుంటా’’అని వ్యాఖ్యానించారు.  

ఇప్పుడు ఏమి జరగనుంది?  
ఒక్కమాటలో చెప్పాలంటే ట్రంప్‌ మాటలు ఇక చెల్లవు. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్, సెనేట్‌ రెండింటిలో డెమోక్రాట్ల ఆధిక్యం ఉండటం వల్ల ట్రంప్‌ ప్రతిపాదించే కొత్త బిల్లులు, పన్ను మార్పులు లేదా సంస్కరణలు ఆమోదం పొందే అవకాశాలు తగ్గిపోతాయి. బడ్జెట్‌తోపాటు, బిల్లులు ఆమోదించే అధికారం కూడా డెమొక్రాట్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది కాబట్టి అధ్యక్షుడిగా ట్రంప్‌ సొంత నిర్ణయాలతో ఖర్చు చేయలేరు. అంతేకాదు.. జడ్జిలు, కేబినెట్‌ మంత్రులు, రాయబారుల నియామకాలకు కూడా సెనేట్‌ ఆమోదం తప్పనిసరి. ఫలితంగా ట్రంప్‌ మద్దతుదారులకు గడ్డుకాలం. అ యితే... ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. డెమోక్రాట్లు ఆ మోదించే బిల్లులను అధ్యక్ష హోదాలో ట్రంప్‌ తిరస్కరించే (వీటో) అధికా రం ఉంటుంది. వీటోనూ కూడా కాదని బిల్లు ఆమోదం పొందాలంటే హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్, సెనేట్‌ రెండింటిలో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరమవుతుంది.  

రిపబ్లికన్ల ఓటమికి 5 కారణాలు 
 1.పెరిగిపోయిన జీవన వ్యయం... 
అమెరికన్‌ ఓటర్లు నిత్యావసరాల ధరల పెరుగుదలను ఏమాత్రం సహించరు. ఈ విషయమే మధ్యంతర ఎన్నికల సమయంలోనూ స్పష్టంగా వ్యక్తమైంది. ద్రవ్యోల్బణం కారణంగా తాము బాగా ఇబ్బంది పడుతున్నామని దాదాపు 79 శాతం మంది ఓటర్లు స్పష్టం చేశారు. సెపె్టంబరులో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 3.7 శాతానికి చేరుకుంది. పెట్రోలు ధరలు మునుపెన్నడూ లేనంతగా గ్యాలన్‌కు 6.52 డాలర్లకు చేరుకోవడం... ఇందుకు ట్రంప్‌ విధానాలే కారణమని 60 శాతం మంది ఓటర్లు విశ్వసించడం మరో కారణం. 

2. ఇరాన్‌తో యుద్ధం... 
ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దాడులకు దిగడం ఓటర్లకు ఏమాత్రం రుచించలేదు. యుద్ధాలకు దూరంగా ఉంటానని, అమెరికా ఫస్ట్‌ అని హామీలిచ్చి అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో చాలామంది మద్దతుదారులు ట్రంప్‌కు దూరమయ్యారు. ఇరాన్‌తో యుద్ధం సరైన నిర్ణయం కాదని సుమారు 63 శాతం మంది ఓటర్లు స్పష్టం చేయడం గమనార్హం. 

3. కీలకాంశాలపై డెమొక్రాట్ల దృష్టి... 
ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఆరోగ్యం, అవినీతి, కుటుంబాల ఆర్థిక సమస్యలవంటి అంశాలపై ఒక పద్ధతి ప్రకారం స్పష్టమైన ప్రచారం చేశారు. ఫలితంగా టెక్సస్, కాన్సస్, సౌత్‌ కరోలినా, జార్జియా వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్ల ఆధిపత్యాన్ని సమర్థంగా ఎదుర్కొగలిగారు. విజయం సాధించారు.  

4. ట్రంప్‌ వైఖరి...
ఈ ఎన్నికలను అధ్యక్షుడిగా తన రెఫరెండంగా పరిగణించాలన్న ట్రంప్‌ వ్యాఖ్యలు ఓటర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఆర్థిక సమస్యల గురించి ట్రంప్‌కు ఏమాత్రం పట్టనట్టుగా ఉందని భావించారు. ప్రచారం సమయంలోనూ ట్రంప్‌ తన బాధలే చెప్పుకుంటున్నట్టుగా ఓటర్లు భావించారు.  
 
5. డెమొక్రాట్లకు మళ్లీ బ్లాక్స్‌ మద్దతు.. 
2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు ఆధిక్యం సాధించడం వెనుక హిస్పానిక్, బ్లాక్స్‌ పాత్ర సుస్పష్టం. కానీ మధ్యంతర ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. హిస్పానిక్స్‌ ఎక్కువగా ఉన్న కౌంటీల్లో దాదాపు 22 శాతం మంది డెమోక్రాట్లకు మద్దతుగా నిలిచినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇమ్మిగ్రేషన్, పౌర హక్కుల విషయంలో ప్రభుత్వం వైఖరి, ఆర్థిక ఇబ్బందులు హిస్పానిక్స్‌తోపాటు బ్లాక్స్‌ను కూడా మళ్లీ డెమోక్రాట్లకు ఓటేసేలా చేసిందని అంచనా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement