‘మధ్యంతర’ భంగపాటు! | A message to President Donald Trump with an open voice from America | Sakshi
Sakshi News home page

‘మధ్యంతర’ భంగపాటు!

Nov 5 2026 12:58 AM | Updated on Nov 5 2026 12:58 AM

A message to President Donald Trump with an open voice from America

తానెంచుకున్న ప్రజాస్వామ్య పథంనుంచి పక్కకు జరిగేది లేదని, నియంత పోకడలకు ఇక్కడ తావు లేదని అమెరికా ముక్తకంఠంతో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు సందేశంపంపింది. ఏ మధ్యంతరమైనా అధ్యక్షుడికి చేదు అనుభవాన్నే మిగులుస్తుంది. కానీ ఈసారి ఉత్తర, దక్షిణాలూ... తూర్పు, పడమరలనే తేడా లేదు. అన్నిచోట్లా రిపబ్లికన్లకు ఎదురు గాలే. చాన్నాళ్ల తర్వాత సెనేట్, ప్రతినిధుల సభలు రెండూ డెమాక్రాట్ల ఆధిపత్యంలోకి వచ్చేశాయి. ఈ భంగపాటు గురించి సర్వేలు నాలుగైదు నెలలుగా జోస్యం చెబుతూనే ఉన్నాయి. కానీ ఈ స్థాయిలో రిపబ్లికన్‌లు తుడిచిపెట్టుకుపోతారని ఎవరూ ఊహించలేకపోయారు. 

ఎప్పుడూ ఆ పార్టీకే ఆధిక్యత ఉండే కాన్సాస్, అయోవా, టెక్సాస్, ఒహాయో, మెయిన్, నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినా సెనేట్‌ స్థానాలు డెమోక్రాట్ల ఒళ్లో వాలాయి. కాన్సాస్‌లో 1932 తర్వాత ఒక డెమాక్రాట్‌ సెనేట్‌ స్థానాన్ని గెల్చుకోవటం ఇదే తొలిసారి. సౌత్‌ కరోలినా వందేళ్ల చరిత్రలో తొలిసారి ఆ పార్టీ సెనేట్‌ స్థానాన్నిదక్కించుకుంది. టెక్సాస్‌ సెనెటర్‌గా డెమాక్రాట్‌ గెలవటం 38 ఏళ్లలో ఇది తొలిసారి. జార్జియా, మిషిగన్‌లలో సైతం ఈసారి డెమోక్రాట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడి గెల్చుకున్నారు. నాలుగు స్థానాలున్న అయోవాలో మూడు ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. టెక్సాస్‌లో సెనేట్‌ స్థానంతోపాటు ప్రతినిధుల సభ స్థానం కూడా డెమాక్రాట్ల కైవస మయ్యాయి. రిపబ్లికన్లకు పట్టుండే మిషిగన్‌లో తొలిసారి అబ్దుల్‌ సయీద్‌ అనే ముస్లిం విజయం సాధించటమైనా... మిన్నెసోటాలో మొట్టమొదటిసారి మూలవాసీ పెగ్గీ ఫానగాన్‌ అనే అమెరికన్‌ మహిళ సెనెటర్‌ కావటమైనా అసాధారణం.

మధ్యంతర పోరులో ట్రంప్‌కు భంగపాటు కలగటం ఇది రెండోసారి. తొలి ఏలుబడిలో 2018 ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. కానీ అప్పట్లో ప్రతినిధుల సభలో ఎదురుదెబ్బ తగిలినా, సెనేట్‌లో రిపబ్లికన్లు ఆధిక్యత సాధించారు. ఇప్పుడు రెండుచోట్లా దీనావస్థలో పడ్డారు. ఇదంతా స్వయంకృతం. ఆయన సైనిక దుస్సాహసాలు అమెరికాను కుంగదీశాయి. ఇరాన్‌ యుద్ధంతో ఇంధనం రేట్లు ఆకాశాన్నంటాయి. నిత్యావసరాల ధరలూ అంతే. వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యనూ కిడ్నాప్‌ చేయించారు. వారిపై బూటకపు కేసులు పెట్టి విచారణ తతంగాన్ని నడుపుతున్నారు. అక్కడి ముడిచమురును ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. రాష్ట్రాల హక్కుల్ని హరించటం, పౌరస్వేచ్ఛకు ప్రతిబంధకాలు కల్పించటం, జాతి విద్వేషాలు రెచ్చగొట్టడం మెజారిటీ అమెరికన్లు మెచ్చలేదు. ప్రపంచ దేశాల్ని సుంకాలతో బెదిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం పౌరులకు మింగుడుపడలేదు. అధ్యక్షుడిగా తనకు పరిమితులుంటాయన్న స్పృహ ఆయనకు ఏనాడూ లేదు.

అధ్యక్ష పీఠాన్ని అధిరోహించినవారు పాత యూరోపియన్‌ పాలకుల మాదిరినియంతలు కారాదన్న సంకల్పంతో అమెరికన్‌ ప్రజాస్వామ్య నిర్మాతలు తగిన నిరోధక వ్యవస్థల్ని ఏర్పాటుచేశారు. అయితే ట్రంప్‌ వచ్చాక అవన్నీ చతికిలబడినట్టు కనబడేసరికి అందరూ భయపడ్డారు. కానీ సరైన సమయంలో అవి శక్తిమంతంగా పనిచేశాయి. ‘వాటర్‌గేట్‌’ కుంభకోణం అప్పట్లో ఆగ్రహావేశాలు రగిల్చిన స్థాయిలోనే ట్రంప్‌ కుటుంబ అవినీతి పోకడలు కూడా పౌరుల్లో ఏవగింపు తీసుకొచ్చాయి. టెక్సాస్‌నుంచి ఒహాయో వరకూ... మెయిన్‌ నుంచి సౌత్‌ కరోలినా వరకూ ఓటర్లు తమ తీర్పు ద్వారా విస్పష్టంగా ట్రంప్‌ను శిక్షించారు.

కానీ వెంటనే అమెరికాలో మారేదేమీ ఉండదు. అర్థరహిత యుద్ధాలను కొనసాగించ టానికి, ఎప్పటిలాగే అయోమయ విదేశాంగ విధానాన్ని పాటించటానికి ఆయనకుఅడ్డంకులుండవు. ఆంతరంగిక వ్యవహారాలవరకూ ఆయన ఈ రెండేళ్లూ లేమ్‌ డక్‌ (శక్తిరహిత) అధ్యక్షుడిగా మిగిలిపోతారు. వైట్‌హౌస్‌పై ఉభయ సభలూ గట్టి నిఘా వేస్తాయి. ‘అభిశంసన’ భూతం ఆయన్ను వెంటాడుతుంది. అయితే ఈ గెలుపు బలుపు అనుకుంటే డెమాక్రాట్లు దెబ్బతింటారు. ఎన్నికల సరళి చూస్తే ఇప్పటికీ గ్రామాల్లోనూ,ఓ మాదిరి పట్టణాల్లోనూ ట్రంప్‌ హవా తగ్గలేదు. చిన్నా చితకా పనులు చేసుకునేవారూ, కార్మికులూ ఇంకా ఆయన వెన్నంటే ఉన్నారు. డెమాక్రాట్లు ఈ వర్గాల ఆదరాభిమానాల్ని పొందటానికి వచ్చే రెండేళ్లూ కృషి చేయకపోతే ఈ గెలుపు కెరటం నిలబడదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement