వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ
చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోతున్నాయి
ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత..
ప్రతి ఇంట్లో ఇదే చర్చ.. ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకుని వారి తరఫున పోరాడుతున్నాం
జగన్ ఉంటే.. ఎంతో మేలు జరిగేదని ప్రజలు ఆలోచిస్తున్నారు
ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ
ఏడాదిన్నర పాటు ఇలా గట్టిగా యుద్ధం చేద్దాం
ఈ దుర్మార్గ ప్రభుత్వ ఆగడాలను ఎండగడదాం
ఇదే పోరాట స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం
చూస్తుండగానే దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో మూడో బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంటే ఈ ప్రభుత్వానికి మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. మిగిలింది మూడేళ్లు మాత్రమే. ఇకపై వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని పార్టీ కేడర్‌తో సమావేశం అవుతాను. ఇదే క్రమంలో ప్రజల తరఫున గట్టిగా యుద్ధం చేద్దాం. ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలు పెడతాను. అలా దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజల్లోనే ఉంటాను. ఈ దుర్మార్గ పాలనను, శిశుపాలుడిని తెర మరుగు చేసే రోజు దగ్గర్లోనే ఉంది.
జగన్ ఉన్నప్పుడే బాగుండేది.. ఆయన ప్రతి నెలా బటన్ నొక్కేవాడు.. చెప్పింది చేసే వాడు.. మాట నిలబెట్టుకునేవాడు.. అన్నీ ఇచ్చేవాడు.. అని ప్రజలంతా, ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు. అదే చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్ కూడా లేకుండా చేశారని అంతా బాధ పడుతున్నారు. మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది చేసి చూపాం. మాట నిలబెట్టుకున్నాం. ఇదే విషయంపై ఈ రోజు ప్రజల్లో, ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత ప్రజలు అన్ని వాస్తవాలు గమనించారు.
-వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి.. ఇలాగే మరో మూడేళ్లు అయిపోతాయి.. ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున జెండా పట్టుకుని పోరాడుతున్నాం.. ఇంకో ఏడాదిన్నర గట్టిగా యుద్ధం చేస్తే నా పాదయాత్ర మొదలవుతుంది.. అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను. శిశుపాలుడు తెరమరుగయ్యే రోజు దగ్గర్లోనే ఉంది’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతానని, ఇదే పోరాట స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
బుధవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలను శ్రేణులకు వివరించారు. ‘నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో గతంలో సమావేశమయ్యాం. మళ్లీ ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెడుతున్నాం. ఇకపై వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశం అవుతాం. చూస్తుండగానే దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంటే ఈ ప్రభుత్వానికి మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. అలాగే మిగిలింది మూడేళ్లు మాత్రమే. ఇక నుంచి ప్రతి వారం కార్యకర్తలతో భేటీలు.. ప్రజల తరఫున పోరాటాలు.. ఇలా ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది’ అని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. 
ప్రతి ఇంట్లోనూ అదే చర్చ
రాష్ట్రంలో ఈ రోజు పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండ కావరంతో వ్యవహరిస్తున్నారు. పాలనంతా అబద్ధాలు, మోసాలు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది.. ఆయన ప్రతి నెలా బటన్ నొక్కేవాడు.. చెప్పింది చేసే వాడు.. మాట నిలబెట్టుకునేవాడు.. అన్నీ ఇచ్చేవాడు.. అని ప్రజలంతా, ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు. అదే చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్ కూడా లేకుండా చేశారని అంతా బాధ పడుతున్నారు. మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్. అన్ని కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం. మాట నిలబెట్టుకున్నాం. ఇదే విషయంపై ఈ రోజు ప్రజల్లో, ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.
మోసం.. దగా.. అదే బాబు పాలన
మనం ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత, ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ప్రపంచంలోనే ఉండరని అందరూ గ్రహించారు. ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు. అన్నీ మోసాలే. ఏదీ అమలు కాలేదు. మరో వైపు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. గవర్నమెంటు స్కూళ్లు పూర్తిగా కళ తప్పాయి. మన హయాంలో గవర్నమెంటు స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడే స్థితి ఉంటే.. ఇప్పుడు అంతా రివర్స్ అయింది. నాడు–నేడు మనబడి లేదు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు లేవు. పిల్లలకు టోఫెల్ క్లాస్‌లు లేవు. గోరుముద్ద కూడా క్వాలిటీ లేకుండా పోయింది. పిల్లల ప్రాణాలు పోతున్నాయి. నాడు గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేల నుంచి కూడా రికమెండేషన్లు ఉండేవి. ఆ స్థాయిలో గవర్నమెంటు స్కూళ్లకు డిమాండ్ ఉండేది. అదే ఇప్పుడు దాదాపు 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంటు స్కూళ్ల నుంచి చదువు మానేశారు. నాడు మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్లలో దాదాపు 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈ రోజు కేవలం 33 లక్షల మంది మాత్రమే చదువుతున్నారు.
వ్యవస్థలు నిర్వీర్యం.. అన్నీ బకాయిలే
⇒ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏకంగా ఎనిమిది క్వార్టర్లు పెండింగ్. ఒక త్రైమాసికం అయిపోగానే, దానికి సంబంధించిన డబ్బులు జమ చేసే వాళ్లం. 2024 ఎన్నికలకు ముందు జనవరి నుంచి మార్చి వరకు ఇవ్వాల్సిన త్రైమాసిక చెల్లింపు, ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో, అప్పటి నుంచి ఫీజుల చెల్లింపు లేకుండా పోయింది. ఒక్కో క్వార్టర్‌కు రూ.700 కోట్లు. అలా ఎనిమిది క్వార్టర్లకు సంబంధించి రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.700 కోట్లు ఇచ్చారు. అలా రూ.4,900 కోట్లు బకాయి పడ్డారు. వసతి దీవెన కింద మనం పిల్లలకు కోర్సును బట్టి ఏటా రూ.20 వేల వరకు ఇచ్చే వాళ్లం. అలా ప్రతి ఏప్రిల్‌లో రూ.1,100 కోట్లు ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం రెండేళ్ల నుంచి ఇవ్వక రూ.2,200 కోట్లు బకాయి పడింది. అలా చదువుల రంగం పూర్తిగా నాశనం అయింది. ఇక్కడ చదవాలంటే పిల్లలు భయపడుతున్నారు.
⇒ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేశారు. నెలకు రూ.300 కోట్లు దానికి కావాలి. మన హయాంలో 3,300 ప్రొసీజర్లకు విస్తరించి, రూ.25 లక్షల వ్యయం వరకు ఉచిత వైద్యం అందించాం. దాదాపు 20 నెలల నుంచి నెలకు రూ.300 కోట్ల చొప్పున దాదాపు రూ.6 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. రూ.4 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. 108, 104 సర్వీసులు నిర్వీర్యం చేశారు. కోవిడ్ టైమ్‌లో కూడా అన్ని సదుపాయాలతో మనం కొత్త వాహనాలు ప్రవేశ పెడితే.. ఇవాళ వాటిని పడకేయించారు. ఇప్పుడు టీడీపీ డాక్టర్ల వింగ్‌కు చెందిన వారికి ఆ సర్వీసులు అప్పగించారు. ఇప్పుడు ఆ సర్వీసుల కోసం ఫోన్ చేస్తే, రెండు మూడు గంటలైనా రావడం లేదని ప్రజలు వాపోతున్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్
మన ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. పూర్తయిన 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం అచ్చంగా ప్రైవేటీకరిస్తోంది. అంతే కాకుండా ఆ మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. ఒక మెడికల్ కాలేజీలో జీతాలకు ఏటా రూ.60 కోట్లు కావాలి. అలా రెండేళ్లకు రూ.120 కోట్లు ఖర్చవుతాయి. అంటే కాలేజీ ప్రభుత్వానిది. అలాగే ప్రభుత్వ స్టాఫ్. నిర్వహణ ఖర్చు కూడా ప్రభుత్వానిదే. కానీ, లాభాలు మాత్రం ప్రైవేటువారికి. ఇలాంటి స్కామ్‌కు పాల్పడిన వారిపై మేము రాగానే రెండు నెలల్లోనే చర్య తీసుకుంటామనగానే.. ఆ కాలేజీలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
నాలుగు రంగాలు నాశనం
వ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేశారు. చివరకు ఎరువులు కూడా బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. నాడు గ్రామాల్లో ప్రతి అడుగులో రైతుల చేయి పట్టుకుని నడిపించిన ఆర్బీకేలు ఇప్పుడు పని చేయడం లేదు. ఉచిత పంటల బీమా లేదు. సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. పంటలకు మద్దతు ధర లేదు. చివరకు రైతు భరోసాలో కూడా మోసం. రూ.40 వేలకు బదులు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. అత్యంత కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నాశనం అయ్యాయి. తాజాగా నాలుగో వ్యవస్థ శాంతి భద్రతలు. దాన్నీ నాశనం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. ఎక్కడా పోలీసింగ్ వ్యవస్థ కనిపించడం లేదు. ఇంకా మొత్తం ప్రైవేటీకరణ.. అలాగైతే చివరకు సీఎం పదవిని కూడా ప్రైవేటుకు ఇవ్వొచ్చు కదా?
జనంతో వైఎస్సార్‌సీపీ మమేకం
‘అన్నింటా విఫలమైన ప్రభుత్వం.. ప్రశ్నించే గొంతును నొక్కుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కేసులతో వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రజలకు తోడుగా నిలబడుతోంది. విద్యార్థులు, యువత, రైతులు, అక్క చెల్లెమ్మలు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా, వారందరి తరఫున జెండా పట్టుకుని నిలబడుతున్నాం. గట్టిగా పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగాలి. ఆ దిశలో మీరంతా కలిసికట్టుగా పని చేయాలి. ఏలూరులో మన పార్టీ నాయకుడు జేపీ (జయప్రకాష్)కి మీ అందరి సహకారం కావాలి. మీరంతా ఆయనకు తోడు కావాలి’ అని జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త జయప్రకాష్, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కారుమూరి సునీల్‌తో పాటు, దాదాపు 200 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


