బీసీ గురుకులాల్లో కొను‘గోల్‌మాల్’
గ్యాస్ స్టవ్ నుంచి ఎలక్ట్రిక్ కాటా వరకు అన్నింటికీ అధిక ధరలే
ఒక్కో గురుకులంలో 11 రకాల సామగ్రికి రూ.86,686లు చొప్పున చెల్లింపు
ఇలా 105 గురుకులాలకు రూ.91,02,030
అధిక ధరలు చెల్లింపు ద్వారా ప్రజాధనం లూటీ
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమ శాఖలో అడ్డగోలుగా దోపిడీ జరుగుతోంది. గురుకులాలకు సరఫరా చేసిన వంట సామగ్రిలో ఇష్టారాజ్యంగా కాసులు దండుకుంటున్నారు. రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) చెందిన 105 గురుకులాలకు ప్రభుత్వం వంట సామగ్రి అందించింది. ప్రతి గురుకులానికి స్టౌవ్‌తోపాటు మరో పది రకాల సామగ్రిని సరఫరా చేశారు. రాజకీయ జోక్యంతో జిల్లాల వారీగా వాటిని సరఫరా చేసే బాధ్యతను స్థానికులకు కట్టబెట్టారు. దీంతో బయట మార్కెట్‌లో అతి తక్కువ ధరకు దొరికే వాటికి అధిక ధర చెల్లించడంతో పెద్దఎత్తున ప్రజాధనం లూటీఅయ్యింది.
ఉదా.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన ఏజెన్సీ గురుకులాలకు సరఫరా చేసిన 11 రకాల సామగ్రిని చెల్లించిన ధరలు చూస్తే విస్తుపోవాల్సిందే. గ్యాస్ స్టవ్ డబుల్ బర్నర్ కమర్షియల్ ధర రూ.26,298.38 అని నిర్ణయించి దానికి ఐదు శాతం స్టేట్ జీఎస్టీ, మరో ఐదు శాతం సెంట్రల్ జీఎస్టీ కలుపుకుని మొత్తం రూ.31,032.09 వసూలు చేశారు. నిజానికి మార్కెట్లో దీని ధర రూ.9 వేల లోపే ఉంటుందని చెబుతున్నారు.
వంద కిలోల ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ ధర రూ.14,078 అని చెప్పి దానికి జీఎస్టీ కలుపుకుని రూ.16,612.49 వసూలుచేశారు. ఇలా ఇష్టానుసారం ధరలు నిర్ణయించి ఒక్కో గురుకులానికి మొత్తం రూ.86,686 చొప్పున లాగేశారు. ఇలా రాష్ట్రంలో 105 గురుకులాలకు కలిపి మొత్తంగా రూ.91,02,030 నిధులు ఖర్చుచేశారు. మార్కెట్ ధరకు మించి అయినవారికి అప్పనంగా ప్రజాధనం దోచిపెట్టడం వెనుక ఎవరి వాటా ఎంత అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గురుకులాలకు సరఫరా చేసిన సామగ్రికి చెల్లించిన ధరలు.. (జీఎస్టీతో కలిపి)
⇒ గ్యాస్ స్టవ్ డబుల్ బర్నర్ కమర్షియల్ రూ.31,032.09
⇒ వంద కిలోల ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ రూ.16,612.49
⇒ మిక్సర్ గ్రైండర్ (750 వాట్స్) 3 జార్‌లు రూ.9,313.95
⇒ఐదు కిలోల వెయింగ్ మెషిన్ రూ.7,738.89
⇒ హెవీ డ్యూటీ చిన్నసైజు రైస్ స్ట్రైనర్ రూ.6,096.70
⇒ హెవీ డ్యూటీ ఐరెన్ కడాయి రూ.5,109.70
⇒ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ 10 లీటర్లు రూ.4,882.69
⇒ అల్యూమినియం కుక్కర్ 5 లీటర్లు రూ.3,777.25
⇒ 1.5 లీటర్ల జగ్ రూ.608.98
⇒ ఐరన్ కురుపి 30 అంగుళాలు రూ.961.68
⇒ 13 అంగుళాల ఎత్తున్న జీఐ బక్కెట్ రూ.551.27


