కండలేరు సందర్శనపైనా ఆంక్షల సంకెళ్లు | Kakani Govardhan Reddy Serious On Chanadrababu govt | Sakshi
Sakshi News home page

కండలేరు సందర్శనపైనా ఆంక్షల సంకెళ్లు

Jan 12 2026 4:33 AM | Updated on Jan 12 2026 4:33 AM

Kakani Govardhan Reddy Serious On Chanadrababu govt

రిజర్వాయర్‌ ఆర్చి వద్ద బైఠాయించిన కాకాణి గోవర్థన్‌రెడ్డి. పక్కన కిలివేటి, నేదురుమల్లి, విజయకుమార్‌రెడ్డి తదితరులు

అనుమతివ్వని పోలీసులు.. అడుగడుగునా నేతలకు అడ్డంకులు 

కండలేరు ముఖద్వారం వద్దే నిలిపివేత 

అక్కడే బైఠాయించిన కాకాణి, ఆనం, నేదురుమల్లి, కిలివేటి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/రాపూరు–సైదాపురం: శ్రీ­పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలం కండలేరు జలాశయం సందర్శనకు ఆదివా­రం బయల్దేరిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను పోలీసులు అడుగడుగునా ఆంక్షలతో అడ్డుకున్నారు. సోమశిల జలాశయ సందర్శనపై శనివారం ఉక్కుపాదం మోపినట్లుగానే తాజాగా కండలేరు సందర్శననూ పోలీసులు నిలువరించారు. నెల్లూరు జిల్లా ప్రజలు, రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్య­మంత్రి చంద్రబాబు నిలిపేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో పలువురు నేతలు కండలేరు ప్రాజెక్టుకు ఆదివారం బయల్దేరారు.

ఆయనతో పాటు పార్టీ నెల్లూ­రు రూరల్, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యను కండలేరు ముఖద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. మార్గంమధ్యలో నెల్లూ­రు, పొదలకూరు, డేగపూడి, కండలేరు డ్యామ్‌ మె­యి­న్‌ రోడ్డు వద్ద బారికేడ్లను అడ్డుపెట్టి నిలువరించారు. రాపూ­రు, సైదాపురం, వెంకటగిరి, కలువాయి, పొదలకూరు, చేజర్ల మండలాలకు చెందిన రైతుల్ని కండలేరు వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయితే, ఎలాగోలా రైతులు పెద్ద సంఖ్యలో కండలేరు ముఖద్వారం వద్దకు చేరుకుని నేతలకు మద్దతు ప్రకటించారు. జై జగన్‌ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.   

అడ్డుకున్న డీఎస్పీ .. నేతలు బైఠాయింపు.. 
కండలేరు ముఖద్వారం వద్దకు చేరుకున్న కాకాణి, ఆనం, నేదురుమల్లి, కిలివేటిని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్‌ అక్కడే నిలిపేశారు. ఐదుగుర్ని మాత్రమే జలాశయ సందర్శనకు అనుమతిస్తామని తేల్చిచెప్పారు. దీంతో తమను ఎందుకు పంపరని పోలీసులను ప్రశి్నస్తూ ముఖద్వారం వద్ద కాకాణి, ఆనం, నేదురుమల్లి, కిలివేటి బైఠాయించారు. పోలీసులు సైతం ముఖద్వారం వద్ద భారీగా మోహరించారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్‌ పర్యవేక్షణలో ఆరుగురు సీఐలు, ఎస్సైలు, అదనపు బలగాలతో నేతలను నియంత్రించారు. ప్రాజెక్టు సందర్శనకు 50 మందికి అనుమతివ్వాలని కాకాణి డిమాండ్‌ చేశారు. పోలీస్‌ అధికారులు ససేమిరా అనడంతో నాలుగు గంటల పాటు ముఖద్వారం వద్దే నేతలు బైఠాయించారు.    

బలవంతంగా నేతల అరెస్టు.. 
తుపాను ప్రభావంతో వర్షం కురుస్తున్నా వైఎస్సార్‌సీపీ నేతలు ఏ మాత్రం తగ్గకుండా అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగించారు. సుమారు నాలుగు గంటలపాటు బైఠాయించిన నాయకులు ఎంతసేపైనా అక్కడే ఉంటామని వెల్లడించడంతో రైతులు వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని షామియానాలను తీసుకొచ్చారు. అయితే, వీటిని తొలగించేందుకు పోలీసులు యత్నించడంతో తోపులాట జరిగింది. సా.3.45 గంటల సమయంలో పోలీసులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కాకాణి, ఆనం, నేదురుమల్లి, కిలివేటిని అరెస్టుచేసి రాపూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో కాకాణి, కిలివేటిని లాక్కెళ్లేందుకు పోలీసులు యత్నించడంతో కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేయగా తోపులాట జరిగింది. ఆ తర్వాత నేతలను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

బాబు అర్ధంతరంగా ప్రాజెక్టును ఆపేశారు.. 
ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమతో పాటు నెల్లూరు ప్రాంత రైతులకు ఎలాంటి కష్టాలు రాకూడదని, మెట్ట ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరుకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి పనులు ప్రారంభించారని చెప్పారు.

పనులు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టును అర్ధంతరంగా నిలిపివేశారని మండిపడ్డారు.  అరెస్టులకు భయపడేదిలేదని, చావుకైనా సిద్ధపడే వచ్చామని ఆయన స్పష్టంచేశారు. ఎవరైతే దీనిపై గళం విప్పుతారో వారిని అరెస్టుచేస్తున్నారని.. రైతు ద్రోహిగా ముద్రపడుతుందనే భయంతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. ఇక రేవంత్‌రెడ్డి, చంద్రబాబు మధ్య జరిగిన చీకటి ఒప్పందాలను ప్రజలకు తెలియజేసేందుకే జలాశయ సందర్శనకు వచ్చామని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement