సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ సెక్యూరిటీ గార్డు డాక్టర్ అవతారం ఎత్తాడు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డే డాక్టర్‌గా వైద్యం చేయడంతో రోగులు, వారి కుటుంబసభ్యులు విస్తుపోతున్నారు. పోస్ట్ మార్టం చేసిన మృతదేహాలకు కుట్లు వేయడంతో పాటు గాయాలతో వచ్చిన రోగులకు సెక్యూరిటీ గార్డ్ చికిత్స చేస్తున్నాడు. గేటు బయట కాపలాగా ఉండాల్సిన గార్డ్ వైద్యం చేయడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గేటు బయట కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డుతో రోగులకు వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఈ సీహెచ్‌సీలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు గర్భిణి ప్రాణాలు పోయాయంటూ బాధితులు ఆందోళన చేశారు. దీనిపై విచారణ జరిపి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సరెండర్ చేసినా... ఆస్పత్రి వర్గాల్లో ఏ మార్పూ కనిపించడం లేదు. వైద్యులు కబుర్లతో కాలక్షేపం చేస్తుంటే... కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డు వైద్య సేవలు అందిస్తున్నాడు.
అంతేకాకుండా వైద్యులు, శిక్షణ పొందిన తోటీలు చేయాల్సిన పోస్టుమార్టం ప్రక్రియను కూడా ఆ సెక్యూరిటీ గార్డుతోనే చేయిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలతో వస్తే వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డే వైద్యసేవలు అందిస్తున్నారు. గాయాలకు కుట్లు వేయడం వంటివి చేస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వేలాది మంది రోగులకు వైద్యసేవలు అందించాల్సిన ఆస్పత్రిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ వైద్యసేవలకు ఈ ఆస్పత్రి ఒక నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియను ‘సాక్షి’ వివరణ కోరగా... తమ ఆస్పత్రిలో తోటీలు లేనందున సెక్యూరిటీ గార్డుతో పోస్టుమార్టం విధులు చేయిస్తున్నట్లు తెలిపారు.


