మొత్తం బాధితుల్లో 30% ఇలాంటి వారే
ఊబకాయం ఇందుకు ప్రధాన కారణం
బరువులో 5-10% తగ్గినా ఎంతో ఉపయోగం
జీవనశైలి మార్పులతో టైప్-2 మధుమేహం నియంత్రణ
రోజువారీ వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి
ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా కామినేని వైద్యుల సూచన
హైదరాబాద్: ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా ప్రస్తుతం మన సమాజంలో మధుమేహం తీరుతెన్నులు, దానివల్ల వచ్చే సమస్యలు, పరిష్కార మార్గాల గురించి నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఎండోక్రెనాలజిస్ట్ డాక్టర్ బి.శ్రావ్య, కన్సల్టెంట్, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని వివరించారు. కొన్ని దశాబ్దాల క్రితం కనీసం 40-50 ఏళ్లు దాటినవారే మధుమేహం బారిన పడినట్లు గుర్తించేవారు. ఇప్పుడు ఇంకా బాగా చిన్నవయసులోనే, అంటే 15-20 ఏళ్ల వయసులోనే ఈ సమస్య కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం జీవనశైలి మార్పులు. తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. వీటన్నింటివల్ల అధిక బరువు, ఊబకాయం, దాంతోపాటే మధుమేహం కూడా వస్తున్నాయి.

‘‘సాధారణంగా మధుమేహం అనేది రెండు రకాలు. మొదటిది టైప్-1. అంటే.. శరీరంలో ఏవో తెలియని మార్పుల వల్ల పాంక్రియాస్ ప్రభావితమై, తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాక మధుమేహం వస్తుంది. వాళ్లకు జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. కానీ రెండోది టైప్-2. ఇది ప్రధానంగా జీవనశైలి మార్పుల వల్ల వచ్చేది. మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారానే దాన్ని నియంత్రించుకోవచ్చు. గతంతో పోలిస్తే చాలా చిన్నవయసులోనే ఎక్కువమంది మధుమేహం బారిన పడుతున్నారు. మా ఆస్పత్రికి రోజూ ఔట్పేషెంట్ విభాగంలో 20-30 మంది మధుమేహ బాధితులు వస్తుంటే, వారిలో దాదాపు 30% మంది చిన్నవయసువారే ఉంటున్నారు. కొందరికి 20లు, 30లలోను ఇంకా కొందరికి 10-15 ఏళ్ల వయసులో కూడా వస్తోంది. ప్రధానంగా ఇలా చిన్నవయసులో వచ్చేవారిలో ఎక్కువమందికి ఊబకాయం ఉంటోంది. జీవనశైలి మార్పుల వల్ల బరువు పెరిగిపోతున్నారు. చిన్న పిల్లలకు కూడా ఊబకాయం కనిపిస్తోంది. అలాగే మొత్తమ్మీద మధుమేహం ఉన్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది.
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా వాసుల్లో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల 30ల నుంచి కూడా ఎప్పటికప్పుడు మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే గర్భంతో ఉన్నప్పుడు కూడా మధ్యమధ్యలో మధుమేహం వచ్చిందేమో పరీక్షించుకోవాలి. ఊబకాయం, అధిక బరువు ఉన్నవాళ్లు కూడా తరచు చేయించుకోవాలి. రక్తపోటు, కొలెస్టరాల్ ఉన్నవాళ్లు అయితే దాదాపు ప్రతియేటా పరీక్షలు చేయించుకోవాలి.
గతంలో కేవలం గ్లూకోజ్ నియంత్రిస్తే సరిపోతుంది అనుకునేవారు. తర్వాత గత పదేళ్ల నుంచి మధుమేహం ఉన్నవారికి కీలక అవయవాలు అంటే గుండె, కిడ్నీలు, కళ్లు, కాళ్లు.. ఇలా అన్నింటినీ కాపాడాలని గుర్తించారు. అదే ఇప్పుడైతే బరువు విషయాన్ని కూడా చూస్తున్నారు. మధుమేహాన్ని నియంత్రించే మందులతోనే బరువు కూడా తగ్గే అవకాశం ఇప్పుడు ఉంటోంది’’ అని డాక్టర్ బి.శ్రావ్య తెలిపారు.

బరువును అదుపులో పెట్టాలి
కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని మాట్లాడుతూ, ‘‘మధుమేహం వచ్చినవారు తప్పనిసరిగా తమ శరీర బరువును వీలైనంత వరకు అదుపులో పెట్టుకోవాలి. 5-10% బరువు తగ్గినా కూడా అది మధుమేహ నియంత్రణకు బాగా ఉపయోగ పడుతుంది. అలాగే నడక లాంటి వ్యాయామాలు ప్రతిరోజూ తప్పక ఉండాలి. దాంతోపాటు వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. వీటన్నింటిద్వారా మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపొచ్చు. క్రమశిక్షణతో కూడిన జీవితం ద్వారానే మనం మధుమేహాన్నిఅదుపుచేయగలం. మధుమేహ పరీక్షలంటే కేవలం ఏదైనా తినడానికి ముందు, తిన్న తర్వాత చేయించుకునే రెండు రక్తపరీక్షలే కాదు. హెచ్బీఏ1సీ పరీక్ష కూడా చేయించుకోవాలి. దానివల్ల గత కొంతకాలంగా మధుమేహం స్థాయి ఎలా ఉందో అర్థమవుతుంది. దాన్ని బట్టే కచ్చితమైన డయాగ్నసిస్ ఉండి మందులు ఎలాంటివి వాడాలో సూచించగలం’’ అని చెప్పారు.


