సాక్షి, తాడేపల్లి: పీపీపీ అని పబ్లిక్‌ను తీసుకెళ్లి ప్రైవేట్ చేతిలో పెడుతున్నారని.. వీటన్నింటిపైనా అసెంబ్లీలో చర్చ జరగాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షంలేని చర్చ ఎవరి కోసం?. అసెంబ్లీలో ప్రతిపక్షానికి అవకాశం, సమయం కేటాయించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని డిమాండ్ చేస్తున్నామని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ప్రజల తరుఫున పోరాడతాం: కల్పలతా రెడ్డి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని.. వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. డీఎస్సీలో నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయి. దీంతో మెరిట్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.
‘‘రైతులకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రంలో వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితిపై పక్క రాష్ట్ర సీఎం కూడా మాట్లాడే దుస్థితి వచ్చింది. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిగా లేరు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరుఫున గట్టిగా పోరాడతాం. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం’’ అని కల్పలతారెడ్డి పేర్కొన్నారు.


