హ్యూమరమరాలు
భూలోకాన్ని స్పీడ్‌గా ఆక్రమించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చాలా ఆలస్యంగా యమలోకానికి చేరింది. ‘యమలోకం ఇప్పుడు ఏఐ మయం’ అనే భారీ హెడ్‌లైన్‌తో నరకలోక పత్రిక ‘హెల్ పోస్ట్’ మొదటి పేజీలో పెద్దవార్త ప్రచురితమైంది.
యమలోకంలో ఏఐ టెక్నాలజీ ప్రారంభమైన తొలి రోజు: ‘పాపిని ప్రవేశ పెట్టండి’ అని అరిచారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు. బోన్‌లోకి ఒక వ్యక్తిని ప్రవేశపెట్టారు రక్షణకారులు.
‘అయ్యా... వీరి పేరు కారప్పన్. భూలోకంలో ఎక్కడ కారం ఉన్నా దొంగిలిస్తాడు. అలా టన్నుల కొద్ది కారాన్ని దొంగిలించి కోట్లకు పడగెత్తాడు. కారం అంటే పడి చస్తాడు. అలా చచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇతడిపై భూలోక పోలీసు ఠాణాల యందు మిక్కిలి కేసులు ఉన్నవి. చిత్రగుప్తుల వారి చిట్టా కూడా ఇతడు కరుడు గట్టిన కారం దొంగ అని చెప్పుచున్నది’ అన్నాడు ఆ.అ (ఆరోపణ అధికారి)
‘కారప్పన్... నువ్వు నరకలోక న్యాయస్థానానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నావా?’ అడిగారు ఇ. అధికారవర్యులు.
‘అయ్యా, ఆరోపణ అధికారి చెప్పినదానిలో మిరప గింజంత నిజం కూడా లేదు. నా పేరు కారప్పన్ అయినంత మాత్రాన కారం దొంగగా ముద్ర వేయడం శోచనీయం, గర్హనీయం. చిత్రగుప్తుల వారి చిట్టా ఎప్పుడో అవుట్‌డేట్ అయింది. దాన్ని నమ్మొద్దు’ అన్నాడు కారప్పన్.
కట్ చేస్తే....
నరక లోకరక్షణ అధికారులు కారప్పన్‌ను ఏఐ చాట్‌బాట్ ‘యమహో...అదరహో’ దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ చాట్‌బాట్‌లో కారప్పన్ పూర్తి వివరాలు అప్‌లోడ్ చేసి...‘వీరిపై ఎన్నో ఆరోణలు ఉన్నాయి. అవి నిజమా కాదా?’ అని ప్రాంప్ట్ ఇచ్చారు.
‘ఒక్కటి కూడా నిజం కాదు. కారప్పన్‌కు కారం అంటే చిన్నప్పటి నుంచి విరక్తి. అతడు తినే భోజనంలో రవ్వంత కారం కూడా ఉండదు. కాకికి కూడా హాని చేయని కారంజన్ముడు!’ అని చెప్పింది ఏఐ చాట్‌బాట్.
విచిత్రం ఏమిటంటే... కారప్పన్ మాత్రమే కాదు ఆ తరువాత బోన్‌లో ప్రవేశ పెట్టిన 120 మంది కరుడు గట్టిన నేరస్థులను కూడా ‘ఉత్తములు, ఆదర్శనీయులు’ అని తేల్చేసింది ఏఐ చాట్ బాట్. దీంతో ఇన్వెస్టిగేషన్ అధికారీవర్యులకు ఏ.ఐ చాట్‌బాట్‌పై అనుమానం వచ్చింది.
‘గది సంఖ్య ఆరువందల రెండులో ఉన్న ప్రసిద్ధ గంధపు చెక్కల మహా దొంగ వీరప్పన్‌ను ఏ.ఐ. చాట్‌బాట్ దగ్గరకు తీసుకురండి’ అని అరిచారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు. మీసాలు తిప్పుతూ ‘తిప్పరా మీసం...కొట్టరా చందనం’ అని పాడుతూ ఏ.ఐ. చాట్‌బాట్ దగ్గరికి వచ్చాడు వీరప్పన్.
‘వీరప్పన్ వ్యక్తిత్వం గురించి తెలియజేయండి’ అని ఏఐ చాట్‌బాట్‌కు ప్రాంప్ట్ ఇచ్చారు అధికారులు.
‘చాలా ఉత్తముడు. గంధపు చెక్కలను జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు. హింసకు ఇరవై నాలుగు కిలోమీటర్‌ల దూరం. చీమకు కూడా హాని తలపెట్టని మహోన్నతుడు. మానవతావాది...’ ఇలా జవాబు ఇచ్చింది ఏఐ చాట్‌బాట్.
‘ఈ యంత్రమును అత్యవసరముగా భాగ్యనగరంలోని మూసీలో విసిరేయండి’ అని ఆజ్ఞాపించారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు.
అసలు విషయం
‘నరక లోక ఏఐ స్కామ్’లో టెక్ అప్పలరాజును దోషిగా తేల్చారు నరకలోక దర్యాప్తు అధికారులు. నెలక్రితం జరిగిన ఘోర యాక్సిడెంట్‌లో చనిపోయిన టెక్ రాజు నరకానికి వచ్చాడు. యమలోకంలో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన బాధ్యతలను టెక్ రాజుకు అప్పగించారు అధికారులు. ఇదే అదనునుగా తనలాంటి కరుడు గట్టిన క్రిమినల్స్‌ను ఆదుకోవడానికి ‘యమహో... అదరహో’ ఏ.ఐ. చాట్‌బాట్‌లో తన టెక్ తెలితేటలతో మార్పులు చేశాడు. ఏ.ఐ. చాట్‌బాట్ అన్నీ అబద్ధాలే చెప్పేలా ఫాల్స్ ఫ్యాక్ట్స్ ప్రాసెసింగ్ (ఎఫ్‌ఎఫ్‌పీ) చేశాడు. అసలు విషయం ఇదన్నమాట!
– యాకుబ్ పాషా


