Yama
-
యముడికి కాళ్ళు విరగాలని శపించిన తల్లి!
విశ్వకర్మ కూతురైన సంజ్ఞను సూర్యుడు పెండ్లాడాడు. వైవస్వత మనువు, యముడు, యమున వారి సంతానం. సూర్యుడి ప్రచండ కిరణాల ఉష్ణాన్ని భరించలేని సంజ్ఞ, కొంత కాలం సూర్యుడికి దూరంగా ఉండాలనుకుంది. అది సూర్యుడికి తెలియకుండా జరగాలని, తన ఛాయకు రూపాన్ని కల్పించి, తాను అశ్వరూపం ధరించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఛాయ సూర్యుడిని ఆరాధించింది. వారికి సూర్యసావర్ణి మనువు, శని, తపతి సంతాన మయ్యారు. ఛాయకు సొంత సంతానం కలిగిన తరువాత, తమ పట్ల ఆమెచూపించే అనురాగంలో క్షీణతను గమనించిన యముడు ‘తల్లివైయుండి అందరి పట్ల సమానమైన ప్రేమను చూపక పోవడం ఏమిటి? ఇలాంటి బుద్ధి నీకు ఎందుకు కలిగింది?’ అని ప్రశ్నించాడు. అది సహించని ఛాయ, యముడిని దుర్భాష లాడింది. తల్లి నుండి దుర్భాషను ఊహించని యముడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంలో ఏమి చేస్తున్నాడో గ్రహించకుండా, ఛాయను కాలితో తన్నాడు. ఆ విపరీత ప్రవర్తనను భరించలేని ఛాయ, యముడికి కాళ్ళు విరగాలని శపించిది. కాళ్ళు పోగొట్టుకున్న యముడిని చూసి సూర్యుడు ‘ఎందుకిలా జరిగింది?’ అని అడిగాడు. శాపం గురించి చెప్పి ‘ఆమె నిజంగా నా తల్లి అయుంటే ఆమెను నేను ఎలా తన్నగలిగేవాడను? ఆమెకు నేను కొడుకునైతే ఆమె నన్ను ఎలా శపించగలిగేది? ఆమె మాకు తల్లి కాదు, నేను ఆమెకు కొడుకునూ కాదు!’ అన్నాడు. యముడి మాటలు విన్న సూర్యుడు, ఛాయను నిజం చెప్పమని, లేకుంటే శపిస్తానని గద్దించి అడిగాడు. భయపడిన ఛాయ జరిగినదంతా చెప్పింది. విన్న సూర్యుడు యముడి కాళ్ళు పూర్వంలా అయేట్లుగా అనుగ్రహించి, వెంటనే వెళ్ళి అడవిలో అశ్వరూపంలో సంచరిస్తున్న సంజ్ఞను కలుసుకున్నాడు. వారికి రేవంతుడు, అశ్వినీదేవతలు సంతానంగా కలిగారు. త్వష్ట వచ్చి, సంజ్ఞ పడుతున్న బాధను గురించి సూర్యుడికి చెప్పి, సూర్యుడి కిరణాలలో ఎనిమిదవ పాలు సానపట్టి తగ్గించాడు. అలా తగ్గించేక్రమంలో రాలిన సూర్యుడి రణ రజం నుండి శంకరుడి త్రిశూలము, విష్ణుమూర్తి చక్రము, కుబేరుడి ఖడ్గము, కమారస్వామి శక్తి ... ఇలా నానాదేవతల ఆయుధాలు తయారుచేయబడ్డాయని వెన్నెలకంటి సూరన రచించిన శ్రీవిష్ణుపురాణం, చతుర్థాశ్వాసంలో చెప్పబడింది.– భట్టు వెంకటరావు -
Children's Day 2021 Special: యముడిని మెప్పించిన నచికేతుడు.. కథ!
నచికేతుడు అక్కడకు చేరుకునే సమయానికి యముడు నరకంలో లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు. యముడు తిరిగి వచ్చేంత వరకు నచికేతుడు మూడురోజుల పాటు నరకద్వారం వద్దే నిరాహారంగా పడిగాపులు గాశాడు. బయటకు వెళ్లిన యముడు తిరిగి నరకానికి వచ్చాడు. వాజశ్రవుడు గౌతముడి వంశానికి చెందినవాడు. అతడికి ఉద్ధాలకుడనే పేరు కూడా ఉండేది. ఒకసారి అతడు ‘విశ్వజిత్’ అనే యాగాన్ని తలపెట్టాడు. పురోహితులను, వేదపండితులను ఆహ్వానించి దిగ్విజయవంతంగా యాగాన్ని పూర్తి చేశాడు. యాగం నిర్వహించినవాడు తన సర్వ సంపదలనూ దానం చేయాలనేదే ‘విశ్వజిత్’ యాగ నియమం. వాజశ్రవుడు తన గొడ్లపాకలోని ముసలి గోవులను పురోహితులకు దానం చేయసాగాడు. వాజశ్రవుడి కొడుకు నచికేతుడు బాలకుడు. తండ్రి చేస్తున్న తతంగాన్నంతా అతడు గమనించసాగాడు. ఎలాగైనా తండ్రికి జ్ఞానం కలిగించాలనుకున్నాడు. మెల్లగా తండ్రి దగ్గరకు చేరుకున్నాడు. ‘నాన్నా! నేనూ నీ సంపదనేగా! మరి నన్నెవరికి దానమిస్తావు?’ అని అడిగాడు. కొడుకు ప్రశ్నను పిల్లచేష్టగా భావించి, వాజశ్రవుడు పట్టించుకోలేదు. నచికేతుడు పట్టువీడలేదు. తండ్రి దాన ధర్మాల్లో తలమునకలుగా ఉన్నప్పుడు చీటికి మాటికి అడ్డు తగులుతూ ‘నాన్నా! నన్నెవరికి దానమిస్తావు?’ అని పదే పదే అడగసాగాడు. వాజశ్రవుడికి సహనం నశించి, కొడుకు మీద పట్టరాని కోపం వచ్చింది. ‘నిన్ను యముడికి దానం చేస్తాను! ఫో!’ అని కసురుకున్నాడు. యజ్ఞ తతంగం అంతా ముగిశాక, వాజశ్రవుడికి కాస్త ఊపిరిపీల్చుకునే తీరిక చిక్కింది. ఏదో కోపంలో కొడుకుతో అనేసిన మాటలు గుర్తొచ్చి, బాధపడ్డాడు. ఇంతలో నచికేతుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. ‘నాన్నా! ఆడినమాట నిలుపుకోకుంటే అసత్య దోషం చుట్టుకుంటుంది. అందువల్ల ఏమీ బాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపు’ అన్నాడు. వాజశ్రవుడు బదులివ్వలేదు. తండ్రి మాట ప్రకారం నచికేతుడు యముడి వద్దకు బయలుదేరాడు. యముడి కోసం వెదుక్కుంటూ నచికేతుడు నరకలోకానికి చేరుకున్నాడు. నచికేతుడు అక్కడకు చేరుకునే సమయానికి యముడు నరకంలో లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు. యముడు తిరిగి వచ్చేంత వరకు నచికేతుడు మూడురోజుల పాటు నరకద్వారం వద్దే నిరాహారంగా పడిగాపులు గాశాడు. బయటకు వెళ్లిన యముడు తిరిగి నరకానికి వచ్చాడు. ‘ఎవరో బాలకుడు మీకోసం వచ్చి, మూడురోజులుగా అన్నపానీయాల్లేకుండా మన నరకద్వారం వద్దే నిరాహారంగా ఎదురుచూస్తున్నాడు’ అని యమభటులు చెప్పారు. ‘అతిథిలా వచ్చిన బాలకుడిని మూడురోజులు నిరాహారంగా ఉంచి పాపం చేశాను’ అనుకుని యముడు బాధపడ్డాడు. వెంటనే నచికేతుని వద్దకు చేరుకున్నాడు. ‘మూడురోజులు నిన్ను నిరాహారంగా ఉంచి పాపం చేశాను. అందుకు పరిహారంగా నీకు మూడు వరాలిస్తాను. కోరుకో!’ అన్నాడు. సరేనన్నాడు నచికేతుడు. ‘నేను తిరిగి ఇంటికి చేరుకునే సరికి, నన్ను మా నాన్న నవ్వుతూ స్వాగతించాలి, అతడి పాపాలన్నీ తొలగిపోవాలి. ఇది నా మొదటి వరం’ అన్నాడు నచికేతుడు. ‘తథాస్తు’ అన్నాడు యముడు. ‘స్వర్గప్రాప్తికి సంబంధించిన యజ్ఞక్రతువు పద్ధతిని నేర్పించాలి. ఇది నా రెండో వరం’ అడిగాడు నచికేతుడు. సంతోషంగా ‘సరేన’న్నాడు యముడు. యజ్ఞక్రతువును నేర్పించి, అప్పటి నుంచి ఆ యజ్ఞానికి నచికేతుడి పేరు మీద ‘నాచికేత యజ్ఞం’ అనే పేరు వస్తుందని కూడా ఆశీర్వదించాడు. ‘మరణానంతర జీవితాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని నాకు వివరించాలి. ఇది నా మూడోవరం’ అన్నాడు నచికేతుడు. బాలకుడి మూడోవరానికి యముడు అవాక్కయ్యాడు. దాని బదులు ధన కనక వస్తువాహనాలింకేవైనా కోరుకోమన్నాడు. నచికేతుడు యముడి ప్రతిపాదనకు ‘ససేమిరా’ అన్నాడు. తనకు ఎలాగైనా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాల్సిందేనని పట్టుబట్టాడు. బాలకుడైన నచికేతుడి పట్టుదలకు ముచ్చటపడ్డాడు యముడు. ఎట్టకేలకు అతడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు. మరణానంతర జీవన రహస్యాలను వివరించి, సాదరంగా సాగనంపాడు. బ్రహ్మజ్ఞానం పొందిన నచికేతుడు ఇంటికి చేరుకోగా, అతడి తండ్రి సంతోషంగా అతణ్ణి స్వాగతించాడు. – కఠోపనిషత్తులోని కథ -
జనన మరణాల నుంచి విముక్తికి... నచికేతయజ్ఞం
ఉపనిషత్తులకు తలమానికమూ, దశోపనిషత్తులలో ప్రముఖమూ కఠోపనిషత్తు. రెండు అధ్యాయాలుగా ఉండే ఈ కఠోపనిషత్తు ప్రథమాధ్యాయం ప్రథమవల్లిలో నచికేతుడు అనే బాలుడు యముడి వద్దకు వెళ్లడం, ఆ సమయంలో యముడు అక్కడ లేకపోవడంతో మూడుదినాలపాటు ఆయన ఇంటి ముంగిట నిద్రాహారాలు లేకుండా పడిగాపులు పడటం, యముడు వచ్చి, తన అతిథి తన ఇంట మూడురాత్రులు నిరాహారంగా ఉన్నందుకు ప్రాయశ్చిత్తంగా మూడువరాలు ఇస్తాననడం, ఆ మూడువరాలలో రెండవ వరమైన స్వర్గానికి చేర్చే యజ్ఞమేది అని నచికేతుడు సందేహాన్ని వెలిబుచ్చటాన్ని గురించి గతవారం మనం చెప్పుకున్నాం. నచికేతుడి సందేహానికి యముడు చెప్పిన సమాధానం ఈ వారం... ‘‘నాయనా! స్వర్గానికి చేరటానికి, అనంతలోకాలను పొందటానికి శాశ్వతమైన విద్యగా ఉన్న ఈ రహస్యాన్ని నీవు తెలుసుకో’’ అంటూ యముడు నచికేతుడికి అన్ని లోకాలలో ఆది అయిన అగ్నిని గురించి చెప్పాడు. యజ్ఞానికి ఏ ఇటుకలు ఎన్ని కావాలో, వాటిని ఎలా పేర్చాలో యజ్ఞం ఎలా చెయ్యాలో వివరంగా బోధించాడు. శ్రద్ధగా విన్న నచికేతుడు యముడు చెప్పినదంతా తు.చ. తప్పకుండా అప్పచెప్పాడు. అతని గ్రహణశక్తికి, ధారణశక్తికి యముడు ఎంతో సంతోషించాడు. ‘‘నాయనా! ఈ విద్య ఇకనుంచి నీ పేరుతో ‘నచికేతాగ్ని’గా పిలవబడుతుంది. ప్రకాశంతమైన ఈ హారాన్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఈ నచికేత యజ్ఞాన్ని మూడుసార్లు చేసినవాడు మూడు రకాల కర్మలు చేసినవాడై జనన మరణాల నుంచి విముక్తుడవుతాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. అగ్నిని సాక్షాత్కరింపజేసుకుని పరమానందాన్ని, శాంతిని పొందుతాడు. నాచికేతాగ్నిని మూడుసార్లు ఉపాసించిన విద్వాంసుడు మృత్యుపాశాన్ని ఛేదిస్తాడు. శోకాన్ని పోగొట్టుకుంటాడు. స్వర్గసుఖాలనుభవిస్తాడు. ‘‘నాయనా! ఇక మూడోవరం ఏం కావాలో కోరుకో’’ అన్నాడు యముడు. ‘‘యమధర్మరాజా! మరణించిన తరువాత మానవుడు ఉన్నాడని కొందరు, లేడని ఇంకొందరు అంటున్నారు. ఈ రహస్యాన్ని నీ సన్నిధిలో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది నా మూడోవరం’’ అన్నాడు నచికేతుడు. నచికేతుడు అడిగిన మొదటివరం భౌతిక సంబంధం. రెండోవరం యజ్ఞయాగాది కర్మ సంబంధం. మూడోవరం బ్రహ్మజ్ఞాన సంబంధం. మానవుల సాధన, అన్వేషణ ఈ క్రమంలో జరగాలని కఠోపనిషత్తు అనుశాసనం. అందరూ ఒకటి రెండు వరాలతో ఆగిపోతారు. ఆకర్షణలకు లొంగిపోతారు. మూడవ దశకు చేరుకోవడమే ఉత్తమ స్థితి. అందుకే యముడు నచికేతుణ్ణి పరీక్షిస్తున్నాడు. యముడు ‘‘నచికేతా! దేవతలకు కూడా నీలాంటి సందేహమే వచ్చింది. ఇది పరమ సూక్ష్మం. తెలుసుకోవడమే కష్టం. సాంతం తెలియదు. ఇది చెప్పమని నన్ను ఒత్తిడి పెట్టకు. ఇంకేమైనా అడుగు ఇస్తాను’’ అన్నాడు. ‘‘దేవతలకు కూడా తీరని సందేహాన్ని తేలికగా తెలుసుకోలేని విషయాన్ని నీకన్నా సమగ్రంగా చెప్పగలవారు మరొకరు ఎవరు దొరుకుతారు? కనుక ఈ వరం కంటే మరేదీ గొప్పది కాదు. నాకు ఇదే కావాలి’’ అన్నాడు. ‘‘నచికేతా! నూరేళ్లు జీవించే పుత్రపౌత్రుల్ని కోరుకో. ఏనుగుల్ని, గుర్రాల్ని, పశుసంపదను, బంగారాన్ని, సమస్త భూవలయాన్ని కోరుకో. ఎన్నేళ్లు బతకాలనుకొంటే అంతకాలం బతుకు. మొత్తం భూగోళానికి చక్రవర్తివి అవ్వు. నువ్వు ఏది కోరితే అది జరిగే వరమైనా ఇస్తాను. అంతేకాని మరణం గురించి చెప్పమని నన్ను అడక్కు’’ అన్నాడు. ‘‘యమధర్మరాజా! నువ్వు చెప్పివన్నీ క్షణికమైనవే. ఇంద్రియాల తేజస్సును నాశనం చేసేవే. నువ్వు ఎంత ఆయుష్షు ఇచ్చినా మానవ జీవితం స్వల్పమే. నాకు ఇస్తానన్న సిరిసంపదలు, భోగాలు అన్నీ నువ్వే ఉంచుకో. మనిషి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా తృప్తిపడడు. నీ దర్శనం వల్ల సంపదలు ఎలాగూ వస్తాయి. నువ్వు ఆయుష్షు ఇచ్చినంతవరకు ఎలాగైనా బతుకుతాం. మరణానంతర జీవితాన్ని గురించి తెలుసుకోవాలన్నదే నా కోరిక. క్షయమూ నాశనమూ లేని నీ దగ్గర నుంచి తాత్కాలికమైన వరాలు పొందాలనీ దీర్ఘకాలం జీవించాలనీ తెలివైనవాడు ఎవరు కోరుకుంటారు? కనుక మృత్యుదేవా! ఇక నన్ను పరీక్షించటం ఆపు. ఎవరికీ తెలియనిదీ, తెలుసుకోలేనిదీ, నువ్వు తప్ప మరొకరు చెప్పలేనిదీ అయిన ఆత్మజ్ఞానాన్ని తప్ప ఈ నచికేతుడు నిన్ను మరో వరం అడగడు. అని నచికేతుడు యమధర్మరాజుకు తేల్చి చెప్పాడు. దీంతో కఠోపనిషత్తు ప్రథమ వల్లి పూర్తి అయింది. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్