
ఆ కిరణ రజం నుండే...
విశ్వకర్మ కూతురైన సంజ్ఞను సూర్యుడు పెండ్లాడాడు. వైవస్వత మనువు, యముడు, యమున వారి సంతానం. సూర్యుడి ప్రచండ కిరణాల ఉష్ణాన్ని భరించలేని సంజ్ఞ, కొంత కాలం సూర్యుడికి దూరంగా ఉండాలనుకుంది. అది సూర్యుడికి తెలియకుండా జరగాలని, తన ఛాయకు రూపాన్ని కల్పించి, తాను అశ్వరూపం ధరించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఛాయ సూర్యుడిని ఆరాధించింది. వారికి సూర్యసావర్ణి మనువు, శని, తపతి సంతాన మయ్యారు. ఛాయకు సొంత సంతానం కలిగిన తరువాత, తమ పట్ల ఆమెచూపించే అనురాగంలో క్షీణతను గమనించిన యముడు ‘తల్లివైయుండి అందరి పట్ల సమానమైన ప్రేమను చూపక పోవడం ఏమిటి? ఇలాంటి బుద్ధి నీకు ఎందుకు కలిగింది?’ అని ప్రశ్నించాడు.
అది సహించని ఛాయ, యముడిని దుర్భాష లాడింది. తల్లి నుండి దుర్భాషను ఊహించని యముడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంలో ఏమి చేస్తున్నాడో గ్రహించకుండా, ఛాయను కాలితో తన్నాడు. ఆ విపరీత ప్రవర్తనను భరించలేని ఛాయ, యముడికి కాళ్ళు విరగాలని శపించిది. కాళ్ళు పోగొట్టుకున్న యముడిని చూసి సూర్యుడు ‘ఎందుకిలా జరిగింది?’ అని అడిగాడు. శాపం గురించి చెప్పి ‘ఆమె నిజంగా నా తల్లి అయుంటే ఆమెను నేను ఎలా తన్నగలిగేవాడను? ఆమెకు నేను కొడుకునైతే ఆమె నన్ను ఎలా శపించగలిగేది? ఆమె మాకు తల్లి కాదు, నేను ఆమెకు కొడుకునూ కాదు!’ అన్నాడు. యముడి మాటలు విన్న సూర్యుడు, ఛాయను నిజం చెప్పమని, లేకుంటే శపిస్తానని గద్దించి అడిగాడు.
భయపడిన ఛాయ జరిగినదంతా చెప్పింది. విన్న సూర్యుడు యముడి కాళ్ళు పూర్వంలా అయేట్లుగా అనుగ్రహించి, వెంటనే వెళ్ళి అడవిలో అశ్వరూపంలో సంచరిస్తున్న సంజ్ఞను కలుసుకున్నాడు. వారికి రేవంతుడు, అశ్వినీదేవతలు సంతానంగా కలిగారు. త్వష్ట వచ్చి, సంజ్ఞ పడుతున్న బాధను గురించి సూర్యుడికి చెప్పి, సూర్యుడి కిరణాలలో ఎనిమిదవ పాలు సానపట్టి తగ్గించాడు. అలా తగ్గించేక్రమంలో రాలిన సూర్యుడి రణ రజం నుండి శంకరుడి త్రిశూలము, విష్ణుమూర్తి చక్రము, కుబేరుడి ఖడ్గము, కమారస్వామి శక్తి ... ఇలా నానాదేవతల ఆయుధాలు తయారుచేయబడ్డాయని వెన్నెలకంటి సూరన రచించిన శ్రీవిష్ణుపురాణం, చతుర్థాశ్వాసంలో చెప్పబడింది.
– భట్టు వెంకటరావు