20 రోజుల్లో ఇదే తరహాలో మూడు ఘటనలు
క్షణికావేశంలో విచక్షణ కోల్పోతున్న దంపతులు
ఒక్క క్షణం ఆలోచించలేకపోతున్నారు..
సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు.. ఆటుపోట్లకు
నిలదొక్కుకోలేకపోతున్నారు..
అనుకున్నది జరక్కపోతే తట్టుకోలేకపోతున్నారు..
అత్తారింట్లో ఇమడలేకపోతున్నారు..
ఆడపడుచుల పోరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు..
తల్లిదండ్రుల చాటు బిడ్డలుగానే మెలుగుతున్నారు..
తెలిసీతెలియని వయస్సు పెళ్లిళ్లతో నలిగిపోతున్నారు..
కోపం వస్తే అణచుకోలేకపోతున్నారు..
అణకువను అలవర్చుకోలేకపోతున్నారు..
మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు..
సమయస్ఫూర్తితో వ్యవహరించలేకపోతున్నారు..
నలుగురితో చర్చించలేకపోతున్నారు..
క్షణికావేశంలో విచక్షణ కోల్పోతున్నారు..
నూరేళ్ల జీవితాన్ని కాలరాసుకుంటున్నారు..
కంటిపాపలను నిర్దయగా చిదిమేస్తున్నారు..
నంద్యాల: ఆర్థిక, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలతో కొందరు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు. ఏం పాపం చేయని చిన్న పిల్లలకు రంగుల లోకంలో చోటు లేకుండా చేస్తున్నారు. విషమిచ్చి, కాల్వలో తోసేసి చిన్నారులను తమతోపాటు తీసుకెళ్తున్నారు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయాలతో కుటుంబసభ్యులకు రోదనే మిగులుతోంది. నంద్యాల జిల్లాలో కొన్ని రోజులుగా ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి.
20 రోజుల్లో ఏడుగురు చిన్నారులు మృతి
గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లి ఎల్లా లక్ష్మీ(23) గతేడాది డిసెంబర్ 28న మంచాలకట్ట సమీపంలో తన పిల్లలు వైష్ణవి(3), మూడు నెలల చిన్నారి సంగీతను ఎస్సార్బీసీ కాల్వలో తోసి తాను కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడవకముందే ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర(34) ఆర్థిక సమస్యలతో తట్టుకోలేక సురేంద్ర కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి (4), సూర్యగగన్ (1.5)కు పాలలో విషం కలిపి తాపించి తాను చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త వేధింపులు భరించలేక మల్లిక(27) అనే మహిళ శనివారం ఉదయం ఇద్దరు పిల్లలు ఇషాంత్(7), పరిణతి(9నెలలు)కి పురుగుల మందు తాపి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత 20 రోజుల్లో జిల్లాలో వరుసగా జరిగిన ఘటనల్లో అభం శుభం తెలియని ఏడుగురు చిన్నారులు నిండు జీవితాలను కోల్పోయారు.
జీవితాలను బలి చేసుకోవద్దు
సమస్య చిన్నదే అయినా కొందరు తీవ్రంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాము లేకపోతే పిల్లలకు భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడతూ తమతోపాటు తీసుకెళ్తున్నారు. వారు తీసుకొనే నిర్ణయమే తప్పు అయితే పిల్లలను చంపి మరో తప్పు చేస్తుండటం విస్మయానికి గురి చేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని, తీవ్ర నిర్ణయాలు తీసుకొని జీవితాలను బలి చేసుకోద్దని సూచిస్తున్నారు.


