రుద్రవీణ నిర్ణిద్ర గానం | Vidhushi Jyoti Hegde is the first woman player of Rudra veena in the world | Sakshi
Sakshi News home page

రుద్రవీణ నిర్ణిద్ర గానం

Aug 14 2026 6:17 AM | Updated on Aug 14 2026 6:17 AM

Vidhushi Jyoti Hegde is the first woman player of Rudra veena in the world

ఫస్ట్‌ ఉమెన్‌

సితార్, వీణ గురించి తెలిసినంతగా చాలామందికి ‘రుద్రవీణ’ వాద్యం గురించి తెలియదు. నేర్చుకునేవారు చా...లా తక్కువగా ఉంటారు. ‘రుద్రవీణ’ నేర్చుకునే వారికి మంచి జరగదు’ అనే అపోహ, మూఢనమ్మకాలే దీనికి కారణం. ఆ అపోహల అడ్డుగోడలను కాలదన్ని ‘రుద్రవీణ’లో ప్రావీణ్యం సాధించిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు బెంగళూరుకు చెందిన జ్యోతి హెగ్డే. గురుకులం ఏర్పాటు చేసి రుద్రవీణలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రుద్రవీణ కళాకారిణిగా సంగీత నాటక అకాడమీ అవార్డ్‌ అందుకున్నారు...

‘సంగీత నాటక అకాడమీ పురస్కారం వల్ల నాకు వ్యక్తిగత సంతోషం కంటే రుద్రవీణకు ఈ గుర్తింపు లభించింది అనే సంతోషమే ఎక్కువగా ఉంది’ అంటారు జ్యోతి హెగ్డే.
సితార్, వీణలాంటి తంత్రి వాద్యాలతో పోలిస్తే ‘రుద్రవీణ’లో ప్రావీణ్యం సాధించిన కళాకారులు చాలా తక్కువ. ఈ వాద్యంలో ప్రావీణ్యం సాధించిన మొదటి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు జ్యోతి హెగ్డే. అయితే ఆ గుర్తింపును సున్నితంగా తిరస్కరిస్తారు హెగ్డే.

హంపీ శిల్పాల్లో రుద్రవీణ
‘అజంతా, ఎల్లోరా గుహలు, హంపీ శిల్పాలను చూసినప్పుడు మహిళల చేతుల్లో రుద్రవీణ కనిపిస్తుంది. సరస్వతీదేవి, పార్వతీదేవి కూడా రుద్రవీణ వాయిస్తున్న చిత్రాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు రుద్రవీణ వాయించిన మొదటి మహిళను నేను ఎలా అవుతాను... అనిపిస్తుంది. అయితే ఇప్పటికాలంలో రుద్రవీణను ఎంచుకున్న మొదటి మహిళను మాత్రం నేనే’ అంటారు హెగ్డే.

ఆ ధ్వనిలో ఆధ్యాత్మిక పరిమళం
కాలేజీ రోజుల్లో జ్యోతి హెగ్డే సితార్‌ తీగల మీద సాధన చేస్తుండేవారు. ఈ క్రమంలో ‘సమ్‌థింగ్‌ స్పెషల్‌’ లాంటి సంగీత పరికరం ‘రుద్రవీణ’ పరిచయం అయింది. ఆ పరిచయం తనను వీనుల విందైన రుద్రవీణ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ‘రుద్రవీణ ధ్వనిలో ఆధ్యాత్మిక పరిమళం ఉంది. తీగలను మీటుతూ స్వరాలను పలికిస్తున్నప్పుడు ఆ ధ్వని నాలో ప్రతిధ్వనిస్తుంది. ఆ ధ్వని, రాగాలను నాలో లీనం చేసుకుంటాను. నా అంతర్గత ఆధ్యాత్మిక స్థితిని తెలియజేయడానికి ఇది నాకు తోడ్పడుతుంది’ అంటారు హెగ్డే.

అది మూఢనమ్మకం మాత్రమే...
‘బరువైన రుద్రవీణ వాయిద్యాన్ని వాయించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది’ అనే అపోహ, మూఢనమ్మకం ఉండడం వల్ల ఆ వాద్యానికి దగ్గరైన వారి సంఖ్య తక్కువ. ‘ఎన్నో అపోహలు ఉన్నప్పటికీ నేను రుద్రవీణ వైపు ఆకర్షితం కావడానికి కారణం... బహుశా ప్రశాంతత, ధ్యానం పట్ల ఇష్టం ఉండడం కావచ్చు. ముగ్గురు గురువుల దగ్గర శిక్షణ పొందాను. మొదట్లో వారు, నువ్వు అమ్మాయివి కదా రుద్రవీణ వాయించడం కష్టం అన్నారు. రుద్రవీణను ఎత్తి, వాయించగల శారీరక బలం నాలో ఉంది అని వారితో చె΄్పాను. ఇతరులు మూడు గంటల సాధన చేస్తే నన్ను నేను నిరూపించుకోవడానికి పది గంటలు సాధన చేసేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు హెగ్డే. ‘రుద్రవీణ వాయించడానికి మహిళలు శారీరకంగా, మానసికంగా సరిపోతారు. కావాల్సిందల్లా నేర్చుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం మాత్రమే’ అంటున్న హెగ్డే, తన గురుకులంలో అరవైమందికి పైగా విద్యార్థులకు రుద్రవీణలో శిక్షణ ఇస్తున్నారు.

గురువు దగ్గరే పరిపూర్ణత
కళాకారులను తయారుచేయడానికి, వారిని తీర్చిదిద్దడానికి ఆన్‌లైన్‌ తరగతులు, నెలకొకసారి జరిగే క్లాసులు సరిపోవని కోవిడ్‌ కాలంలో గ్రహించాను. శిష్యులు గురువుకు దగ్గరగా ఉన్నప్పుడే, నేర్చుకోవడంలో వారికి పరిపూర్ణత వస్తుంది. ఇది మాత్రమే కాకుండా గురువు జీవనశైలి, ఆలోచనా విధానం, అంకితభావం, కళాత్మక వ్యక్తిత్వాన్ని గ్రహించే అవకాశం లభిస్తుంది.
– జ్యోతి హెగ్డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement