నీరివ్వాలి, లేదా రూ.50 వేలు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

నీరివ్వాలి, లేదా రూ.50 వేలు ఇవ్వండి

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

మైసూరు: కావేరి నదీ పరివాహక డ్యాంల నుంచి వెంటనే కాలువలకు సాగునీరు వదలాలని, లేకుంటే ప్రతి ఎకరాకు రూ.50 వేల పరిహారం ప్రకటించాలని కబిని రైతు హితరక్షణ సమితి అధ్యక్షుడు హళ్లికెరె హుండి భాగ్యరాజ్‌ డిమాండ్‌ చేశారు. మైసూరులోని గన్‌హౌస్‌ వద్ద నిరసనకు దిగి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాడా కార్యాలయానికి చేరుకుని వరి నాట్లు వేసేందుకు నీరు వదలాలని, విత్తనాలను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. జలాశయాల నుంచి కాలువలకు నీరివ్వడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని మండిపడ్డారు.

జేడీఎస్‌ ఎమ్మెల్యే విడుదల

శివాజీనగర: బగర్‌ హుకుమ్‌ భూ మంజూరులో అక్రమాల కేసులో అరెస్ట్‌ అయిన బేలూరు జేడీఎస్‌ ఎమ్మెల్యే కే.ఎస్‌.లింగేష్‌, సుమారు 52 రోజులు బెంగళూరు పరప్పన జైలులో గడిపిన తరువాత గురువారం విడుదలయ్యారు. వందలాది జేడీఎస్‌ కార్యకర్తలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. లింగేష్‌ మాట్లాడుతూ, శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితిని రాకూడదని, చేయని తప్పుకు 52 రోజులు జైలులో గడిపానని వాపోయారు. అర్హులైన లబ్ధిదారులకు చట్టబద్ధంగానే భూమిని కేటాయించినట్లు చెప్పారు.

ఒకే కాన్పులో

ముగ్గురు జననం

రాయచూరు రూరల్‌: 20 ఏళ్ల గర్భిణి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన బెళగావి జిల్లాలో జరిగింది. బుధవారం రాత్రి గోకాక్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం మూడలగి తాలూకాకు చెందిన లక్ష్మి రేణుకా గణాచారి అనే గర్భిణి చేరింది. ఈమెకు రెండేళ్ల క్రితం వివాహం కాగా ఇదే తొలి కాన్పు. ఆశ్చర్యకరంగా ముగ్గురు శిశువులు జన్మించారు. తల్లీ, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

సభాపతుల స్థానాలకు నామినేషన్లు

శివాజీనగర: విధానసభ స్పీకర్‌ పదవికి గదగ్‌ జిల్లాలోని రోణ నియోజకవర్గం కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే జీహెచ్‌ పాటిల్‌ గురువారం నామినేషన్‌ను సమర్పించారు. విధానపరిషత్‌ సభాపతి స్థానానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సలీం అహ్మద్‌ కూడా నామిననేష్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమాల్లో సీఎం డీకే శివవకుమార్‌, కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్‌, మంత్రులు పాల్గొన్నారు. ఈ పదవులకు శుక్రవారం ఎన్నికలు జరుగుతాయి. వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ వల్ల ఈ పీఠాలు ఖాళీ అయ్యాయి.

గూడ్సు ఆటో ఢీకొని మహిళ మృతి

మండ్య: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మండ్య జిల్లా మలవల్లి పట్టణం మద్దూరు వెళ్లే ప్రధాన రహదారిపై దొడ్డకెరె సమీపంలో బుధవారం జరిగింది. మలవల్లి పట్టణంలోని సుల్తాన్‌ రోడ్డు మడివాళ వీధిలో లెఫ్టినెంట్‌ జయరాము, శారదమ్మ (55) దంపతులు నివాసం ఉంటున్నారు. శారదమ్మ బుధవారం స్కూటీలో సమీపంలోని గుడికి వెళ్లింది. బైక్‌ పార్కు చేస్తుండగా వెనుక నుంచి గూడ్స్‌ ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో శారదమ్మ తీవ్ర గాయాలతో మృతి చెందగా దొడ్డన్న అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని తాలూకా ఆసుపత్రికి తరలించారు. నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement