breaking news
Patriotism songs
-
ఒకనాటి జెండా పండగ మువ్వన్నెలూ పిల్లల ముఖాల్లోనే...
ఆగస్టు పదిహేనంటే ముందు దేశభక్తి గీతాల అడావిడి. క్లాసులో ఎవరికీ సరిగా పాడటం రాదు. కాని అందరూ చేతులెత్తేవారే. ఊరి హైస్కూల్లో... ఏ హైస్కూల్లో అయినా నలుగురైదుగురు టీచరమ్మలు ఉంటారు. ఒక ఐవోరుకి పాటల గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. అంతో ఇంతో పాడేవాడై కూడా ఉంటాడు. వీళ్లకు హెడ్మాస్టర్ పుణ్యమా అని ఈ దేశభక్తి పాటల డ్యూటీ. ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్ వాళ్లను వెతికి గ్రూపులు చేసి పాడించడం. మరి టెన్త్‌క్లాస్ వాళ్లో? వాళ్లకు పబ్లిక్ ఎగ్జామ్స్ కదా. చదువుకోవాలి. ఈ ఆపరేషన్‌కు దూరంగా ఉంచాలి. అయితే ఒక సర్దా ఉందండోయ్. రిహార్సల్స్ పేరు చెప్పి పీరియడ్స్ ఎగ్గొట్టొచ్చు. ఐవోర్ల స్టాఫ్‌రూమ్‌లో రిహార్సల్స్. ప్రతిసారీ అవే పాటలు. బ్యాచ్‌లు మారతాయంతే.‘వందేమాతరం.. సుజలాం.. సుఫలాం.. మలయజశీతలాం’..‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’...‘పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి విజయగీతికా’...‘సారే జహాసే అచ్ఛా హిందూసితా హమారా’...‘జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’...‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’....అదేంటోగాని ఆగస్టు పదిహేనుకు ఫండు పిల్లలే తేవాలి. రంగు కాగితాలకీ, చార్ట్లకీ, పురికొసలకీ. ఇంట్లో అడగాలి. ఎంత? పావలా... అర్ధరూపాయి... అమ్మో అన్ని డబ్బులే. మరి 1985–86ల్లో అవి పెద్ద డబ్బులే. కొందరు తెచ్చేవారు. కొందరు మెదలకుండా ఉండేవాళ్లు. క్లాసులో ఎవడైతే పరమ బేవార్సు స్టూడెంట్‌గా ఉంటాడో వాడికి రంగు కాగితాలు కట్ చేయడంలో, రంగురంగుల త్రికోణాలు పురికొసకు అంటించి వేళ్లాడగట్టడంలో తోట తరణి అంత అనుభవం ఉంటుంది. వాడికి సేకరించి ఐదురూపాయల పావలా ఇస్తే తుర్రున బుక్‌స్టోర్‌కు పరిగెత్తి రంగు కాగితాలూ కత్తెర కొని ఒక టీమ్‌తో మైదా పిండి ఉడకబెట్టించి ఆ పనిలో ఉంటాడు. బోర్డును నీటుగా కడిగి, తడిపిన రంగు చాక్‌పీస్‌లతో ‘స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని అందంగా రాసే స్టూడెంట్లు ప్రతి క్లాస్‌లో ఒకరో ఇద్దరో ఉంటారు. వీరు మ్యాథ్స్‌లో వీక్... డ్రాయింగ్‌లో ఫస్ట్. ఈ డ్యూటీ వారిది.అయితే ప్రతి సెక్షన్ వారికీ ఈ ఆగస్టు 15న కాస్త కుళ్లు ఉండేది ఒకే ఒక వ్యక్తి మీద. వాడు ఎస్.పి.ఎల్. ఆ రోజు వాడి డాబు, దర్పాన్ని ఆపేవాడుండదు. అందరూ యూనిఫామ్ వేసుకుంటే వాడు ఎన్సిసి డ్రస్సు లాంటిది వేసుకొని ఎర్రబంతి వేళ్లాడే ఖాకీ క్యాప్ పెట్టుకొని ఏ పోలీస్ ఆఫీసరులానో ఉంటాడు. వాడు ‘అటెన్షన్’ అంటే అటెన్షన్. వాడు ‘స్టాండ్ ఎట్ ఈజ్’... అంటే తెరిపి. జెండా ఎగరేయడానికి వీడు మార్చింగ్ చేస్తూ హెడ్మాస్టర్ని, చీఫ్గెస్టునీ తీసుకొస్తాడు. జెండా ఎగరేశాక వీడు సెల్యూట్ కొడితే హెడ్మాస్టర్ వీడికి సెల్యూట్ కొడతారు. మిగిలిన పిల్లలకి ఈ చాన్స్ ఎక్కడా? అందుకే వాడంటే కొంచెం ఇది.ఆగస్టు పదిహేనుకు పూలు తెచ్చి జెండాలో పెట్టే పని టీచరమ్మలది. పూలున్న జెండాను పొట్లంలా చుట్టి జెండాకర్ర కొసాకు పంపించడం, తాడు లాగినప్పుడు జెండా విడివడి పూలు అందరి మీద పడేలా కట్టడం అందరికీ వచ్చనుకుంటున్నారా? రాదు. దానికి పీఈటీ వోరు ఎక్స్పర్ట్. ఆయనే అది చేయాలి. మనం చేస్తే తాడు లాగితే జెండా ఊడదు. పరువు పోతుంది. అందుకని ప్రతి ఆగస్టు 15న తాడు లాగితే జెండా ఎగరుతుందా లేదా అని అదో టెన్షన్.ప్రతి స్టూడెంట్ బాగా ఉతికిన యూనిఫామ్ ఇస్త్రీ చేయించుకొని మరీ ఆ రోజున వేసుకోవాలి. చెంబిస్త్రీ, చేటిస్త్రీ తప్పదు. పాపం హాస్టల్ పిల్లలు శుభ్రమైన బట్టలు వేసుకొచ్చినా వారికి ఇస్త్రీ వీలు లేకపోవడంతో చిన్నబుచ్చుకునేవారు. ఫ్రెండ్సు వారితో చేరి ‘ఏం పర్లేదు లేరా. మీ చొక్కాలే మా చొక్కాల కంటే తెల్లగా ఉన్నాయి’ అని ఉత్సాహపరిచేవారు. వారు నూనె రాసుకున్న తలలతో తెల్లగా నవ్వేవారు.రోజూ స్కూలు ఉదయం తొమ్మిదికైతే ఆ రోజున ఎనిమిదికే సిద్ధం. గ్రౌండ్లో సుద్దపొడి వేసి లైన్లు కొట్టి ఒక్కో సెక్షన్ ఒక్కో లైన్లో నిలబడేలా చేసేవారు. జెండా కర్ర దగ్గర స్టేజ్. ఊరి ఆర్డివోనో తాసిల్దారో రిటైరై వెళ్లిపోయిన హెడ్మాస్టరో చీఫ్ గెస్టు. టిఫిన్ చేసొచ్చిన పిల్లలూ... చేయకుండా వచ్చిన పిల్లలూ... చాక్లెట్లు ఎన్ని పంచొచ్చో ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్న పిల్లలూ... వీళ్లు మళ్లీ ఇంట్లో తోబుట్టువులకు హామీ ఇచ్చి వచ్చి ఉంటారు... చాక్లెట్లు తెచ్చిస్తా అని. అదొక టెన్షన్. హెడ్మాస్టర్ మూడ్ బాగుంటే రెండు పెద్ద పెద్ద పళ్లేలు తెప్పించి మూడు నాలుగు రకాల చాక్లెట్లు పోయించి, నయాపైసాకు ఒకటి వచ్చే బ్రిటానియా రౌండ్ బిస్కెట్లు వాటిలో కలిపి, మిశ్రీ ముక్కలు కూడా మిక్స్ చేసి గుప్పెడు గుప్పెడు పంచితే అదీ కిక్కు. పాపం కొన్ని వీధి బడుల్లో బొరుగుల్లో బెల్లం ముక్కలు కలిపి పంచేవారు. ఆ స్కూళ్ల ఆగస్టు 15కు పిల్లలు వెళ్లేవాళ్లు కాదు.అయితే చాక్లెట్లు, బిస్కెట్లు అంత సులువుగా రావు. ఎండ వాయకొడుతున్నా లెక్కచేయకుండా జెండా వందనం చేయించి, దేశభక్తి గీతాలు పాడించి, గెస్టు స్పీచు, హెడ్మాస్టరు స్పెషలు స్పీచు ఇచ్చి... దేశం తాలుకు బాధ్యతలన్నీ ఆ పూట ఎదురుగా నిలుచున్న పిట్ల ప్రాణాలకే అప్పజెప్పేసేవారు. నేటి బాలలే రేపటి పౌరులు అనేసేవారు. ఆ బాలలేమో స్కూల్లేదు కదా... మధ్యాహ్నం మేట్నీకి డబ్బులెలా అనే మనాదిలో ఉంటారు.ఇన్నింటి మధ్య కూడా ఆగస్టు పదిహేను బాగుండేది. స్కూల్లోని ప్రతి క్లాసు రంగు కాగితాలతో రెపరెపలాడేది. ప్రతి గుండె మీద త్రివర్ణపతాకం గుండు పిన్నుతో అంటుకుపోయేది. ప్రతి పెదవి మీద గాంధీ నెహ్రూ సుభాసుబోసు భగత్సింగుల పేరు పలికేది. ‘హమ్ బుల్బులేహై ఇస్కే ఏ గుల్‌సితా హమారా’... ఈ దేశపు గువ్వపిట్టలం... రెక్కలు సాచి ఎగురతాం అని పాడుతూ ప్రతి చిన్నారి హృదయం ఆకాంక్ష చేసేది. పొందికైన బట్టల్లో టీచర్లు, ఉపాధ్యాయులు హుందాగా కనిపించేవారు. ప్రతి పీరియడ్కూ బెల్లు కొట్టే ప్యూన్ ఆ రోజు చాక్లెట్లు పంచుతూ చక్కగా నవ్వేవాడు. క్లాసులు చిమ్మే ఆయమ్మ కొప్పులో చామంతులు పెట్టుకొని కొత్తగా కనిపించేది. అందరం పెద్దయ్యి దేశం కోసం ఏదో ఒకటి చేయాలని కాసేపైనా గట్టిగా అనిపించేది. ఇక రోజూ చేసే ప్రతిజ్ఞ ఆ రోజు మరింత ప్రత్యేకంగా ఉండేది. ‘నేను నా సహోదరులను ప్రేమించుచున్నాను’.... ఈ ఒక్కలైను భవిష్యత్తు సమాజాన్ని నిర్మించేది. ‘ఈ దేశ సంపదకు అర్హుడనవ్వడానికి సదా కృషి చేస్తాను’ ఈ లైనూ ముఖ్యమే.మనం అర్హులమై ఉండాలి. మనం మన సమాజాన్ని ప్రేమించడానికి. మనల్ని మన దేశం ప్రేమించడానికి. పాఠశాల మరో తల్లి గర్భం. అక్కడ పొందే జవసత్వాలు, బుద్ధి కుశలతలు, చదువూ సంస్కారాలు... ఇవే నిజమైన దేశభక్తి. ఇవే నిజమైన ఆగస్టు 15. ప్రతి తరాన్ని ‘అర్హులైన తరం’గా మలచగలినంత కాలం మన దేశ ఖ్యాతికీ, దీప్తికీ ఢోకా లేదు. అలా జరిగినంత కాలం విశ్వానికి మనమే ‘భాగ్య విధాతలం’. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి... భరతమాతకు ప్రతిరూపమే. ఏ తల్లిబిడ్డలైనా అందరూ భరతమాత బిడ్డలే.జెండా ఊంచా రహేగా హమారా.భారతమాతాకీ జై. జైహింద్!విదేశీ గడ్డపై మన జెండా!జర్మనీలోని స్టట్‌గార్డ్‌లో 1907లో జరిగిన ఒక విప్లవ సమావేశంలో భారతదేశ స్వాతంత్య్ర ఆకాంక్షలను చాటి చెప్పేలా డిజైన్ చేసిన ఒక జెండా (ఇప్పటి జాతీయ జెండా కాదు)ను ఎగరేశారు భికాజీ కామా. విదేశీ గడ్డపై మన జెండా ఎగరేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.గాంధీ గారి రేడియోనానిక్ మోత్వానీ అనే వ్యాపారవేత్త అమెరికా, ఇంగ్లాండ్‌ల నుంచి రివర్స్–ఇంజినీర్ యాంప్లిఫయర్స్, మైక్రోఫోన్స్, లౌడ్స్పీకర్లను దిగుమతి చేసుకొని ‘చికాగో రేడియో’ ప్రారంభించారు. ఈ రేడియో మహాత్మాగాంధీ ప్రసంగాలను విస్తృతంగా ప్రసారం చేసేది. స్వాతంత్య్ర సమరయోధులు రహస్య, భూగర్భ నెట్‌వర్క్‌లను నడపడంలో మోత్వానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సాంకేతిక పరికరాలు ఉపయోగపడ్డాయి.క్యాట్ ఆర్మీస్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారిపై నిరసన కార్యక్రమాలు సృజనాత్మకంగా, ఆకట్టుకునేలా రూపొందించేవారు. శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో సూరత్‌లో క్యాట్ ఆర్మీ(మంజరి సేన) అనే సంఘంలోని మహిళలు జాతీయజెండా రంగులలో ముంచిన ఖాదీ వస్త్రాలు ధరించి బ్రిటిష్ అధికారులను ధిక్కరించారు. ∙సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగినప్పుడు లక్నోలాంటి నగరాల్లో ‘సైమన్ గో బ్యాక్’ అని రాసి ఉన్న గాలిపటాలను ఎగరేశారు.అసామాన్య మహిళలుకొత్తగా వెలుగులోకి వచ్చిన బీబీసి వారి ఫొటో ఆర్కైవ్‌లో.... ఉప్పు సత్యాగ్రహంలో సామాన్య మహిళలు ఎంత ధైర్యసాహసాలు, అంకితభావంతో పాల్గొన్నారో, శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎలా నడిపించారో కళ్లకు కట్టే ఫొటోలు ఉన్నాయి. పోలీసులను బహిరంగంగా సవాలు చేశారు, మాటకు మాట బదులిచ్చారు మహిళా స్వాతంత్య్ర సమరయోధులు.నివేదిత వజ్ర ఫ్లాగ్సిస్టర్ నివేదిత 1904లో భారత జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. ‘నివేదిత వజ్ర ఫ్లాగ్’ అని పిలిచే ఈ జెండాలో ఎరుపు, పసుపు రంగుల నేపథ్యం, తెల్లని తామరపువ్వుతో కూడిన వజ్రం చిహ్నం, వందేమాతరం నినాదం కనిపిస్తాయి.దండి యాత్రలో అతి పిన్న వయస్కుడుఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ సబర్మతి ఆశ్రమం నుండి ‘దండి యాత్ర’ ప్రారంభించారు గాంధీజీ. భారతదేశంలో వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ మార్చ్‌లో పాల్గొన్న వారిలో అత్యంత పిన్న వయస్కుడు పదహారేళ్ల విఠల్ లీలాధర్ ఠక్కర్. -
ఎలుగెత్తి చెబుదాం గొంతెత్తి పాడుదాం
పిల్లలు నోరు తెరిచి దేశం గురించి మాట్లాడే రోజు ఆగస్టు 15. గొంతెత్తి దేశభక్తిని గానం చేసేరోజు మన స్వాతంత్య్ర దినోత్సవం. సంవత్సరంలో 364 రోజులు వారు ఫోనులోనో గేమ్స్లోనో మునిగి ఉన్నా ఈ ఒక్కరోజైనా వారి చేత దేశం గురించి మాట్లాడించాలి. దేశ ఘనతను పాడించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల చేత కనీసం ఒక పాట పాడించాలి. ఐదు నిమిషాలు మాట్లాడించాలి. ఏ పాటలు? ఏ మాటలు? ఇవిగోండి సలహాలు... ‘దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టొయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్’... అన్నారు గురజాడ. ‘దేశమును ప్రేమించాలి’ అని పిల్లలకు తెలుసు. కాని దేశంలో మంచి పెరిగితేనే అది ప్రేమించ దగ్గ దేశమవుతుందని, దేశంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగినప్పుడే అది గొప్ప దేశమవుతుందని గురజాడ చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇలాంటి ఒక పాటైనా పిల్లల చేత పాడించకపోతే తల్లిదండ్రుల పెంపకంలో నిర్లక్ష్యం ఉన్నట్టే అర్థం. ‘చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడవ వలెనోయ్... అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్’ అని కూడా గురజాడ అన్నారు. ఇవాళ్టి సందర్భంలో పిల్లలకు ఈ పాట నేర్పి, దాని అర్థం మనసుకు ఎక్కించకపోతే భవిష్యత్తులో వారు ‘దేశమంటే మట్టే’ అనుకుంటారు. ‘మనుషులు’ అనుకోరు. త్యాగఫలం తెలియచేయాలి ఇవాళ మనం పీలుస్తున్న ప్రతి శ్వాస మన పూర్వికుల రక్తం, చెమట, త్యాగం ఫలితం. మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి భావితరాల చేతుల్లో పెట్టారు దేశాన్ని. ఎంతో విలువైన ఈ దేశ సంపద, దేశ సంస్కృతి పట్ల పిల్లలకు గౌరవం, బాధ్యత తెలియాలంటే వారిలో జాతీయ భావాలు, సుహృద్భావం కలగాలంటే ఆగస్టు 15ను ఒక సందర్భంగా చేసుకుని తెలియచేయాలి. ఇవాళ దురదృష్టవశాత్తు కొన్ని ఇళ్లల్లో పిల్లలకు తెలుగు నేర్పించడం లేదు. కొన్ని స్కూళ్లలో పిల్లలు జెండా వందనం రోజు జైహింద్ చెప్తే సరిపోతుందనుకుంటున్నారు. కనీసం ఒక బృందగానంలో కూడా పాల్గొనడం లేదు... వక్తృత్వంలో నాలుగు ముక్కలు దేశం గురించి మాట్లాడటం లేదు. అందుకే తల్లిదండ్రులు పూనుకుని తమ ప్రతి పిల్లల చేత అయితే తమ అపార్ట్మెంట్లో, లేదా తమ వీధిలో, ఇంట్లో ఏదో విధాన ఒక పాట పాడించడం, దేశం గురించి తప్పకుండా నాలుగు ముక్కలు మాట్లాడించడం అవసరం. పిల్లలు సరిగ్గా చెప్తే వింటారు. నేర్చుకుంటారు. వారికి ఆ వేళ విశేషమైన దుస్తులు, దేశభక్తులు వేషాలు వేస్తే ఎంతో సంబరపడతారు. ఆ స్ఫూర్తిని నింపుకుంటారు. ఆగస్టు 15 అంటే సెలవు దినం, ఆ రోజు ఎటైనా వెళ్లొద్దాం అని ప్లాన్ చేసుకునే తల్లిదండ్రులు పిల్లలను దేశం వైపు నడిపించడంలో నిర్బాధ్యతగా ఉన్నట్టే లెక్క. ఎన్నో పాటలు పిల్లలు నేర్చుకుని పాడటానికి తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో పాటలు ఉన్నాయి. ప్రయివేటు గీతాలతో పాటు సినీ గీతాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి నేర్పించవచ్చు. ‘దేశమును ప్రేమించుమన్నా’ (గురజాడ), ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ (శంకరంబాడి), ‘జయజయ ప్రియభారత జనయిత్రి’ (దేవులపల్లి), ‘తేనెల తేటల మాటలతో’ (ఇంద్రగంటి శ్రీకాంత శర్మ), ‘మాకొద్దీ తెల్లదొరతనము’ (గరిమెళ్ల), ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ’ (వేములపల్లి శ్రీకృష్ణ)... ఇవన్నీ ఉన్నాయి. ఇక సినిమా పాటల్లో ‘పాడవోయి భారతీయుడా’ (శ్రీశ్రీ) పిల్లలు పాడటానికి సులువుగా ఉంటుంది. మన పిల్లలకు ‘వందేమాతరం’, ‘జనగణమన’, ‘సారే జహాసే అచ్ఛా’ కనీసం వచ్చునా రావా అన్నది కూడా గమనించుకుంటే మంచిది. దేశం గురించి మాట్లాడాలి పిల్లలు దేశం గురించి, దేశ ఔన్నత్యం గురించి మాట్లాడాలి. మాట్లాడటంలో వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఏం మాట్లాడాలన్న విషయంలో కొంచెం సాయం చేసినా పర్వాలేదు. ‘భిన్నత్వంలో ఏకత్వం’, ‘మన జాతిపిత’, ‘దేశాభ్యున్నతికై పర్యావరణ పరిరక్షణ’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్త్రీ శక్తి’, ‘సామాజిక బాధ్యత’... ఇలా ఏదో ఒక అంశం ఇచ్చి ఐదు నిమిషాలు మాట్లాడేలా చేయాలి. ఇది ఒక సంప్రదాయం. ఒక తరం నుంచి మరో తరానికి అందాలి. అమృతోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయడంలో పిల్లలను భాగస్వాములను చేయాలి. దేశ పతాకం పిల్లల చేతుల్లో రెపరెపలాడాలి. దేశభవిష్యత్తుకు వారే విధాతలు కావాలి. -
వీధి వీధినా వాడవాడలా మార్మోగే పాట ఇది!
స్వాతంత్య్ర దినోత్సవం వచ్చినా, గణతంత్ర దినోత్సవం వచ్చినా వీధి వీధినా వాడవాడలా మార్మోగే పాట ఒకటి ఉంది. అదే ‘కర్ చలే హమ్ ఫిదా జాన్ ఒ తన్ సాథియో.. అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో’ పాట. ఇది 1964లో వచ్చిన ‘హకీకత్’ సినిమాలోని పాట. ధర్మేంద్ర, బల్రాజ్ సహానీ ప్రధాన తారాగణం. 1962లో జరిగిన ఇండో–చైనా యుద్ధ నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఆ యుద్ధం మీద వచ్చిన తొలి హిందీ సినిమా కూడా. లడాక్‌లో వొరిజినల్ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. చేతన్ ఆనంద్ దర్శకుడు. ఇండో చైనా వార్‌లో మనం ఓడిపోయాం. కాని ‘రెజాంగ్ లా’ అనే చోట 120 సైనికులు ఉన్న మన బృందం చైనా సైనికుల పై పైచేయి సాధించింది. అందులో 114 మంది మనవారు చనిపోయారు. చైనా సైనికులు భారీగా చనిపోయారని అంటారు. మొత్తం మీద ఆ ఒక్క స్థలంలో మనవారు తమ బలిదానంతో భారత భూభాగాన్ని నిలుపుకోవడాన్ని కథగా తీసుకొని దర్శకుడు చేతన్ ఆనంద్ ‘హకీకత్’ తీశాడు. నిజానికి ఇది ప్రభుత్వం చెప్పాలనుకున్న ‘హకీకత్’ (వాస్తవం). చైనా యుద్ధానికి కారణం చైనా తప్పిదమే అనే నెహ్రూ అభిప్రాయానికి ప్రచారం ఇచ్చిన సినిమా ఇది. విశేషం ఏమిటంటే దేశభక్తి కలిగిన ఈ సినిమాలో పని చేసినందుకు వామపక్ష భావజాలం ఉన్న చేతన్ ఆనంద్, కైఫీ ఆజ్మీ, బల్రాజ్ సహానీ రూపాయి డబ్బు కూడా తీసుకోలేదు. దీని క్లయిమాక్స్‌లో గెలిచినా కూడా ప్రాణాలు కోల్పోయిన సైనికుల మృతదేహాల నేపథ్యంలో విషాద భరితంగా ఒక పాట కావాల్సి వచ్చింది. ఆ పాటను విజయ్ ఆనంద్ కైఫీ ఆజ్మీ చేత చేయించాడు. మదన్ మోహన్ దానికి బాణీ కట్టాడు. కర్ చలే హమ్ ఫిదా జాన్ ఒ తన్ సాథియో అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో... అంటే ‘మీ కోసం మా దేహప్రాణాలను బలిదానం చేశాం. దేశాన్ని మీకు అప్పగించి వెళుతున్నాం’ అని తోటి సైనికులకు, దేశప్రజలకు సైనికులు చెబుతున్నట్టుగా ఉండే పాట ఇది. ఐదు నిమిషాలకు పైగా వచ్చే ఈ పాట సినిమా సైనికుల మృతదేహాలను... నిజ సైనికశకటాలను చూపుతూ భావోద్వేగంగా ఉంటుంది. మహమ్మద్ రఫీ పాడిన విధానం శోకాన్ని, గగుర్పాటును, దేశభక్తిని కలిగించేలా ఉంటుంది. అందుకే ఆ పాట వచ్చి దాదాపు 60 ఏళ్లు అవుతున్నా నేటికీ వినపడుతూ ఉంది. అయితే ఈ సినిమా రిలీజుకు ముందే నెహ్రూ మరణించారు. ఈ సినిమాను నెహ్రూకు అంకితం ఇచ్చారు. ఎందరి బలిదానాలో ఈ దేశం మట్టిలో ఉన్నాయి. ఎందరి త్యాగాల ఫలితమో ఇది. అందరూ దీనికోసం ప్రాణాలు వొడ్డారు. ఈ దేశం అందరిది అనే భావనను పునశ్చరణ చేసుకోవాల్సిన సందర్భం ఇది. -
శ్రీకారాలు - శ్రీమిరియాలు
పేరడీ రచనకు ఆద్యులు నిన్న మొన్నటి దాకా తెలుగు నేలన ప్రతిధ్వనించిన కొన్ని పద్యపాదాలు ఇప్పటికీ చెవుల్లో రింగుమంటుంటాయి. ‘‘అల్లుడా రమ్మని ఆదరంబున బిల్వ..., నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్, భరతఖండంబు చక్కని పాడియావు’’ ఇవేగాక పసిబిడ్డబాలాది పాడుకున్న చాలా పద్యాలు రచించిన మహాకవి చిలకమర్తి లక్ష్మీనరసింహం. వందేళ్ల తరువాత చేయాల్సిన ప్రయోగాల్ని, చేపట్టాల్సిన ప్రక్రియల్ని వందేళ్ల క్రితమే చేపట్టారు. దేశభక్తి గేయాలు, గయోపాఖ్యానం లాంటి పద్య నాటకాలు, అనేకానేక ప్రహసనాలను రచించి తెలుగు సాహిత్యాన్ని తెలుగుజాతిని చైతన్యపరిచారు. చిలకమర్తి 1867లో పుట్టారు. టంగుటూరి ప్రకాశంకి సమకాలికులు, ఆప్తులు. చిలకమర్తి రూపొందించిన అనేక పాత్రలను ప్రకాశం ధరించారు. ఆ రోజుల్లో ప్రకాశం స్త్రీ పాత్రలను కూడా ధరించి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో హాస్యం చిలకమర్తితోనే శ్రీకారం చుట్టుకుంది. నూటపాతిక సంవత్సరాల క్రితమే తెలుగులో పేరడీ ప్రక్రియను చిలకమర్తి చేపట్టారు. ‘‘లండను సంకల్పము’’ అనే ప్రహసనంలో లండన్‌లో ఉన్నవాడు సంకల్పం ఎలా చెప్పుకుంటాడో చెప్పారు. ‘‘లండన్ వే స్వాహా, జూశసేస్వాహా, జుహావాదేవశ్య ధీమహే, ధీయో యోనః ప్రబోదయాత్ - మమ ఉపాక్త ధనవ్యయ ద్వారా కాంటినెంటల్ టూర్ సంప్రాప్తర్థం... అఖండ ధ్యేమ్యునద్యాం అంటూ సాగుతుంది. అర్థం లేని ఆచారాలను, వ్యవహారాలను తీవ్రంగా నిరసించారు. మన వ్రతాలు నోముల కథల్లో నైమిశారణ్యం, శౌనకాది మునులు, సూతమహర్షి తప్పక వినిపిస్తాయి. రుషులకు మహర్షులకు వచ్చే ధర్మ సందేహాలకు సూతమహర్షి జవాబులు చెబుతూ ఉంటాడు. ఇదే సంప్రదాయంలో కథ చెబుతూ కొన్ని పేరడీ ప్రశ్నల్ని జవాబుల్ని చిలకమర్తి హాస్యస్నోరకంగా అందించారు. నల్లుల బాధ భరించలేకనే విష్ణుమూర్తి శేషతల్పాన్ని ఆశ్రయించాడట. చాకితోడ జగడాలు పడలేక సిరిగలాడు పట్టుచీరెగట్టి శివుడు తోలు గప్పె, ఛీయని మదిరోసి భైరవుండు చీరపారవేసె అందుకని శివుడు దిగంబరుడైనాడని తీర్మానించారు. భగవద్గీతలో సృష్టిలోని సర్వోత్తమ వస్తువులన్ని నేనేనని చెప్పే ఘట్టాన్ని హాస్యానుకరణ చేశారు. ‘‘వృక్షములలో గంజాయి మొక్కను నేను. జంతువులలో పెద్దపులిని నేను. ప్రాకెడి పురుగులలో పామును నేను. లంచము నేను, లంచమిచ్చిన సొమ్మును నేను, లంచము తెచ్చిన రాయబారిని నేను. ... వేయేల సమస్తం నేను’’ అంటూ పెద్ద జాబితాతో ముగించారు. అతి ప్రాచీనంలోకి వెళ్లి, మూలాలను కదిలించి నవ్విస్తూ చురకలు వేయడానికి పలుకే కాదు ధైర్యం కూడా కావాలి. ఆనాడు చూపిన వ్యంగ్య ధోరణులను చాలామంది అందిపుచ్చుకున్నారు. 1915లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా గ్రంథాలయ వార్షికోత్సవానికి చిలకమర్తిని అధ్యక్షునిగా ఆహ్వానించారు. రావిచెట్టు లక్ష్మీనరసమ్మ గారింట్లో బస ఏర్పాటు చేశారట. ఆ సభలో సరోజిని నాయుడు, సర్ హైదరాలీ సమక్షంలో చిలకమర్తిని సన్మానించారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమానికి పూనిక మాటపాటి హనుమంతరావు. ఏమైనా ఈ బహుముఖ ప్రజ్ఞాశాలిని తెలుగుజాతి ఒకసారి స్మరించుకోవాలి. ఫోర్జరీ! ‘‘నన్ను, నా నడకని, నా నవ్వుని ఫోర్జరీ చేసేస్తున్నాడు. ఆఖరికి నా బతుకుని కూడా ఫోర్జరీ చేసి బతికేస్తున్నాడు’’ ‘‘అదెలాగ?’’ ‘‘నే పెళ్లి చేసుకుంటే వాడూ చేసుకున్నాడు నే కాపరం పెడితే వాడూ పెట్టాడు. నాకిద్దరు పిల్లలు. వాడికీ ఇద్దరు. మొన్నామధ్య విసిగి వేసారిపోయిన నా భార్య నన్నొదిలేసి వెళ్లిపోయింది. విసిగించి వాళ్లావిడ వెళ్లిపోయేలా చేసాడు. ఫోర్జరీ....’’ అంటూ నిట్టూర్చాడు. చెప్పు! డబ్బులు లేక చెప్పులు కొనలేకపోతున్నా. డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా. ఈ సంగతెవరికీ ‘‘చెప్పుకొనలేక’’పోతున్నా. - శ్రీశ్రీ ఫలానా వారి కూతుర్ని, ఫలానా వారి కోడల్ని నాకు గోమయం అంటే తెలియదా అని గోంగూర తెచ్చినట్టు! - తెలుగు నానుడి కాలం ఆ గదిలో గోడగడియారం అయిదు గంటల యాభై రెండు నిమిషాల దగ్గర ఆగిపోయింది. ఇంటి యజమాని వయోవృద్ధుడు. ఆ గదిలోనే పడుకుంటాడు. ఎదురుగా దాన్నే చూస్తూ పొద్దు పుచ్చుతాడాయన. ఆ పాత గడియారాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆగిపోయి, రోజూ రెండుసార్లు మాత్రమే సరైన వేళ చెబుతూ గోడకి అంతుక్కుపోయి ఉందా గడియారం. పెద్దాయన ఓపిగ్గా ఉన్నన్నాళ్లూ దానికి ‘కీ’యిచ్చి నడిపిస్తుండేవాడు. తిరగడానికి, గంటలు కొట్టడానికి రెండు చోట్ల దానికి కీ ఇవ్వాలి. రుతువుని బట్టి లోలకం పొడుగుని సవరించాలి. ఇవన్నీ యజమానికి తెలుసు. ఒక రోజు ఆయన కన్ను మూశాడు. సరిగ్గా అయిదు గంటల యాభై రెండు నిమిషాలకే. దీనికి ఏమైనా శాస్త్రీయ కారణం ఉందా? ఆగిపోయిన వేళ గురించి ఆయన మనసులో ఆలోచన ఉందా? ఏమో, తెలుసుకోవాలి. ఆశాజీవి మన పురాణాలలో వినవచ్చే కామధేనువు, కల్పతరువు చాలా విశిష్టమైనవి. అవి రెండూ యజమాని ఏమి కోరినా ఇస్తాయి. అంటే తరగని వరాలు పెరట్లో ఉన్నట్టే. అందులో ఒకటి జంతువు, మరొకటి వృక్షం. ఇదంతా పురాణం అనేవారు సైతం నిర్మాతల ఊహని మెచ్చాల్సిందే. వాటిని నిగ్రహశక్తికి, సహనానికి సంతృప్తికి పరీక్షలుగా నిలిపారు. కామధేనువు ఏది కోరినా ఇస్తుంది. అట్లాగని అది అధీనంలో ఉన్నవారు పుట్లకొద్దీ బంగారం సంపాయించి నేల పాతర్లు వేయలేదు. కోరితే నవరత్న రాశుల్ని కురిపించగల కల్పతరువుని వజ్ర వైఢూర్యాలకై వేధించలేదు. నిగ్రహం, సంతృప్తి పుష్కలంగా ఉన్నవారి దగ్గరే ఇవి ఉన్నాయి. వాటిని స్వార్థానికి, పదవులు కాపాడుకోవడానికి వినియోగించుకోవాలనేవారికి అవి దక్కలేదు. నిరాడంబరమైన జీవితం గడిపేసరికి మామూలు గోవి కామధేనువుగా, కాసే పూసే మామూలు చెట్టు కల్పతరువుగా అనిపిస్తాయి. మనిషి అత్యాశ వల్ల, తీరని దాహం వల్ల నదుల్ని ఎండగడుతున్నాడు, అడవుల్ని ఎడారులు చేస్తున్నాడు. భూగర్భ నిధుల్ని తోడేసి భూమిని గుల్ల చేసేస్తున్నాడు. మనిషి ఆశని పూరించే శక్తి నక్షత్ర మండలానికి కూడా ఉండదు. నిర్వచనం పెద్ద పెద్ద దొరలు, బంగళాల్లో ఉండేవారు ఎక్కువగా తింటారు కాబట్టి బంగాళాదుంపలని పేరొచ్చింది. నిజానికవి మన కందమూలలే. ప్రాచీన రుషులు చిలకడదుంపలతో పాటు వీటినీ తినేవారు. బంగాళాదుంప మన తెలుగు సంప్రదాయం. వి॥ పెన్ డ్రాప్స్ - అంబేద్కర్‌ని ఒక్కసారి వెలుగులోకి తెచ్చారు. ఇప్పుడాయన ఔన్నత్యాన్ని, కీర్తి ప్రతిష్టల్ని పంచుకునే పనిలో పడ్డారు. సింహభాగాల కోసం తహతహలాడుతున్నారు. - లోక్‌సభకి గాని రాజ్యసభకి గాని సభ్యులు సైకిళ్ల మీద రావొద్దు. టీడీపీకి ప్రచారం కల్పించవద్దు. - భాజపా. - చంద్రబాబు తెలుగు గడ్డ మీద కంటే మిగతా భూగోళం మీద గట్టిపట్టు సాధిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. - శ్రీరమణ


