సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ తన కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం, తన నుండి వివరణ కోరడం ఎంతమాత్రం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు మంత్రి కొండా సురేఖ అధికారిక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మంత్రి స్పందిస్తూ.. ‘సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకానీ ఆ వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ నాకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కొండా సురేఖ కోరారు.
కుటుంబ సభ్యుల వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలకు పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను ముడిపెట్టడం సరికాదని, ఈ విషయంలో తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ కొండా సుష్మిత ఏమన్నారంటే?
'సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోంది. అచ్చ కాంగ్రెస్‌కు స్థానం లేకుండా చేస్తున్నారు'అని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్‌లో కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు.
‘ఎప్పుడూ ఏం మాట్లాడతారో సీఎంకు తెలియదు. సంగారెడ్డికి వెళ్లినపుడు జగ్గారెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరతారు’అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే సీఎం కాదన్నారు. తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా, రాహల్, ప్రియాంకలను గౌరవిస్తామన్నారు.
పరకాలనుంచి తాను ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని చెప్పారు. ‘బీసీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వారు వచ్చి చెబుతున్నారు. మంత్రులు సంతకాలు పెట్టిన పనులూ జరగటం లేదు. టీపీసీసీ అధ్యక్ష పదవికి నా తల్లిదండ్రులే రేవంత్ రెడ్డిని ప్రతిపాదించారు. అధ్యక్షుడైన తర్వాత మా ఇంటికి వచ్చి నా తండ్రి మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మరచిపోయారు’అని పేర్కొన్నారు.
కోటమైసమ్మ, ఎల్లమ్మ గుడి వద్దకు వచ్చి ఆ మాట అనలేదని ప్రమాణం చేస్తారా అని సీఎంకు సవాల్ విసిరారు. తన తండ్రి తిరిగి ప్రచారం చేస్తే రేవూరి గెలిచాడని, అలాంటి నాయకుడు నీకు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. సీఎంకు కళ్లు నెత్తికె క్కాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం పనిచేసే దాన్నని,చావుకు కూడా భయపడనన్నారు.
నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు
'సీఎంతోపాటు ఒక 'పొంగు ఉంది. ఆ పొంగు ఎక్కువ సేపు ఉండదు. వీరిలో ఎవరూ సీఎం అనేది తెలియడం లేదు. హైదరాబాద్ ఇన్చార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటో పెట్టకుండా అక్కడి ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం, పొంగు ఫొటోలు పెట్టుకున్నారు. బీసీలంటే అంత చులకనా. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రయత్నించిన దయాసాగర్, షబ్బీర్ అలీ ఆయన సీఎం అయిన తర్వాత కలవడానికి వెళితే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు'అని సుస్మితా ఆగ్రహం వ్యక్తంచేశారు.
మూడేళ్లలో వేం నరేందర్రెడ్డి ఇచ్చిన సలహాలు ఏమిటో, వాటిని పాటించి సీఎం చేసిన పనులేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. సీఎం తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే రూ.200 కోట్ల విలువైన భూమిని అతడికి ధారాదత్తం చేశారని మండిపడ్డారు. అన్నా, తమ్ముడు రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము కాపోళ్లమని తమకు వ్యవసాయం చేయడం తప్ప ఊడిగం చేయడం రాదని, తాము పద్మశాలీలమని తమకు నేత చేయడం తప్పితే మోసం చేయడం రాదని అన్నారు.



