సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కివేసే ప్రయత్నం జరుగుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి వివాదాన్ని సర్దుమణిచే ప్రయత్నంలో భాగంగా కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కాగా, ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారన్న ప్రచారంపై ఆయన స్పందించారు.
కొండ సుస్మిత పటేల్ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు. మునుగోడు అభివృద్ధి నిధుల విషమై చర్చించేందుకు భట్టి విక్రమార్కను కలిశాను. నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని నేను. ఎంపీ, ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆనాడు ఫైట్ చేశా.
తెలంగాణ ఏర్పాటులో భాగస్వామ్యం లేని వాళ్ళు ఇవాళ విమర్శలు చేస్తున్నారు.నా పైన విమర్శలు చేసే వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటో గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కి వేసే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యమంలో లేనివాళ్లు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉండవచ్చు. కొండా సుస్మిత పటేల్ అంశాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. నాలాంటి ఉద్యమ నేతలను విమర్శ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం’అని హెచ్చరికలు జారీ చేశారు.


