జనవరిలో పనులకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

జనవరిలో పనులకు శ్రీకారం

Aug 27 2026 1:36 AM | Updated on Aug 27 2026 1:36 AM

సాక్షి, వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ ‘మామునూరు ఎయిర్‌పోర్ట్‌’కు ఏళ్లుగా పట్టిన గ్రహణం వీడనుంది. ఇప్పటికే కార్యాలయం, అభివృద్ధి పనుల కోసం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) రూ.496.86 కోట్లతో అంచనాలు వేసింది. విమానాశ్రయ నిర్మాణం కోసం రూ.203.49 కోట్లతో పిలిచిన టెండర్‌ పనులు జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జనవరిలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏఏఐ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల వేళ మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో కేంద్రం కీలకపాత్రపై చర్చ జరిగేలా చేసి, అనుకూలంగా మలుచుకునేందుకు ఉపయోగపడుతోందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా పీఎం మిత్ర కింద ఎంపిక చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు దశల వారీగా విడుదల చేస్తున్న నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రధాని మోదీ స్పీచ్‌లో చర్చకు వచ్చేలా చూసి, వరంగల్‌ నగర ఓటరు నాడిని పట్టుకోవాలనుకుంటోంది. స్మార్ట్‌సిటీ నిధుల విషయమై కూడా చర్చ పెట్టడం ద్వారా వరంగల్‌ నగర అభివృద్ధిలో కేంద్రం మార్క్‌ ఉందనడం ద్వారా పార్టీకి రాజకీయంగా కలిసొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌ నగరం వేదికగా అధికార కాంగ్రెస్‌ పార్టీలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు కూడా ఆ పార్టీకి నష్టం కలిగించే సమయంలోనే తమకు లాభించే అవకాశముందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఏదిఏమైనా కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాదిరిగానే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను కై వసం చేసుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తమ ప్రభావాన్ని చూపాలనుకుంటోంది. విమానాశ్రయ నిర్మాణం కోసం భూమి సేకరించి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమైన కాంగ్రెస్‌ పార్టీ దీన్ని ఓన్‌ చేసుకోవడంలో విఫలమవుతుండడం కూడా బీజేపీకి ప్లస్‌గా మారిందనే చర్చ రాజకీయ పార్టీల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు లాభిస్తుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

ఏఏఐ ఏం చేయనుందంటే..

ఈనెల 18న టెక్నికల్‌ బిడ్‌ ఓపెన్‌ చేయగా, సెప్టెంబర్‌ 7వ తేదీన ఫైనాన్షియల్‌ బిడ్‌ను తెరవనున్నట్లు ఇప్పటికే జూన్‌లో పిలిచిన టెండర్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే పర్యావరణ అనుమతుల ప్రక్రియ సాగుతోంది. జనవరిలో ఈ నిర్మాణ పనులు మొదలై 15 నెలల్లో పూర్తి చేసే అవకాశముంది. మెయింటెనెన్స్‌ రిపేర్‌ అండ్‌ ఓవరాల్‌, ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ సహా మరికొన్ని నిర్మాణాలకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.

ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్‌పోర్ట్‌ భూమి పూజకు ఏఏఐ సన్నాహాలు

గ్రేటర్‌ ఎన్నికల వేళ భూమిపూజతో వరంగల్‌లో చర్చ

పీఎంమిత్ర టెక్స్‌టైల్‌ పార్కు, స్మార్ట్‌సిటీ అభివృద్ధిపై కూడా ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement