భీమదేవరపల్లి: కటుంబ సభ్యురాలు మరణంతో తీవ్ర వేదనలో ఉన్నా సమాజహితం కోరి ఆ కుటుంబం నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచింది. మండలంలోని కొత్తకొండకు చెందిన లక్ష్మి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. జాతీయ నేత్ర దాన వారోత్సవాల ప్రారంభం రోజే ఆమె మరణించింది. ఆమె కుమార్తె లక్ష్మీదేవి మిగతా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో మృతురాలి కుమారుడు బుర్ర సమ్మయ్య, కోడలు సరళ కలిసి లక్ష్మీ కళ్లను దానం చేసేందుకు మందుకొచ్చారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రవణ్‌కుమార్, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్ మంగళవారం రాత్రి కళ్లను సేకరించారు. మరణంలోనూ అంధుల జీవితాల్లో వెలుగులు నింపినందుకు లక్ష్మీ కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శులు కుమారస్వామి, లింగమూర్తి, జిల్లా అధ్యక్షులు శంకర్ రావు, వేణుమాధవ్, ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ దళపతి తదితరులున్నారు.


