షాపింగ్, చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్ వినియోగం ఎంతగా పెరిగిందో.. అదే స్థాయిలో సైబర్ నేరాలు, కార్డుల దుర్వినియోగం సవాళ్లుగా మారుతున్నాయి. క్రెడిట్ కార్డ్ పోయినా లేదా చోరీకి గురై దాని ద్వారా మోసగాళ్లు లావాదేవీలు నిర్వహిస్తే ఆ ఆర్థిక నష్టాన్ని ఎవరు భరించాలి? వినియోగదారుడికి ఆ సొమ్ము తిరిగి వస్తుందా? దీనిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టమైన మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది.
సమయమే ప్రధానం
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, అనధికారిక లావాదేవీ జరిగినప్పుడు మీరు ఎంత వేగంగా నివేదిస్తారనే దానిపైనే మీ ఆర్థిక రక్షణ ఆధారపడి ఉంటుంది. సమాచారం అందుకున్న మూడు పనిదినాల్లోపు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే వినియోగదారుడిపై ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. మొత్తం నష్టాన్ని బ్యాంకే భరిస్తుంది. బ్యాంకు లోపం లేదా థర్డ్ పార్టీ వ్యవస్థల్లో భద్రతా వైఫల్యం వల్ల జరిగే మోసాలకు కూడా ఇది వర్తిస్తుంది.
ఫిర్యాదు చేయడంలో నాలుగు నుంచి 7 పనిదినాల ఆలస్యమైతే రూ.5,000 నుంచి రూ.25,000 వరకు (కార్డ్ పరిమితి ఆధారంగా) వినియోగదారుడే భరించాల్సి రావచ్చు.
ఏడు రోజులు దాటిన తర్వాత ఫిర్యాదు చేస్తే సదరు బ్యాంకు బోర్డు ఆమోదించిన నిబంధనల ప్రకారమే నిర్ణయం ఉంటుంది. అలాగే, పిన్ లేదా ఓటీపీ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల మోసం జరిగితే ఫిర్యాదు చేసేవరకు జరిగిన నష్టానికి కార్డ్‌హోల్డరే పూర్తి బాధ్యత వహించాలి.
10 రోజుల్లో డబ్బులు వెనక్కి
వినియోగదారుడు అనధికార లావాదేవీపై అధికారికంగా ఫిర్యాదు చేసిన పది పనిదినాల్లోపు సదరు మొత్తాన్ని (ప్రొవిజనల్ క్రెడిట్) తాత్కాలికంగా ఖాతాలో జమ చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది.
వెంటనే చేయాల్సిన పనులు
కార్డ్ పోయినట్లు గుర్తించిన వెంటనే బ్యాంక్ యాప్ లేదా కస్టమర్ కేర్ ద్వారా కార్డ్‌ను బ్లాక్ చేయాలి. ఫిర్యాదు సమయం సక్రమంగా నమోదయ్యేలా ఈమెయిల్ లేదా రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చి ట్రాకింగ్ నంబర్‌ను భద్రపరుచుకోవాలి. సమయస్ఫూర్తితో స్పందిస్తేనే క్రెడిట్ కార్డ్ మోసాల వల్ల కలిగే ఆర్థిక నష్టం నుంచి కాపాడుకోవచ్చు.
ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?


