యూపీఐ ఛార్జీలపై మరోమారు ప్రకటన! | NPCI Says GST on UPI MDR Will Not Burden Small Merchants | Sakshi
Sakshi News home page

యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన!

Sep 22 2026 3:58 PM | Updated on Sep 22 2026 4:06 PM

NPCI Says GST on UPI MDR Will Not Burden Small Merchants

యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌)కు జీఎస్టీ విధిస్తారని, దీంతో డిజిటల్ చెల్లింపులు ఖరీదవుతాయని, ముఖ్యంగా చిన్న వ్యాపారులపై భారం పడుతుందని కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కోరుతున్నాయి. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

పర్సన్-టు-మర్చంట్
ఎన్‌పీసీఐ ప్రకారం.. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) యూపీఐ లావాదేవీలకు మాత్రమే ఎండీఆర్‌ వర్తిస్తుంది. రూ.2,000 వరకు జరిగే లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్‌ ఉండదు. కాబట్టి వాటిపై జీఎస్టీ భారం కూడా ఉండదు. దేశంలో జరిగే మొత్తం యూపీఐ మర్చంట్ లావాదేవీల్లో 96 శాతానికి పైగా రూ.2,000 లోపువేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే, ఎక్కువ శాతం లావాదేవీలపై ఈ నిబంధనల ప్రభావం ఉండదు.

అంతే కాకుండా.. నెలకు రూ.1 లక్ష వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులు ఎండీఆర్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల వారికి జీఎస్టీ భారం కూడా ఉండదు.

రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై ఎండీఆర్‌ చెల్లించే వ్యాపారులు, ఆ ఎండీఆర్‌పై చెల్లించిన జీఎస్టీకి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందవచ్చు. అంటే.. వారు తమ వస్తువులు లేదా సేవలపై చెల్లించాల్సిన జీఎస్టీ నుంచి ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. దీంతో వ్యాపారులపై అదనపు జీఎస్టీ భారం ఉండదని ఎన్‌పీసీఐ తెలిపింది.

పర్సన్-టు-పర్సన్
ఇక వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే పర్సన్-టు-పర్సన్ (పీ2పీ) యూపీఐ లావాదేవీలపై ఈ నిబంధనలు వర్తించవు. ఎంత మొత్తాన్ని బదిలీ చేసినా పీ2పీ చెల్లింపులు ఎప్పటిలాగే ఉచితంగానే కొనసాగుతాయి.

ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఎండీఆర్‌ అనేది ప్రభుత్వం లేదా ఎన్‌పీసీఐ వసూలు చేసే పన్ను కాదు. యూపీఐ వ్యవస్థను నిర్వహించడం, అభివృద్ధి చేయడం కోసం బ్యాంకులు, పేమెంట్ యాప్‌ల వంటి భాగస్వాములకు చెల్లించే రుసుము మాత్రమే.

కొత్త నిబంధనల ప్రకారం.. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన పీ2ఎం లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఎండీఆర్‌ గరిష్ఠంగా రూ.300గా పరిమితం చేశారు. రైల్వే, టెలికాం, ఇంధనం, వ్యవసాయం వంటి ముఖ్యమైన, తక్కువ మార్జిన్ ఉన్న రంగాల్లో రూ.2,000 దాటిన లావాదేవీలకు ఒక్కో లావాదేవీకి కేవలం రూ.5 ఫ్లాట్ ఛార్జీ మాత్రమే ఉంటుందని ఎన్‌పీసీఐ వివరించింది.

ఇదీ చదవండి: ముఖంతో సంపాదన.. ఏకంగా రూ.14 లక్షల వరకు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement