దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వరుసగా వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి కేసులను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం.. వీటిని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారించనుంది. ఈ ఘటనలు 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తు చేస్తున్నాయని పేర్కొన్న ధర్మాసనం.. చట్ట అమలు, ప్రజా భద్రతను కాపాడటంలో వ్యవస్థ వైఫల్యాలను ఈ వరుస ఘటనలు స్పష్టంగా చూపిస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఈ ఒక్క సెప్టెంబర్‌లోనే 13 లైంగిక దాడుల కేసులు నమోదు అయ్యాయి. ఈ వరుస అత్యాచార ఘటనలను సోమవారం సుమోటో కేసుగా స్వీకరించిన జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్ ధర్మాసనం.. విచారణకు ఈ పిల్‌ను లిస్టింగ్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే ఈ ఘటనలు ‘‘ఇలా అనకుండా ఉండలేకపోతున్నాం. తాజా కేసుల్లో నిర్భయ ఘటనతో బాధాకరమైన పోలికలు కనిపిస్తున్నాయి’’ అని జస్టిస్ పర్దీవాలా వ్యాఖ్యానించారు.
2012లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరగడం, అనంతరం ఆమె మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆ ఘటన తర్వాత లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాల్లో పలు కీలక మార్పులు చేశారు. అయితే ఇటీవలి ఘటనల్లోనూ మహిళలు, బాలికలకు బహిరంగ ప్రదేశాల్లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని స్వయంగా విచారణకు తీసుకుంది.
పార్కులు, బస్సులు హైరిస్క్ జోన్లుగా మారొద్దు
పార్కులు, బస్సులు వంటి ప్రజా ప్రదేశాలు సరైన లైటింగ్, నిఘా, ఇతర మౌలిక సదుపాయాల కొరత కారణంగా ప్రమాదకర ప్రాంతాలుగా మారకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం ఘటనలపై సానుభూతి వ్యక్తం చేయడం సరిపోదని.. బాధ్యతను నిర్ధారించే వ్యవస్థ ఉండాలని జస్టిస్ పర్దీవాలా స్పష్టం చేశారు.
ఇటీవల ఢిల్లీలోని కల్కాజీ మందిరం సమీపంలోని ఆస్తా కుంజ్ పార్క్‌లో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులమంటూ బాలిక, ఆమె స్నేహితుడిని బెదిరించి ఘటనకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సెప్టెంబర్ 21న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన పార్కులో ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం, సరైన లైటింగ్ లేకపోవడం, కొన్ని గేట్లు సిబ్బంది లేకుండా ఉండటం వంటి భద్రతా లోపాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
కదులుతున్న బస్సులోనూ దారుణం
ఇటీవలే నోయిడాకు వెళ్తున్న ఓ స్లీపర్ బస్సులో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన కేసును కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. బస్సులోని బెర్త్‌లకు తెరలు ఉండటం, సీసీటీవీ వ్యవస్థ పనిచేయకపోవడం వంటి అంశాలు నిందితులకు అనుకూలంగా మారాయన్న విషయాల్ని కోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. 2012 నిర్భయ ఘటన తర్వాత ప్రజా రవాణా, మహిళల భద్రతకు సంబంధించి పలు నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ.. వాటి అమలు తీరుపై తాజా ఘటనలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అభిప్రాయపడింది.
చట్టాలు ఉన్నా.. అమలు ఎలా?
మహిళలు, బాలికలకు భద్రత కల్పించేందుకు చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటిని క్షేత్రస్థాయిలో ఎంత సమర్థంగా అమలు చేస్తున్నారన్నదే కీలకమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో వెలుతురు, సీసీటీవీలు, నిఘా, భద్రతా సిబ్బంది వంటి కనీస సదుపాయాల లోపాలపై కూడా కోర్టు దృష్టి సారించింది. కేవలం ఘటన జరిగిన తర్వాత స్పందించడం కాకుండా.. ముందుగానే భద్రతా లోపాలను గుర్తించి, బాధ్యతను నిర్ధారించే వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో చోటుచేసుకున్న తాజా ఘటనలపై సుమోటో విచారణ ద్వారా ఈ అంశాలపై సుప్రీంకోర్టు తదుపరి చర్యలు, ఆదేశాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: బ్యాంకులు శనివారాలు మూసేస్తే మా సంగతేంటి?


