ఆయుధాలేమైనా మా దగ్గర కొంటారా? | Donald Trump asked Xi Jinping if China would like to buy US weapons | Sakshi
Sakshi News home page

ఆయుధాలేమైనా మా దగ్గర కొంటారా?

Sep 29 2026 5:36 AM | Updated on Sep 29 2026 5:36 AM

 Donald Trump asked Xi Jinping if China would like to buy US weapons

జిన్‌పింగ్‌తో ట్రంప్‌ వ్యాపార యత్నం? 

వెల్లడించిన అమెరికా రాయబారి  

వాషింగ్టన్‌: మూడు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయుధాలు అమ్మే ప్రయత్నం చేశారా? అవునంటున్నారు డేవిడ్‌ పర్‌డ్యూ. తైవాన్‌కు ఆయుధాలు అందించే విషయంలో జరుగుతున్న జాప్యం కూడా సరైందేనని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు  చైనాలో అమెరికా రాయబారిగా వ్యవహరిస్తున్న పర్‌డ్యూ తెలిపారు. 

ఫాక్స్‌ న్యూస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అయితే షీ పర్యటనలో కచ్చితంగా ఏ సందర్భంలో ట్రంప్‌ ఆ ప్రతిపాదన చేసిందీ ఆయన స్పష్టం చేయలేదు. తైవాన్‌ విషయంలో చైనాను మెప్పించేందుకే అమెరికా ఆ దేశానికి ఆయుధాల సరఫరాలో జాప్యం చేస్తోందా? అన్న టీవీ వ్యాఖ్యా త బ్రీమ్‌ ప్రశ్నపై పర్‌డ్యూ స్పందిస్తూ... తైవాన్‌ విషయంలో ట్రంప్‌ మునుపు ఎవరూ లేనంత కృత నిశ్చయంతో ఉన్నారని, ఇప్పటివరకూ చాలా ఆయుధాలు అమ్మారని తెలిపారు. భవిష్యత్తులో ఆ దేశానికి ఆయుధాలు అమ్మే విషయమై ట్రంప్, షీలు చర్చలు జరుపుతారని తెలిపారు.

 ‘‘అయితే.... తాము ప్రపంచంలో ఇతరులకు కూడా ఆయుధాలు అమ్ముతూనే ఉంటామని ట్రంప్‌ చెబుతూంటారు’’అని గుర్తు చేశారు. ‘‘వాస్తవానికి ఆయన ఒక దశలో ఆయుధాలు ఏమైనా కొంటారా? అని షీ జిన్‌పింగ్‌ను కూడా అడిగారు’’అని అన్నారు.  అమెరికా స్వయం ప్రతిపత్తి గల తైవాన్‌ను ఒక దేశంగా గుర్తించదు కానీ.. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు అందించవచ్చునని ఆ దేశ చట్టాలే చెబుతున్నాయి. 

అంతర్జాతీయ స్థాయిలో తైవాన్‌ను సమర్థించే, ఆయుధాలు సరఫరా చేసే అతిపెద్ద దేశం కూడా అమెరికానే. అయితే చైనా ఎప్పుడైనా తైవాన్‌పై దాడికి దిగితే రక్షణ కోసం అమెరికా మిలటరీని కూడా పంపుతుందా? అన్న విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు తైవాన్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలని చైనా కోరుతోంది. ఈ ఏడాది మేలో చైనా పర్యటన సందర్భంగానూ షీ ఈ విషయాన్ని ట్రంప్‌ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆసక్తికరంగా ఆ సమావేశం తరువాత సుమారు 1,400 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల అమ్మకాన్ని అమెరికా వాయిదా వేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement